Smartphone Hack
ఈ రోజుల్లో ప్రాణాలు అయినా వదిలేస్తాం కానీ, చేతిలో ఉండే స్మార్ట్‌ఫోన్ మాత్రం అస్సలు వదలలేం అన్నంతగా దానికి బానిస అయిపోయాం. పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు కర్ణుడి కవచ కుండలాలు లాగా మొబైల్‌ను అంటి పెట్టుకునే ఉంటున్నాం . కాల్స్, చాటింగ్‌లు పక్కన పెడితే ఇన్‌స్టా, యూ ట్యూబ్, ఫేస్ బుక్ రీల్స్‌కు, వీడియోలకు ఫుల్ అడిక్ట్ అయిపోయాం.
అలాగే పర్సనల్ ఫోటోలు, బ్యాంక్ అకౌంట్ వివరాలు, పాస్‌వర్డ్‌లు ఇలా సమస్తం ఆ చిన్న స్క్రీన్ లోనే దాచేస్తుంటాం. అయితే, ఒక్కోసారి ఎవరో మూడో వ్యక్తి మన ఫోన్‌ను గుట్టుచప్పుడు కాకుండా తొంగి చూస్తున్నాడనే అనుమానం వస్తుంటుంది. నిజమే ఈ డిజిటల్ ప్రపంచంలో స్మార్ట్‌ఫోన్ హ్యాకింగ్ (Smartphone Hack) అనేది చాలా కామన్‌గా మారిపోయింది. అయితే మన ఫోన్ హ్యాకర్ల చేతిలోకి వెళ్లినప్పుడు ఆ డివైజ్ కొన్ని వింత సంకేతాలను ఇస్తుందని టెక్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. ఆ షాకింగ్ గుర్తులు ఏంటో ముందే తెలుసుకుంటే హ్యాకర్ల బారి నుంచి మన ఫోన్లను కాపాడుకోవచ్చని అంటున్నారు.
మీ ఫోన్ హ్యాకింగ్(Smartphone Hack)కు గురైందని చెప్పడానికి ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ సిగ్నల్ బ్యాటరీ హఠాత్తుగా అయిపోవడం. అప్పటి వరకూ రోజంతా వచ్చిన చార్జింగ్, కొద్ది రోజులుగా కేవలం 2,3 గంటల్లోనే సగం అయిపోతుంటే మాత్రం కచ్చితంగా అలర్ట్ అవ్వాల్సిందే.
మీరు ఫోన్ అస్సలు వాడకపోయినా సరే, బ్యాక్‌గ్రౌండ్‌లో హ్యాకర్లు ఇన్‌స్టాల్ చేసిన మాల్వేర్ కానీ స్పైవేర్ యాప్స్ కానీ రన్ అవుతూ డేటాను దొంగిలిస్తుంటాయి. దీనివల్ల ప్రాసెసర్‌పై లోడ్ పడి ఫోన్ లోపల పని చేస్తూనే ఉంటుంది. అలాగే మీ ఫోన్‌ను టేబుల్‌పైన లేదా వాడకుండా పక్కన పెట్టి ఉంచినా కూడా అది విపరీతంగా వేడెక్కిపోతుంటే, లోపల ఏదో దొంగ యాప్ పర్సనల్ ఇన్ఫర్మేషన్‌ను వేరే సర్వర్‌కు పంపుతోందని అర్థం చేసుకోవాలి.
రెండో అతిపెద్ద సిగ్నల్ ఇంటర్నెట్ డేటా ఎక్కడికి పోతుందో తెలియకుండానే మాయమైపోతుంది. మీ రోజువారీ డేటా లిమిట్ ఏమీ వాడకుండానే అయిపోతోందని మెసేజ్ వస్తే మాత్రం.. వెంటనే మీ డేటా యూసేజ్ సెట్టింగ్స్ చెక్ చేసుకోవాలి.
హ్యాకర్లు మీ ఫోన్‌లోని కాంటాక్ట్స్, మెసేజ్‌లు, ఫోటోలు ,ఇతర వివరాలను వేరే చోటికి ట్రాన్స్‌ఫర్ చేయడానికి మీ సొంత ఇంటర్నెట్ డేటానే వాడుకుంటారు. దీనితో పాటు మీ ఫోన్ స్క్రీన్‌పై ఎప్పుడూ లేనిది విచిత్రమైన యాడ్‌లు, అశ్లీల పాప్-అప్‌లు కనిపిస్తున్నా, లేదా మీరు అస్సలు డౌన్లోడ్ చేయని కొన్ని కొత్త యాప్స్ మీ ఫోన్ మెనూలో దానంతట అవే కనిపిస్తూ ఉన్నా.. మీ ఫోన్ వంద శాతం హ్యాకర్ల చేతిలోకి వెళ్లిపోయిందని ఫిక్స్ అవ్వొచ్చు.
మరో ప్రమాదకరమైన గుర్తు ఏంటంటే మీ సోషల్ మీడియా అకౌంట్ల నుంచి.. మీ ఫ్రెండ్స్‌కు వింత వింత లింకులు లేదా మెసేజ్‌లు వెళ్లడం. మీ వాట్సాప్, ఫేస్‌బుక్ , ఇన్‌స్టాగ్రామ్ నుంచి మీరు పంపని మెసేజ్‌లు అవతలి వారికి వెళ్తున్నాయంటే మీ అకౌంట్లను ఎవరో యాక్సెస్ చేస్తున్నారని అర్థం.
అలాగే మీ ఫోన్ అప్పుడప్పుడు దానంతట అదే రీస్టార్ట్ అవుతూ ఉండటం.. యాప్స్ ఓపెన్ చేసినప్పుడు సడన్‌గా క్లోజ్ అయిపోవడం వంటివి జరిగితే నిర్లక్ష్యం చేయొద్దు. ఇలాంటి సమస్యల నుంచి బయటపడాలంటే వెంటనే మీ ఫోన్‌ను ఫ్యాక్టరీ రీసెట్ చేయాలి. అలాగే తెలియని లింకులను క్లిక్ చేయకపోవడం, నమ్మకమైన యాంటీవైరస్ వాడటం చేయాలి.
