Chandrababu Naidu : చంద్రబాబు ‘మసాలా’ కామెంట్ల అర్థం ఏంటి? విజయ్ పార్టీ ఎందుకు సీరియస్‌గా తీసుకుంది?

Chandrababu Naidu : విశాఖపట్నంలో తాజాగా జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో చంద్రబాబు సరదాగా అన్న ఓ మాట ఇప్పుడు ఏపీ, తమిళనాడు మధ్య పారిశ్రామిక పోటీని పొలిటికల్ చర్చగా మార్చింది.

Chandrababu Naidu

పాలిటిక్స్‌లో కొన్నిసార్లు పెద్ద పెద్ద ప్రసంగాల కంటే చిన్నచిన్న మాటలే ఎక్కువ చర్చకు దారితీస్తుంటాయి. ముఖ్యంగా రెండు రాష్ట్రాల మధ్య పోటీ, పొలిటికల్ విభేదాలు ఉన్నప్పుడు అగ్ర నేతలు మాట్లాడే ప్రతి మాటకు రకరకాల అర్థాలు తీస్తుంటారు. ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన మసాలా కామెంట్‌ కూడా ఇలాగే వివాదానికి కేంద్రబిందువుగా మారింది.

విశాఖపట్నంలో తాజాగా జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో చంద్రబాబు(Chandrababu Naidu) సరదాగా అన్న ఓ మాట ఇప్పుడు ఏపీ, తమిళనాడు మధ్య పారిశ్రామిక పోటీని పొలిటికల్ చర్చగా మార్చింది. విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ దీనిపై ఘాటుగా స్పందించడంతో ఈ వ్యవహారం మరింత ఆసక్తికరంగా మారింది.

విశాఖలో నిర్వహించిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఇండస్ట్రీలు, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలపై చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ రిపోర్టర్ తమిళనాడు నుంచి కొన్ని కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌లో తమ కార్యకలాపాలను విస్తరించడానికి ఇంట్రస్ట్ చూపిస్తున్న అంశాన్ని ప్రస్తావించారు. పరిశ్రమలను తమ రాష్ట్రంలోనే నిలుపుకోవడంలో పొలిటికల్ లీడర్షిప్‌ రోల్ ఎంతవరకు ఉంటుందనే కోణంలో ప్రశ్నించారు.

దీనికి సమాధానమిచ్చిన చంద్రబాబు.. మీకు మసాలా కావాలి.. నాకు ఫలితాలు కావాలంటూ చిరునవ్వుతో చెప్పారు. అంటే వార్తల్లో సంచలనం, వివాదం, పొలిటికల్ కోణం వెతకడం కంటే తనకు రాష్ట్రానికి పెట్టుబడులు రావడం, ఇండస్ట్రీలు ఏర్పాటు కావడం, ప్రజలకు ఉద్యోగాలు కల్పించడం ముఖ్యమనే ఉద్దేశంతో సీఎం సమాధానమిచ్చారు.

అంతేకాని ఆయన డైరెక్టుగా తమిళనాడు ప్రభుత్వాన్ని ఉద్దేశించి మీకు మసాలా కావాలని అనలేదు. మీడియా ప్రశ్నకు సమాధానంగానే ఆ వ్యాఖ్య చేశారు. అయితే ఈ ప్రశ్న తమిళనాడు నుంచి ఏపీకి పరిశ్రమల విస్తరణకు సంబంధించినది కావడంతో ఈ మాటకు మరో పొలిటికల్ మీనింగ్ యాడ్ అయింది.

తమిళనాడు రాష్ట్రం పారిశ్రామికంగా దేశంలోనే బలమైన స్టేట్స్‌లో ఒకటి. ఆటోమొబైల్ తయారీ, ఎలక్ట్రానిక్స్, ఐటీ, క్లాత్ ఇండస్ట్రీస్, హెవీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్‌లో తమిళనాడుకు దశాబ్దాలుగా ప్రత్యేక గుర్తింపు ఉంది. నైపుణ్యం కలిగిన కార్మికులు, విద్యాసంస్థలు, పారిశ్రామిక మౌలిక సదుపాయాలు మెయిన్ స్ట్రెంత్‌గా ఉన్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో తమిళనాడు నుంచి ఏపీకి ఇండస్ట్రీలు వస్తున్నాయనే అంశంపై ప్రశ్న ఎదురైనప్పుడు ఏపీ సీఎం(Chandrababu Naidu) చేసిన మసాలా కామెంట్‌ను టీవీకే మరో కోణంలో చూసింది. తమ రాష్ట్ర పారిశ్రామిక ప్రగతిని కేవలం రాజకీయ చర్చగానో, మీడియా సంచలనంగానో చూపిస్తున్నారనే భావనతో ఆ పార్టీ అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది.

దీనిపై రియాక్ట్ అయిన టీవీకే జాతీయ అధికార ప్రతినిధి, సీనియర్ న్యాయవాది సత్యకుమార్ తమిళనాడు పారిశ్రామిక వ్యవస్థ ఒక్కరోజులోనే ఏర్పడలేదని గుర్తు చేశారు. తరతరాలుగా ప్రజలు చేసిన కృషి, నాణ్యమైన విద్య, టెక్నికల్ నాలెడ్జ్‌, నైపుణ్యం కలిగిన మానవ వనరుల వల్లే ఆ రాష్ట్రం ఈ స్థాయికి చేరుకుందని పేర్కొన్నారు. అలాంటి ఇండస్ట్రియల్ కెపాసిటీని తేలిగ్గా తీసుకోవడం సరికాదని అభిప్రాయపడ్డారు.

ఈ వివాదాన్ని కేవలం మసాలా ఒక పదంపైన వచ్చిన అభ్యంతరంగా మాత్రమే చూడలేం. ఎందుకంటే టీవీకే స్పందనలో పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనతో పాటు తమిళనాడు రాష్ట్ర సెల్ఫ్ రెస్పెక్ట్, పొలిటికల్ ఐడియాలజీ కూడా ప్రస్తావనకు వచ్చాయి.

2027 జనవరిలో స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సు సందర్భంగా రెండు రాష్ట్రాల పని తీరును పోల్చుకుందామని కూడా సత్యకుమార్ సవాల్ విసిరారు. ఏ స్టేట్ ఎక్కువ పెట్టుబడులను సాధించింది? ఎన్ని ప్రాజెక్టులు నిజంగా స్టార్ట్‌ అయ్యాయి? ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారనే అంశాల ఆధారంగా పోటీ పడదామని ప్రకటించారు.

అంతేకాదు, తమిళనాడు డెవలప్మెంట్‌ జర్నీ పెరియార్, అన్నాదురై వంటి నేతలు ముందుకు తీసుకొచ్చిన సామాజిక న్యాయం, స్టేట్ ఆటోనమీ, ఆత్మగౌరవ భావనలతో ముడిపడి ఉందని అన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకోకుండానే డెవలప్మెంట్ సాధిస్తామని చెప్పడం వల్ల ఈ కాంట్రవర్సీకి పొలిటికల్ యాంగిల్‌ను కూడా యాడ్ చేశారు. చంద్రబాబు పొలిటికల్ పొత్తులపైన కూడా పరోక్ష విమర్శలు చేశారు.

నిజానికి 2 రాష్ట్రాల మధ్య పెట్టుబడుల కోసం పోటీ కొత్త విషయం కాదు. పరిశ్రమలు ఎక్కడ ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకునేటప్పుడు కంపెనీలు భూమి లభ్యత, ట్రాన్స్‌పోర్టేషన్ ఫెసిలిటీస్, పవర్, నీటి వసతి, కార్మికుల నైపుణ్యం, గవర్నమెంట్ సబ్సిడీల, మార్కెట్లకు చేరువ వంటి అనేక అంశాలను పరిశీలిస్తాయి.

ఏపీ ప్రభుత్వం కొత్త ఇండస్ట్రీలను ఆకర్షించడానికి భూమి, రాయితీలు, మౌలిక సదుపాయాల కల్పనపై ఫోకస్ పెడుతోంది. స్టార్టింగ్ స్టేజిలో ఎక్కువ ప్రోత్సాహకాలు ఇచ్చి పరిశ్రమల పునాది బలపడిన తర్వాత వాటిని తగ్గించొచ్చని చంద్రబాబు కూడా తన విధానాన్ని వివరించారు. మరోవైపు తమిళనాడుకు ఇప్పటికే బలమైన పారిశ్రామిక వ్యవస్థ, అనుభవజ్ఞులైన కార్మికులు, సరఫరా వ్యవస్థలు ఉన్నాయి.

ప్రస్తుతానికి ఈ వ్యవహారం పొలిటికల్ విమర్శలు, ప్రతివిమర్శల స్థాయిలో కొనసాగే ఛాన్స్ కనిపిస్తోంది. ఎందుకంటే టీవీకే ఇప్పటికే దావోస్ వేదికగా పెట్టుబడులు, ప్రాజెక్టులు, ఉద్యోగాలపై పోటీకి సవాల్ విసిరింది. దీనికి ఏపీ గవర్నమెంట్ లేదా టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారనేది కీలకం. చంద్రబాబు కామెంట్లను సమర్థించుకుంటూ రియాక్టవుతారా లేక వివాదాన్ని పక్కనపెట్టి పెట్టుబడుల అంశానికే పరిమితమవుతారా అనేది చూడాలి.

Office Politics : ఆఫీస్ పాలిటిక్స్.. ఆఫీసులో ఉండే ఆ 4 రకాల మనుషులు మీ దగ్గరా ఉన్నారా?

↑
Exit mobile version