Voter list
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాను పక్కాగా రూపొందించడానికి కేంద్ర ఎన్నికల సంఘం సరికొత్త కార్యాచరణను ప్రకటించింది. దీనిలో భాగంగానే ఓటర్ల లిస్ట్ ప్రత్యేక సమగ్ర సవరణ (SIR – Special Intensive Revision) మూడో విడత షెడ్యూల్‌ను రిలీజ్ చేసింది.
ఇప్పటికే రెండు విడతల ప్రక్రియ విజయవంతంగా ముగియగా, ఈ మూడో ఫేజ్‌లో తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణతో పాటు మరో 16 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఓటర్ల లిస్టు(Voter list)లో ఎలాంటి తప్పులు లేకుండా, నిజమైన ఓటర్లకు మాత్రమే చోటు కల్పించడానికి ఎన్నికల సంఘం ఈ చర్యలను చేపట్టింది.
ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఓటర్ల సవరణ ప్రక్రియ జూన్ 15వ తేదీన ప్రారంభమయి జులై 14వ తేదీ వరకూ కొనసాగుతుంది. ఇక తెలంగాణలో జూన్ 25వ తేదీ నుంచి ప్రారంభమై జులై 24వ తేదీ వరకు ఈ ప్రక్రియను నిర్వహించనున్నారు. ఈ గడువు లోపల ఓటర్లు తమ వివరాలను చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఓటర్ల జాబితా(Voter list) నుంచి మరణించిన వారి పేర్లు, ఒకే వ్యక్తికి రెండు మూడు చోట్ల ఉన్న డూప్లికేట్ ఓట్లు, పర్మినెంట్‌గా వేరే ప్రాంతాలకు వలస వెళ్లిన వారి వివరాలు, అనర్హుల పేర్లను పూర్తిగా తొలగించడమే ఈ స్పెషల్ డ్రైవ్ ఉద్దేశం. అర్హులైన వారందరికీ ఓటు హక్కు కల్పించి ఒక పారదర్శకమైన ఫైనల్ లిస్టును తయారు చేస్తారు. ఈ ప్రక్రియలో బూత్ స్థాయి అధికారులు (BLO) డైరెక్టుగా ప్రతి ఇంటికీ వచ్చి సర్వే చేస్తారు.
కొత్తగా ఓటు నమోదు చేసుకునే వారి కోసం ఫామ్-6, డిక్లరేషన్ ఫారాలను సేకరిస్తారు. భారత దేశంలో 1951 నుంచి 2004 మధ్య కాలంలో ఇటువంటి ప్రక్రియ ఎనిమిది సార్లు జరిగింది. మళ్లీ సుదీర్ఘ విరామం తర్వాత ఇప్పుడు ఈ ప్రత్యేక ఓటు సవరణను చేపట్టారు.
ఓటు భద్రంగా ఉండాలంటే కొన్ని పత్రాలు కావాల్సి ఉంది.
అనర్హుల తొలగింపు , కొత్త ఓటర్ల చేరిక సమయంలో అధికారులు ఓటరుకు సంబంధించిన మూడు రకాల ముఖ్యమైన వివరాలను ధ్రువీకరిస్తారు. దీనికోసం క్రింది పత్రాలలో వేటినైనా కూడా వారికి సమర్పించొచ్చు.
ఓటరు ఫోటో స్పష్టంగా ఉండేలా గుర్తింపు కార్డు ఉదాహరణకు పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ, పాన్ కార్డ్ వంటివి చూపించాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ తేదీ స్పష్టంగా ఉన్న బర్త్ సర్టిఫికేట్, స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ (TC) లేదా టెన్త్ క్లాస్ మార్క్స్ మెమో వంటివి సమర్పించాలి. చిరునామా ధ్రువీకరణ కోసం నివాస ప్రాంతాన్ని ఖరారు చేసేలా రేషన్ కార్డ్, కరెంట్ లేదా వాటర్ బిల్లు, బ్యాంక్ పాస్‌బుక్, క్యాన్సిల్ చేసిన చెక్ లీఫ్ లేదా అద్దె ఇంట్లో ఉండేవారైతే రెంటల్ అగ్రిమెంట్ పత్రాలను అధికారులకు అందించొచ్చు.
ఒకవేళ పైన పేర్కొన్న పత్రాలు ఏవీ అందుబాటులో లేకపోతే ఆల్టర్‌నేట్‌గా ఉపాధి హామీ (MNREGA) జాబ్ కార్డ్, కుల లేదా ఇన్కమ్ సర్టిఫికెట్ స్కూల్ డిప్లొమా సర్టిఫికేట్ లేదా ఉద్యోగులైతే కంపెనీ ఇచ్చిన అధికారిక ఐడీ కార్డును కూడా ఉపయోగించొచ్చు.
జులై 31వ తేదీన అధికారులు ఒక ముసాయిదా (డ్రాఫ్ట్) ఓటర్ల లిస్టు(Voter list)ను రిలీజ్ చేస్తారు. ఆ లిస్టులో మీ పేరు లేకపోయినా లేదా ఒకవేళ అధికారులు తీసుకున్న నిర్ణయంపైన మీకు ఏవైనా అభ్యంతరాలున్నా జిల్లా మేజిస్ట్రేట్‌కు అప్పీల్ చేసుకోవచ్చు. అక్కడ కూడా పరిష్కారం కాకపోతే రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (CEO) కి సెకండ్ అప్పీల్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు.
బీఎల్ఓలు ఇంటికి వచ్చిన సమయంలో మీరు అందుబాటులో లేకపోయినా కంగారు పడాల్సిన అవసరం లేదు. జులై 31 నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు , ఫిర్యాదుల కోసం ప్రత్యేక సమయం ఇస్తారు. ఆ సమయంలో కొత్తగా ఓటు కావాలనుకునే వారు లేదా మార్పులు చేయాలనుకునే వారు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా ఫామ్-6 సమర్పించి తమ పేరును రిజిస్టర్ చేసుకోవచ్చు.
ఒకవేళ మీ నియోజకవర్గం పరిధిలో మీరు అడ్రస్ మారినా,ఓటర్ ఐడీలో తప్పుల సవరణలు ఉన్నా, కొత్త ఎపిక్ కార్డ్ కావాలన్నా, దివ్యాంగుల కేటగిరీ కింద పేరు మార్చాలనుకున్నా.. ఫామ్-8 సమర్పించాల్సి ఉంటుంది. ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి మారిన ఓటర్లు(Voter list) మాత్రం కచ్చితంగా డిక్లరేషన్ ఫారమ్‌ను అందించాలని ఎన్నికల అధికారులు చెబుతున్నారు.
