Nakkalapalli Sarpanch Election
సాధారణంగా పంచాయతీ ఎన్నికలు వచ్చాయంటే చాలు.. గ్రామాలు పొలిటికల్ సందడితో హోరెత్తిపోతాయి. ఎవరి బలమెంత, పోటీలో ఎవరున్నారు, ప్రచారానికి ఎంత ఖర్చు చేయాలి, ఓటర్లను ఎలా ఆకర్షించాలంటూ ఊరి వారంతా ఎవరికి వారు గ్రూపు రాజకీయాలు, రచ్చలు మొదలు పెట్టేస్తారు.
కానీ అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం నక్కలపల్లి గ్రామంలో మాత్రం సర్పంచ్(Nakkalapalli Sarpanch Election) ఎంపిక కోసం పూర్తిగా ఓ విభిన్నమైన పద్ధతిని అనుసరించారు. ఇక్కడ ర్యాలీలు లేవు, ఓట్ల హామీలు అసలే లేవు, ప్రచార ఆర్భాటాలూ లేవు. పోటీ పడేవారు గ్రామాభివృద్ధికి ఎంత విరాళమిస్తారో చీటీలో రాసి వేస్తే చాలు, ఎక్కువ మొత్తం రాసిన వ్యక్తికే పదవి దక్కుతుంది.
ఈసారి నక్కలపల్లి సర్పంచ్ స్థానాన్ని(Nakkalapalli Sarpanch Election) జనరల్ మహిళకు కేటాయించడంతో ఈ ఊరిలోని ఆశావహులు తమ కుటుంబ సభ్యుల ద్వారా సర్పంచ్ పీఠాన్ని దక్కించుకోవడానికి సిద్ధమయ్యారు. గ్రామంలో రాజకీయ విభేదాలు, అనవసర ఎన్నికల ఖర్చులు తలెత్తకూడదనే ఉద్దేశంతో గ్రామస్తులంతా కలిసి ఒకచోట సమావేశమయ్యారు.
సర్పంచ్ పదవి ఆశిస్తున్న 9 మందిని పిలిచి, వారిలో ఎవరెవరు గ్రామాభివృద్ధికి తాము ఎంత ఇస్తామో ఒక చీటీపై రాసి డబ్బాలో వేయమని సూచించారు. ఆ చీటీలను తెరిచి చూడగా, సుదర్శనరెడ్డి అనే వ్యక్తి తన భార్య పేరుతో గ్రామాభివృద్ధికి ఏకంగా రూ.25.6 లక్షలు అందజేస్తానని రాసినట్లు తేలింది. పోటీలో ఉన్న మిగిలిన వారందరికంటే ఇదే ఎక్కువ మొత్తం కావడంతో, సుదర్శనరెడ్డి భార్యను సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎంపిక చేస్తున్నట్లు గ్రామస్తులంతా ప్రకటించారు.
నిజానికి నక్కలపల్లి గ్రామానికి ఈ చీటీల వేలం పద్ధతి కొత్తేమీ కాదు. గతంలో కూడా పంచాయతీ ఎన్నికల్లోనూ ఇదే విధానాన్ని పాటించారు. అప్పట్లో రామిరెడ్డి అనే వ్యక్తి గ్రామ అభివృద్ధి కోసం రూ.21 లక్షలు ఇస్తానని ప్రకటించి సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
అయితే ఈసారి ఆ మొత్తాన్ని మరింత ఎక్కువ చేస్తూ ఏకంగా రూ.25.6 లక్షల ఆఫర్ రావడం స్థానికంగా పెద్ద చర్చనీయాంశమైంది. ఒకవైపు కూటమి ప్రభుత్వం కూడా ఏకగ్రీవమయ్యే పంచాయతీలకు రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ప్రత్యేక ప్రోత్సాహక నిధులను ప్రకటించింది. దీనికి తోడు స్థానికంగా కూడా లక్షల రూపాయలు తోడవడం వల్ల గ్రామాభివృద్ధి వేగవంతమవుతుందని కొందరు భావిస్తున్నారు.
అయితే ఈ పద్ధతిపై 2 భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల గొడవలు లేకుండా, గ్రామాభివృద్ధికి వ్యక్తిగత నిధులు ఇలా సమకూరడం సానుకూల అంశమే అయినా .. డెమోక్రెటిక్ సిస్టంలో పదవులను డబ్బు ప్రాతిపదికన కేటాయించడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
లీడర్షిప్ స్కిల్స్, ప్రజలకు సేవ చేసే గుణం, గ్రామీణ సమస్యలపై అవగాహన ఉన్నవారి కంటే.. ఎక్కువ డబ్బు ఆఫర్ చేసిన వారికే ప్రయారిటీ ఇవ్వడం ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తుందనే ఆందోళన కూడా ఉంది. ఏది ఏమైనా, ప్రకటించిన రూ.25.6 లక్షలను సర్పంచ్ ఫ్యామిలీ ఎంతవరకు తమ గ్రామ అభివృద్ధికి ఖర్చు చేస్తుంది, ఆ నిధులతో గ్రామంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో అన్నదే తేలాల్సి ఉంటుంది.
