Sonam Wangchuk
హిమాలయాల ఒడిలో ఉండే లడాఖ్ హక్కుల కోసం, అక్కడి వారి అస్తిత్వం కోసం సాగుతున్న పోరాటంలో ఇప్పుడు సోనమ్ వాంగ్‌చుక్(Sonam Wangchuk) పేరే దేశవ్యాప్తంగా మారుమోగిపోతోంది. ఒకప్పుడు విద్యా సంస్కర్తగా, సరికొత్త ఆవిష్కర్తగా మాత్రమే ప్రపంచానికి తెలిసిన సోనమ్.. ఇప్పుడు లడాఖ్‌కు రాష్ట్ర హోదాను కల్పించాలంటూ సీరియస్‌గా చేస్తున్న డిమాండ్‌తో ప్రజా నాయకుడిగా అవతరించారు.
అయితే ఈ పోరాటంలో సోనమ్ వాంగ్‌చుక్ చుట్టూ మద్దతు ఏ స్థాయిలో ఉందో.. అంతేస్థాయిలో విమర్శలు, వివాదాలు కూడా ముసురుతున్నాయి. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కోసం వినూత్న ప్రయోగాలు చేసిన ఒక మేధావి, ఈరోజు పొలిటికల్ పోరాటాల నడిబొడ్డున నిలబడటం వెనుకున్న అసలు కథ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
లడాఖ్ మట్టిలోనే పుట్టి పెరిగిన సోనమ్ వాంగ్‌చుక్.. బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు పొందారు. మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి.. కేవలం డిగ్రీలతో ఆగిపోకుండా సొసైటీలో మార్పు కోసం ఆలోచించారు. హిమాలయాల వంటి మారుమూల ప్రాంతాల్లోని పిల్లలకు పుస్తకాల చదువుల కంటే ప్రాక్టికల్ విజ్ఞానం అవసరమని గుర్తించి, ఒక ప్రత్యేకమైన ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్‌ను స్థాపించి ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపారు.
సోనమ్(Sonam Wangchuk) లైఫ్‌లోని విషయాలు, ఎడ్యుకేషనల్ పాలసీస్ ఆధారంగానే బాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్ సినిమా త్రీ ఇడియట్స్ తెరకెక్కిందంటేనే.. ఈయన ఆలోచనలు ఎలాంటి ఎఫెక్ట్ చూపించాయో అర్థం చేసుకోవచ్చు. కేవలం విద్యకే పరిమితం కాకుండా, ఎడారి వంటి కొండ ప్రాంతాల్లో నీటి ఎద్దడిని తట్టుకోవడానికి ఈయన కనుగొన్న మంచు స్తూపాలు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాయి.
ఇలాంటి శాంతియుత మేధావి ఇప్పుడు లడాఖ్ ప్రజల భవిష్యత్తు కోసం, ఆ ప్రాంతం కోసం వీధులకెక్కారు. లడాఖ్‌కు పూర్తిస్థాయి స్టేట్ హోదా కల్పించడం లేదంటే.. రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ కింద ప్రత్యేక రక్షణలు అయినా కల్పించాలన్నది సోనమ్ వాంగ్‌చుక్ మెయిన్ డిమాండ్. స్థానిక భూములు, ఉద్యోగాలు, అక్కడి అరుదైన కల్చర్‌ను కాపాడుకోవడానికి కేంద్ర ప్రభుత్వ పాలన కంటే ..అక్కడే ఉంటున్న స్థానిక ప్రజలకే ఎక్కువ హక్కులు ఉండాలనేది వాంగ్‌చుక్ వాదన.
దీని కోసం సోనమ్ నిరాహార దీక్షలు చేస్తూ ప్రజల్లో చైతన్యం తెచ్చారు. అయితే, గతేడాది లేహ్‌లో జరిగిన కొన్ని హింసాత్మక ఘటనల తర్వాత ఈ పరిస్థితులన్నీ పూర్తిగా మారిపోయాయనే చెప్పొచ్చు. ఆయన ప్రసంగాల వల్లే అక్కడ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయంటూ పోలీసులు ఆయనను అరెస్ట్ చేయడం, సోనమ్ నడుపుతున్న స్వచ్ఛంద సంస్థ లైసెన్సులను రద్దు చేయడం వంటి చర్యలు దేశవ్యాప్తంగా కలకలాన్ని రేపాయి.
ఈ పరిణామాల వల్లే సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. ఒక వర్గం ప్రజలు సోనమ్‌ను లడాఖ్ హక్కుల కోసం ప్రాణాలను కూడా లెక్కచేయకుండా పోరాడుతున్న ఒక నిజమైన హీరోగా అభివర్ణిస్తున్నారు. పర్యావరణాన్ని, స్థానిక ఉపాధిని కాపాడటానికి సోనమ్ చేస్తున్న పోరాటం న్యాయమైనదని మద్దతు పలుకుతున్నారు.
కానీ మరో వర్గం మాత్రం ఎలాంటి ఆశయమైనా సరే చట్టబద్ధంగా, శాంతియుతంగా ఉండాలని కానీ.. ఇలాంటి ఆందోళనల వల్ల ప్రజా జీవనానికి భంగం కలుగుతుందని ఇదేమంత సమర్థనీయం కాదని విమర్శిస్తున్నారు.దీనికి తోడు విదేశీ నిధుల నిబంధనల ఉల్లంఘన ఆరోపణలు కూడా సోనమ్ వాంగ్‌చుక్ చుట్టూ చేరడంతో ఈ వివాదం మరింత ముదిరింది.
విద్యావేత్తల పరంగా చూస్తే కనుక సోనమ్ చేసిన విద్యా సంస్కరణలపై ఇప్పటికీ ఎంతోమందికి ఆయనపై అపారమైన గౌరవం ఉంది. ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ రూపురేఖలను మార్చడంలో ఆయన పాత్రను ఎవరూ కాదనలేరు. అయితే రాజకీయ వేదికలపై సోనమ్ తీసుకుంటున్న నిర్ణయాలు..లేహ్ ఘటనను ఎగ్జాంపుల్‌గా చెబుతూ ప్రజా భద్రతను ఇబ్బందుల్లో పడేయకూడదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
మొత్తంగా ఒకవైపు పర్యావరణ వేత్తగా, మరోవైపు హక్కుల పోరాట యోధుడిగా కనిపిస్తున్న సోనమ్ వాంగ్‌చుక్(Sonam Wangchuk) కథ కేవలం ఒక వ్యక్తికి సంబంధించినది కాదు. ఇది ఒక ప్రాంతీయ గుర్తింపు, రాజకీయ హక్కులు , కేంద్ర రాష్ట్రాల సంబంధాల నడుమ సోనమ్ నడిపిస్తున్న ఒక పెద్ద పోరాటం. దీనిపై భిన్నాభిప్రాయాలు ఉన్నా .. సోనమ్ ఈజ్ రియల్ హీరో అన్నవాళ్లే ఎక్కువ. అందుకే హిమాలయాల భవిష్యత్తు కోసం సోనమ్ రేపిన ఆలోచనల మంట మాత్రం ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు.
Dengue : డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయ్..పగటిపూట తిరిగే ఆ దోమలతో తస్మాత్ జాగ్రత్త..
