Vangaveeti Radha
ఏపీ పాలిటిక్స్‌లో కార్పొరేషన్ ఎన్నికల షెడ్యూల్ రిలీజయ్యే టైమ్ దగ్గరపడుతుండటంతో ఒక్కసారిగా హీట్ పెరిగిపోయింది. మెయిన్‌గా అధికార ఎన్డీఏ కూటమిలో మేయర్ స్థానాల పంపకాలపై రసవత్తర సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. దీనిలో భాగంగానే జనసేన పార్టీకి 3 కీలకమైన కార్పొరేషన్లను కేటాయించబోతున్నారనే వార్త పొలిటికల్ సర్కిల్స్‌లో జోరుగా వినిపిస్తోంది.
మచిలీపట్నం, కాకినాడతో పాటు ఏపీ రాజకీయ రాజధానిగా పిలుచుకునే విజయవాడ మేయర్ పీఠాన్ని కూడా జనసేన పార్టీకే ఇవ్వడానికి కూటమి పెద్దలు మొగ్గు చూపించినట్లు న్యూస్ వినిపిస్తోంది. ఇప్పటికే మచిలీపట్నం, కాకినాడల్లో జనసేన ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తుండటంతో అక్కడ పోటీ కామనే అయినా.. ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా లేని విజయవాడను కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పట్టుబట్టి మరీ తమ అకౌంట్‌లో వేసుకున్నారని వార్త ఊపందుకుంది.
దీనిలో భాగంగానే బెజవాడ మేయర్ స్థానానికి జనసేన పార్టీ నుంచి కేండిడేట్ ఎవరనే దానిపై సరికొత్త రాజకీయ చర్చ మొదలైంది. అయితే ఇదే సమయంలో కాపు నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ(Vangaveeti Radha) ఫ్యామిలీ పేరు ఈ రేసులోకి రావడం హాట్ టాపిక్ అయింది. గతంలో సీఎం చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను రాధా వేర్వేరుగా కలవడం వెనుక ఈ ప్లానే ఉందా అన్న టాక్ నడుస్తోంది.
ఇద్దరి అగ్రనేతల అంగీకారంతోనే వంగవీటి రాధాను జనసేన పార్టీలోకి ఆహ్వానించి, ఆయననే విజయవాడ మేయర్ అభ్యర్థిగా బరిలోకి దించాలనే ప్లాన్ నడుస్తోందట. దీనికి ముహూర్తం కూడా ఫిక్స్ అయిందని, మరో 2 రోజుల్లో పవన్ సమక్షంలో రాధాకృష్ణ జనసేన కండువా కప్పుకోబోతున్నారని ఆ పార్టీ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
అయితే మేయర్ రేసులో వంగవీటి రాధా(Vangaveeti Radha)తో పాటు ఆయన సతీమణి పుష్పవల్లి పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. రాధా 2019 నుంచి టీడీపీలోనే కొనసాగుతుండగా, పుష్పవల్లి పేరెంట్స్ మాత్రం ప్రారంభం నుంచీ జనసేనలో ఎంతో యాక్టివ్‌గా పనిచేస్తున్నారు. దీంతో ఈ కుటుంబంపై కూటమిలోని రెండు పార్టీలకు కూడా మంచి సానుకూలత ఉంది.
ఈ ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూర్చేలా వివాహమై చాలా కాలమైనా కూడా పుష్పవల్లి సడెన్‌గా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో కొత్తగా ఓటు హక్కు ఎంట్రీ చేసుకోవడం ఈ ఊహాగానాలకు మరింత ఊతమిచ్చింది. గతంలో బీసీ మహిళకు కేటాయించిన విజయవాడ మేయర్ స్థానం ఈసారి జనరల్ కేటగిరీ కావడంతో, ప్రత్యక్ష ఎలక్షన్స్‌లో గెలిచే సత్తా ఉన్న వంగవీటి రాధా(Vangaveeti Radha) లేదంటే పుష్పవల్లి పోటీ పక్కా అన్న టాక్ గట్టిగా వినిపిస్తోంది.
కాగా విజయవాడ మేయర్ పీఠాన్ని జనసేన పార్టీకి కేటాయించారనే న్యూస్‌తో స్థానిక టీడీపీ లీడర్స్‌లో టెన్షన్ మొదలైంది. తమకే సీటు దక్కుతుందన్న ధీమాతో .. ఎమ్మెల్యే బొండా ఉమా కుమారుడు సిద్ధార్థ్ అలాగే స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభితో పాటు గన్నే వెంకట ప్రసాద్, చెన్నుపాటి గాంధీ, ముమ్మనేని ప్రసాద్, బొప్పన భవకుమార్, జాస్తి సాంబశివరావు, కోగంటి రామారావు వంటివారు ఉన్నారు.
అంతేకాదు మహిళా నేతలు దేవినేని అపర్ణ, చెన్నుపాటి ఉషారాణి, కోనేరు రమాదేవి, గద్దె అనురాధ వంటి పెద్ద నేతలంతా కూడా గంపెడు ఆశలు పెట్టుకున్నారు. విజయవాడలో జనసేనకు పునాదే లేదని లెక్కలేస్తున్న తెలుగు తమ్ముళ్లకు ఇప్పుడు అధిష్ఠానం నిర్ణయం మింగుడు పడటం లేదు. కూటమి విజయాన్ని సాధించాలంటే టీడీపీ ఆశావహుల సహకారం చాలా అవసరం. మరి వారిని చంద్రబాబు ఎలా కూల్ చేస్తారు. బెజవాడ బరిలో వంగవీటి ఫ్యామిలీ ఉంటుందా ఉండదా అని తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు వెయిట్ చేయాలి.
