Secretariat Employees Protest
తమకు రావాల్సిన ప్రమోషన్ల కోసం, తమ హక్కుల కోసం రోడ్డెక్కిన సిబ్బంది నిరసనతో విజయవాడ నగరం ఒక్కసారిగా అట్టుడికిపోయింది. ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి వేలాదిమంది సచివాలయ సిబ్బంది ఒక్కసారిగా విజయవాడ గాంధీ నగర్ ధర్నా చౌక్ వైపు అడుగులు వేయడంతో అక్కడ పరిస్థితి రణరంగాన్ని తలపించింది. శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి వచ్చిన వారిని ఎక్కడికక్కడ అడ్డుకోవడానికి పోలీసులు ప్రయోగించిన బలప్రయోగం.. ధర్నా చౌక్, అలంకార్ కూడళ్లల్లో తీవ్ర ఘర్షణ వాతావరణానికి దారితీసింది.
ఆదివారం ఉదయం నుంచే ఏపీలోని వివిధ జిల్లాల నుంచి వేలాది మంది స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయ ఎంప్లాయిలంతా విజయవాడకు చేరుకున్నారు. ఏడేళ్ల నుంచి క్షేత్రస్థాయిలో సర్వీసులు అందిస్తున్నా కూడా.. తమకు రావాల్సిన ఉద్యోగ ప్రయోజనాలు, సౌకర్యాలు తమకు అందడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే ఉద్యోగులు ధర్నా(Secretariat Employees Protest) చౌక్‌కు చేరుకోవడానికి ముందే పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి వారిని ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. పోలీసుల వలయాన్ని ఛేదించుకుని ముందుకు వెళ్లడానికి నిరసనకారులు ప్రయత్నించడంతో రెండువర్గాల మధ్య తోపులాట జరిగింది.కొంతమంది ఉద్యోగులను అదుపులోకి తీసుకుని స్టేషన్లకు తరలించడానికి ప్రయత్నించిన సమయంలో ఉద్రిక్తత పెరిగింది.
మహిళా ఉద్యోగులను పోలీసులు బలవంతంగా వ్యాన్లలోకి ఎక్కించగా, కొంతమంది మహిళలు ఏకంగా నడుస్తున్న బస్సు కిటికీల్లోంచి కిందకు దూకేయడం దిగ్భ్రాంతికి గురి చేసింది. మరికొంతమంది ఉద్యోగులు వాహనాల ముందు రోడ్డుపై బైఠాయించి పోలీసుల చర్యలకు, ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
తాము ఏడేళ్ల క్రితం రిక్రూట్ అయినా కూడా ఇప్పటికీ ప్రమోషన్లపై ఎలాంటి క్లారిటీ లేదని సచివాలయ ఉద్యోగులు(Secretariat Employees Protest) ఆక్రోశం వెళ్లగక్కారు. అధికారులకు తాము ఎన్నిసార్లు వినతిపత్రాలు ఇచ్చినా ఫలితం లేకుండా పోయిందని, తమకు వెంటనే నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు.
వీటితో పాటు ఆగస్టు నుంచి రావలసిన 9 నెలల ఎరియర్స్‌ను వెంటనే ప్రకటించాలని, ప్రమోషన్ల ప్రాసెస్‌ను క్లియర్ చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. తమకు ప్రభుత్వం నుంచి లిఖితపూర్వక హామీ వచ్చేంత వరకు ఈ పోరాటాన్ని ఆపేదే లేదని ఉద్యోగ సంఘాల నాయకులు తెగేసి చెప్పారు. రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
కాగా దీనిపై ఏపీ సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి స్పందించి కూటమి ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేశారు. సచివాలయ ఉద్యోగుల సంక్షేమం పట్ల తమ గవర్నమెంట్ పూర్తి సానుకూల ధోరణితో ఉందని, గతంలో నిలిచిపోయిన రెగ్యులరైజేషన్‌ను కూడా కూటమి ప్రభుత్వమే అమలు చేసిందని గుర్తుచేశారు.
ఉద్యోగుల డిమాండ్‌కు సంబంధించి ఇప్పటికే నోషనల్ ఇంక్రిమెంట్స్ ఫైల్‌ను ఆర్థిక శాఖ పరిశీలనకు పంపించామని, దాన్ని సాధించే బాధ్యత పూర్తిగా తమదేనంటూ భరోసా ఇచ్చారు. ఇప్పటికే దాదాపు 14 వేల మందికి పైగా ప్రమోషన్లు కల్పించామని, మిగిలిన వారికి కూడా వచ్చే నెల రోజుల్లోనే ప్రమోషన్ల ప్రాసెస్ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఫ్యూచర్‌లో కొత్త పీఆర్సీ కమిషన్‌ను కూడా వేయబోతున్నామని ఆయన తెలిపారు.
అయితే ఓవైపు లిఖితపూర్వక హామీ ఇచ్చే వరకు తాము విరమించేది లేదని ఉద్యోగులు పట్టుబడుతుంటే, మరోవైపు నెల రోజుల్లో సమస్యలన్నీ పరిష్కరిస్తామని ప్రభుత్వం చెబుతోంది. మొత్తంగా విజయవాడలో నెలకొన్న ఈ ప్రతిష్టంభన ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి మరి.
TG SAFE Raids : రుచి సరే.. శుచి ఏది? కోట్లు కురిపించే స్టార్ హోటళ్ల కిచెన్లలో ఎలుకలు, పురుగులా?
