Alla Nani : ఆళ్ల నాని ఆకస్మిక మరణంపై నేతల సంతాపాలు.. సొంతూరులోనే అంత్యక్రియలు..

Alla Nani : ఏలూరు మట్టితో విడదీయరాని అనుబంధం ఉన్న ఆళ్ల నాని పూర్తి పేరు ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్.

Alla Nani

ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌లో వివాదాలకు దూరంగా, ఎప్పుడూ సౌమ్యంగా కనిపించే ఏలూరు సీనియర్ నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ఇకలేరనే వార్త రాష్ట్ర రాజకీయ వర్గాలను తీవ్ర షాక్‌కు గురిచేసింది. 57 ఏళ్ల వయసులోనే, విశాఖపట్నం సీతమ్మధారలోని తన ఇంట్లో మంగళవారం మధ్యాహ్నం 12 గంటల టైమ్‌లో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. మూడు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూసిన కీలక నేత ఇలా అకస్మాత్తుగా కన్నుమూయడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది.

ఏలూరు మట్టితో విడదీయరాని అనుబంధం ఉన్న ఆళ్ల నాని పూర్తి పేరు ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్. ఈయన 1969 డిసెంబర్ 30న జన్మించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు అమెరికాలోనూ, చిన్న కుమారుడు ఇంగ్లాండ్‌లోనూ హయ్యర్ స్టడీస్ పూర్తి చేశారు.

1994లో కాంగ్రెస్ పార్టీతో తన పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఆళ్ల నాని.. ప్రారంభంలో 1994, 1999 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటములు ఎదురైనా కూడా నాని ఎక్కడా అధైర్యపడలేదు. గ్రౌండ్ లెవల్‌లో జనం మధ్యే ఉంటూ తన బలాన్ని ఇంకా పెంచుకున్నారు. దీంతోనే 2004లో టీడీపీ అభ్యర్థి అంబికా కృష్ణపై భారీ విజయాన్ని సాధించి మొట్టమొదటి సారి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత 2013 వరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేగానే కొనసాగారు.

వైసీపీ ఆవిర్భావించిన తర్వాత 2013లో కాంగ్రెస్‌కు, తన ఎమ్మెల్యే పోస్టుకు కూడా గుడ్‌బై చెప్పి జగన్ వెంటే నడిచారు. 2014 అసెంబ్లీ ఎలక్షన్స్‌లో ఓటమి ఎదురైనా, 2017లో వైసీపీ తరఫున ఎమ్మెల్సీగా గెలిచారు. ఆపై 2019 ఎన్నికల్లో కూడా ఏలూరు నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా ఘనవిజయాన్ని సాధించిన ఆళ్లనాని.. జగన్ కేబినెట్‌లో డిప్యూటీ సీఎంగా, అత్యంత కీలకమైన వైద్యారోగ్య శాఖ మంత్రిగానూ బాధ్యతలు నిర్వహించి నియోజకవర్గానికి తనవంతు సేవలను అందించారు.

2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత మారిన పరిస్థితుల మధ్య ఆగస్టు 17న వైసీపీని వీడిన నాని,, ఆ తర్వాత 2025 ఫిబ్రవరి 13న అధికార టీడీపీలో చేరారు. అయితే పార్టీ మారినా కూడా కొంతకాలంగా ఆయన యాక్టివ్ పాలిటిక్స్‌కు కాస్త దూరంగానే ఉంటున్నారు.

Alla Nani

కాగా ఆళ్ల నాని భౌతికకాయాన్ని విశాఖ నుంచి ఏలూరులోని ఆయన స్వగృహానికి తరలించి అక్కడే అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆళ్ల నాని మృతిపై సీఎం చంద్రబాబు, మంత్రి నారాలోకేష్, వైసీపీ అధినేత వైఎస్ జగన్, ఇతర రాజకీయ ప్రముఖులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నాని కుటుంబానికి దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థించారు.

పదవులు వచ్చినా, ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఎప్పుడూ తన మార్కు సౌమ్యతను వీడని ఆళ్ల నాని నిష్క్రమణ ఏపీ రాజకీయాల్లో ఒక పెద్ద శూన్యాన్ని మిగిల్చింది. నిన్నటివరకు తమ మధ్యే తిరిగిన నేత, ఇలా ఒక్కసారిగా జ్ఞాపకంగా మారిపోవడాన్ని ఆళ్ల నాని కుటుంబసభ్యులు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఏది ఏమయినా ఒక క్లీన్ పొలిటీషియన్‌గా నాని(Alla Nani) వేసిన ముద్ర ఏపీ పాలిటిక్స్‌లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

Nagole Eco Ganesha : ఖైరతాబాద్‌ గణేష్‌ను మించిన ఎత్తు..అష్టసిద్ధి మహాగణపతి విశేషాలేంటి?

Exit mobile version