IAS Amrapali
తెలుగు రాష్ట్రాల బ్యూరోక్రసీలో ఐఏఎస్ అధికారుల కేడర్ కేటాయింపుల ఇష్యూ ఎప్పుడూ ఒక హాట్ టాపిక్‌గానే నడుస్తుంటుంది. అందులో ప్రజల్లో విపరీతమైన గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలి కేడర్ వివాదానికి సంబంధించి తెలంగాణ హైకోర్టులో అత్యంత కీలక పరిణామం చోటు చేసుకుంది.
ఆమె కేంద్ర ప్రభుత్వ కేటాయింపులను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై రెండు పక్షాల వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం ధర్మాసనం ఫైనల్ తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. దీంతో ఆమ్రపాలి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లోనే సేవలు అందిస్తారా లేదా తనకు ఎంతో ఇష్టమైన తెలంగాణలోనే కొనసాగుతారా అనే అంశంపై అంతా ఉత్కంఠ నెలకొంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి..ఈ కేడర్ పంచాయితీ కొనసాగుతూనే ఉంది. విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం ఆమ్రపాలిని(IAS Amrapali) అఫీషియల్‌గా ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు కేటాయిస్తూ క్లియర్ ప్రొసీడింగ్స్ జారీ చేసింది. అయితే ఈ కేటాయింపును తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆమె సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్)ను ఆశ్రయించారు.
సుదీర్ఘంగా సాగిన విచారణలో సెంట్రల్ గవర్నమెంట్ జీవో రద్దు చేసిన క్యాట్.. ఆమ్రపాలిని(IAS Amrapali) తెలంగాణ కేడర్‌కే కేటాయించాలంటూ అనుకూలమైన ఆర్డర్స్ జారీ చేసింది. కానీ క్యాట్ ఇచ్చిన ఈ తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం, ఇతర వర్గాలు హైకోర్టును ఆశ్రయించడంతో, ఉన్నత న్యాయస్థానం ఆ ఉత్తర్వులపై స్టే విధించింది. దీంతో క్యాట్ ఆదేశాల అమలు ఆగిపోయి వివాదం మళ్లీ మొదటికి వచ్చింది.
ఈ సందర్భంగా హైకోర్టు విధించిన స్టే ఉత్తర్వులను సవాల్ చేస్తూ.. ఆమ్రపాలి(IAS Amrapali) స్వయంగా ఉన్నత న్యాయస్థానంలో మరో పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం, రెండు పక్షాల న్యాయవాదుల వాదనలను కూలంకషంగా విన్నది.
అన్ని చట్టపరమైన అంశాలను, సర్వీస్ నిబంధలను పరిశీలించిన హైకోర్టు.. బెంచ్ తీర్పును రిజర్వ్‌లో ఉంచుతున్నట్లు ప్రకటించింది. ఈ లీగల్ వార్‌లో హైకోర్టు వెలువరించే ఫైనల్ జడ్జిమెంట్ ద్వారానే ఆమ్రపాలి కేడర్ కేటాయింపుపై పూర్తి క్లారిటీ రాబోతోంది. త్వరలోనే వెలువడబోయే ఈ తీర్పు ఇటు బ్యూరోక్రసీలోనూ, అటు రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారడం గ్యారంటీ అనిపిస్తోంది.
