Lavanya Tripathi
సోషల్ మీడియాలో సెలబ్రిటీలపై జరిగే ట్రోలింగ్ రోజురోజుకు హద్దులు దాటిపోతుంది. ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి కొందరిని పర్సనల్‌గా టార్గెట్ చేస్తూ ..పైశాచిక ఆనందాన్ని పొందుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. తమ వ్యక్తిగత స్వేచ్ఛను పరాయి వాళ్ల జీవితాలలోకి తొంగిచూడటానికి వాడుతున్న సైకోల జాడ్యం ముదిరిపోతుంది. ఇలాంటివారి వేధింపులను మౌనంగా భరించడం కంటే, చట్టపరంగా ఎదుర్కోవడమే సరైనదని మెగా కోడలు లావణ్య త్రిపాఠి భావించారు .
తనతో పాటు , తన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని ..పర్పుల్ క్రెయాన్00- అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారంటూ ఆమె హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన లావణ్య(Lavanya Tripathi).. పరువుకు భంగం కలిగించేలా ప్రవర్తిస్తున్న ఆ వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.
కేవలం తన విషయం గురించే కాకుండా, మెగాస్టార్ చిరంజీవిపై వస్తున్న నెగిటివ్ కామెంట్స్ పైన కూడా లావణ్య గట్టిగా ఆవేదన వ్యక్తం చేశారు. తన మామయ్య చిరంజీవి ఆడపిల్లలను ఎంత గౌరవంగా చూస్తారో మా అందరికీ తెలుసని, ఆయన వ్యక్తిత్వం గురించి తెలియని వారు చేసే విమర్శలను చూస్తూ ఊరుకోమని చెప్పారు. తమ కుటుంబం అనే కాదు ఏ కుటుంబంలో అయినా సరే వారి ఆనందకరమైన క్షణాలను వక్రీకరించి.. పైశాచిక ఆనందం పొందడం మంచిది కాదంటూ అలాంటివారికి వార్నింగ్ ఇచ్చారు. పోలీసులు ఇప్పటికే ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
వరుణ్ తేజ్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) తన వైవాహిక జీవితాన్ని.. ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. 2025లో వీరికి ఒక బాబు కూడా జన్మించడంతో అన్ని రకాలుగా హ్యాపీగా ఉన్నారు.ఒకవైపు బాధ్యతాయుతమైన మెగా కోడలిగా ఉంటూ, మరోవైపు కెరీర్ పరంగా కూడా ఇప్పుడిప్పుడే మళ్లీ బిజీ అవుతున్నారు. సతీ లీలావతి వంటి డిఫరెంట్ సినిమాలతో మెప్పించిన ఆమె, భవిష్యత్తులో మంచి కథ దొరికితే మళ్లీ వరుణ్‌తో కలిసి నటిస్తానని చెబుతున్నారు.
