AP Rain Alert : ఉత్తరాంధ్రపై వాయుగుండం పంజా..ఆ జిల్లాలలో స్కూల్స్‌కు సెలవులు

AP Rain Alert : తీవ్ర వాయుగుండం ఇప్పుడు కళింగపట్నానికి 140 కి.మీటర్లు, గోపాల్‌పూర్‌కు 150 కి.మీటర్లు, విశాఖపట్నానికి 220 కి.మీటర్ల దూరంలో కేంద్రీకృతమై పశ్చిమ-వాయువ్య దిశగా వేగంగా కదులుతోంది.

AP Rain Alert

ఆకాశానికి చిల్లు పడినట్లుగా నాన్ స్టాప్ వానలు ఉత్తరాంధ్రను పిండేస్తున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం మరింత తీవ్రంగా తీరం వైపు దూసుకొస్తోంది. బుధవారం (సెప్టెంబర్ 23) రాత్రి సమయానికి ఇది విశాఖ, ఒడిశాలోని గోపాల్‌పూర్ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీరం దాటే సమయంలో గంటకు 50 నుంచి 70 కి.మీటర్ల తుపాను గాలులు విరుచుకుపడతాయని, పైగా బుధవారం ఉదయం 11:30 వరకు ఆకస్మికంగా వరదలు ముంచెత్తే ప్రమాదముందని హెచ్చరించింది.

ఈ తీవ్ర వాయుగుండం ఇప్పుడు కళింగపట్నానికి 140 కి.మీటర్లు, గోపాల్‌పూర్‌కు 150 కి.మీటర్లు, విశాఖపట్నానికి 220 కి.మీటర్ల దూరంలో కేంద్రీకృతమై పశ్చిమ-వాయువ్య దిశగా వేగంగా కదులుతోంది.

వచ్చే 24 గంటల్లో భారీ వర్షాల ముప్పు ఉండటంతో.. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాకు రెడ్ అలర్ట్ .. విశాఖ పట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ అలాగే కాకినాడ, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. భారీ వర్షాల వల్ల సముద్రం బాగా ఉగ్రరూపం దాల్చడంతో విశాఖపట్నం, గంగవరం, కళింగపట్నం పోర్టుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక, కృష్ణపట్నంలో 1వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.

మరోవైపు ఈ వర్షాల వల్ల స్టూడెంట్స్ ఇబ్బంది పడకూడదని విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని స్కూల్స్‌కు అధికారులు బుధవారం రోజు సెలవు ప్రకటించారు.

AP Rain Alert

సోమవారం రాత్రి నుంచే పడుతున్న నాన్ స్టాప్ వర్షాలకు గింజేరుగెడ్డ పొంగిపొర్లుతుంది. దీంతో చంద్రంపేట-వసంత రోడ్డుపై రాకపోకలను క్లోజ్ చేశారు. మన్యం జిల్లా సాలూరు, గుమ్మలక్ష్మీపురం ప్రాంతాలలో వాగులన్నీ ఉధృతంగా పారుతున్నాయి. కళింగపట్నంలో కేవలం 3 గంటల్లోనే ఏకంగా 6 సె.మీటర్ల వర్షం కురవగా పలాస, రావివలస, సంతబొమ్మాళిల్లో 4 సెం.మీటర్లు, తుని, పిఠాపురంలో ఎడతెరిపి లేని వర్షాలు పడుతున్నాయి.

24 గంటలూ పని చేసే కంట్రోల్ రూమ్‌లు అన్ని జిల్లాలలో అందుబాటులో ఉంచాలని హోంమంత్రి అనిత ఆదేశించారు. చెట్లు, పాత గోడలు, పెద్ద హోర్డింగ్‌ల కింద ప్రజలెవరూ నిలబడొద్దని కోరారు. ఇటు నాగావళి, వంశధార, బహుదా, మహేంద్రతనయ నదులకు వరదలొచ్చే అవకాశం ఉండటంతో లోతట్టు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. ఎమర్జెన్సీ హెల్ప్ కోసం మన్యం జిల్లా కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ (89634 50347)ను ఏర్పాటు చేశారు.

Cabbage Storage : ఫ్రిడ్జ్‌లో పెట్టినా క్యాబేజీ కుళ్లిపోతోందా? ఈ చిన్న ట్రిక్ తెలుసుకోండి..

Exit mobile version