No UPI Day
చేతిలో క్యాష్ లేకపోయినా పర్లేదు, చేతిలో మొబైల్‌తో మహారాజులా బతికేయొచ్చని అనుకుంటున్న వాళ్లు అక్టోబర్ 2న మాత్రం అలర్ట్‌గా ఉండాల్సిందే. ఎందుకంటే గాంధీ జయంతి రోజు దేశవ్యాప్తంగా రిటైల్ దుకాణదారుల నుంచి చిరు వ్యాపారుల వరకూ నో యూపీఐ డే (No UPI Day) పాటించబోతున్నారు. అంటే ఆ రోజు మీ ఫోన్‌లోని ఫోన్ పే( PhonePe), గూగుల్ పే (Google Pay), పేటీఎమ్( PayTM) వంటి యాప్స్ ఎన్ని ఉన్నా.. చేతిలో క్యాష్ లేనిదే పని నడవదన్న మాట.
నిజానికి ఈ నో యూపీఐ డే(No UPI Day) నిరసన పిలుపు వెనుక పెద్ద స్టోరీనే ఉంది. అక్టోబర్ 15వ తేదీ నుంచి రూ. 2,000 కంటే ఎక్కువ విలువైన మర్చెంట్ యూపీఐ ట్రాన్జాక్షన్స్‌పై 0.4% ఎమ్‌డీఆర్ (MDR – Merchant Discount Rate) చార్జ్ విధించాలని కేంద్రం నిర్ణయించింది.
ఆరేళ్లుగా ఫ్రీగా ఉన్న యూపీఐ సర్వీసులకు ఇప్పుడు కట్ పడటంతో, ఆ భారాన్ని వ్యాపారులు మోయాల్సి వస్తోంది. ముఖ్యంగా మొబైల్ వ్యాపారులు (AIMRA), ఎఫ్‌ఎమ్‌సిజి డిస్ట్రిబ్యూటర్లు (AICPDF) తమ లాభాల్లో రూ. 2వేలు నుంచి రూ. 12వేల వరకు కోత పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వానికి, ఎన్‌పీసీఐ (NPCI)కి తమ నిరసనను గట్టిగా తెలియజేయడానికి ఆల్ ఇండియా మొబైల్ రిటైలర్స్ అసోసియేషన్ ఈ పిలుపునిచ్చింది.
ఈ కొత్త నిబంధన వల్ల అసలు నష్టం ఎవరికనే ప్రశ్నే వేసుకుంటే ప్రత్యక్షంగా, పరోక్షంగా 2 వర్గాలు దెబ్బతింటాయి. మొదటిది వ్యాపారుల సంగతి చూస్తే.. 2వేల కంటే ఎక్కువ ట్రాన్జాక్షన్లు జరిగే ఎలక్ట్రానిక్స్, మొబైల్స్, బట్టల వ్యాపారులకు ఈ 0.4% ఎమ్‌డీఆర్ చార్జ్ అనేది వారి మంత్లీ నెట్ ప్రాఫిట్స్‌ను గట్టిగా దెబ్బతీస్తుంది.
అలాగే ప్రభుత్వ రూల్ ప్రకారం ఈ చార్జీలను వ్యాపారులే భరించాలి కస్టమర్ల నుంచి ఒక్క పైసా కూడా వసూలు చేయకూడదు. కానీ, ప్రాక్టికల్‌గా వ్యాపారులు తమకయ్యే ఈ ఎక్స్‌ట్రా ఛార్జీల ఖర్చును కవర్ చేసుకోవడానికి వస్తువుల ధరలను పెంచే ఛాన్స్ ఉంది, లేదా డిస్కౌంట్లు తగ్గిస్తారు.అంతేకాదు ఈ 0.4% ఎమ్‌డీఆర్ చార్జ్ కస్టమర్ల నుంచే వసూలు చేసినా ఆశ్చర్యపోనక్కరలేదు. దీనివల్ల ఇన్‌డైరెక్టుగా కస్టమర్ల జేబుకే చిల్లు పడుతుంది.
ఇక అక్టోబర్ 2న అసలు షాపుల దగ్గర వ్యాపారులంతా తమ క్యూఆర్ కోడ్ స్కానర్ల మీద బ్లాక్ క్లాత్‌లు కప్పి ఆన్‌లైన్ పేమెంట్స్ ఆపేయనున్నారు. దీంతో క్యాష్ ఉంటేనే ఆరోజు పని జరుగుతుంది. అలా అని ఆరోజు ఏటీఎమ్‌ల దగ్గరకు వెళ్తే చాంతాడంత క్యూలు దర్శనమిస్తాయి. వీలయితే ఈ రెండు రోజుల్లోనే మనీ డ్రా చేసి పెట్టుకుంటే ఇలాంటి కష్టాలకు చెక్ పెట్టొచ్చు.
