TTD
కలియుగ వైకుంఠ నిలయమైన తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకునే వృద్ధులు, దివ్యాంగులకు టీటీడీ ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది. ప్రతిరోజూ వెయ్యి మంది వృద్ధులకు, దివ్యాంగులకు శ్రీనివాసుడి ఉచిత దర్శనం కల్పించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి తాజాగా ఒక కీలక ప్రకటనలో వెల్లడించింది.
టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వయసు పైబడిన వారు, శారీరక ఇబ్బందులున్నవారు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చాలా ప్రశాంతంగా ఆ ఏడుకొండలవాడిని దర్శించుకోవచ్చు. ఈ ఉచిత దర్శన సదుపాయాన్ని ఎలా పొందాలి, ఏ సమయంలో వారిని అనుమతిస్తారు అలాగే వారు దళారుల బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా టీటీడీ అధికారులు వివరించారు.
ఈ ఉచిత దర్శన అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అనుకునే భక్తులు 3 నెలల ముందే ఆన్‌లైన్ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. టీటీడీ(TTD) ప్రతి నెలా ఈ స్పెషల్ కోటాకు సంబంధించిన టికెట్లను అఫీషియల్ వెబ్‌సైట్‌లో రిలీజ్ చేస్తుంది. ఆన్‌లైన్‌లో టికెట్ పొందిన భక్తులకు శ్రీవారి ఉచిత దర్శనంతో పాటు రూ. 50 విలువైన ఒక లడ్డూను కూడా టీటీడీ ఉచితంగా ఇవ్వనుంది.
తిరుమలలోని నంబి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన స్పెషల్ క్యూలైన్ ద్వారా.. వృద్ధులు, దివ్యాంగులను ప్రతిరోజూ 3 గంటలకు దర్శనానికి అనుమతిస్తారు. కాబట్టి భక్తులంతా టీటీడీ నిర్ణయించిన ఆ సమయానికి ముందే అక్కడికి చేరుకోవడం మంచిది.
ఇదే సమయంలో సోషల్ మీడియాలో సీనియర్ సిటిజన్లు, దివ్యాంగుల దర్శనాలపై వస్తున్న తప్పుడు ప్రచారాలను, వదంతులను భక్తులు అస్సలు నమ్మొద్దని టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా ఏడుకొండలవాడి దర్శన భాగ్యాన్ని త్వరగా కలిగిస్తామని, రూములు ఇప్పిస్తామని చెప్పే దళారులు, మధ్యవర్తుల మాటలు నమ్మి భక్తులెవరూ డబ్బులు పోగొట్టుకోవద్దని హెచ్చరించారు.
మరోవైపు భక్తుల అవసరాన్ని, భక్తిని ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడే కేటుగాళ్లపై టీటీడీ నిఘా విభాగం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఒకవేళ ఎవరైనా దళారులు భక్తులను సంప్రదించి డబ్బులు డిమాండ్ చేస్తే, వెంటనే టీటీడీ అఫీషియల్ హెల్ప్‌లైన్ నెంబర్ 155257 కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని అధికారులు తెలిపారు.
శ్రీనివాసుడి దర్శన టికెట్లు, లడ్డూలు, రూముల బుకింగ్స్ వంటి ఎలాంటి సమాచారం కోసమైనా భక్తులు కేవలం తిరుమల తిరుపతి దేవస్థానం అధికారిక వెబ్‌సైట్లు అయిన www.tirumala.org లేదా [https://ttdevastanams.ap.in],(https://ttdevastanams.ap.in) ను మాత్రమే సంప్రదించాలని అధికారులు క్లారిటీ ఇచ్చారు.
Rashi Phalalu : ఏ రాశుల వారికి లక్ష్మీ దేవి అనుగ్రహం..ఏ రాశి వారికి ఇబ్బందులు?
