Mega 158
సంక్రాంతి పండగొస్తుందంటే చాలు.. థియేటర్ల దగ్గర హడావుడి, బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల జాతర మామూలుగా ఉండదు. అయితే ఒకప్పుడు పండక్కి కొత్త సినిమాను దింపితే చాలు.. ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు సేఫ్‌గా ఒడ్డున పడినట్లే ఉండేది పరిస్థితి. కానీ రాను రాను ఈ సీన్ మొత్తం మారిపోతోంది. ఇప్పుడు సంక్రాంతి సీజన్ అంటే లాభాల మాటను పక్కన పెడితే రిస్క్ ఎక్కువైపోయిందనే ప్రచారమే ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
ఎందుకంటే పెద్ద పెద్ద హీరోల చిత్రాలతో పాటు మిడిల్ రేంజ్ మూవీలు కూడా థియేటర్లలోకి రావడానికి పోటీ పడుతున్నాయి. దీంతోనే అసలు గొడవ మొదలవుతోంది. ఏ సినిమాకి సరిపడా థియేటర్లు ఆ చిత్రానికి దొరకడం లేదు. ఒకవేళ థియేటర్లు దొరికినా.. అందరి మధ్య కలెక్షన్లు పంపిణీ అయిపోయి అనుకున్నంతగా డబ్బులు రావడం లేదు.
గడిచిన సంక్రాంతికి వచ్చిన సినిమాలను కనుక చూసుకుంటే.. ప్రారంభంలో మంచి ఓపెనింగ్స్ వచ్చినా, చివరికి ప్రొడ్యూసర్లు అనుకున్నంత లాభాలు మాత్రం చూడలేకపోయారనే టాక్ వినిపించింది. అందుకే ఇప్పుడు సంక్రాంతికి రిలీజ్ అంటే గ్యారెంటీ హిట్ అనే నమ్మకం మెల్లమెల్లగా పక్కకు జరుగుతోంది.
సరిగ్గా ఇలాంటి టైమ్‌లోనే మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఒక ఇంట్రస్టింగ్ న్యూస్ ఫిలిం నగర్‌లో హల్‌చల్ చేస్తోంది. నిజానికి ఈ మూవీని ముందుగా సంక్రాంతి బరిలోనే దింపాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే ఆ సమయంలో బాక్సాఫీస్ దగ్గర ఓ రేంజ్‌లో ఉన్న పోటీని చూసి, ఇప్పుడు ప్లాన్ మార్చే ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది.
భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న మూవీ(Mega 158) కాబట్టి, ఎలాంటి పోటీ లేకుండా సోలోగా థియేటర్లలోకి వస్తే.. క్లాస్ ఆడియన్స్, మాస్ ఆడియన్స్‌ను అట్రాక్ట్ చేయొచ్చని.. దాంతో కలెక్షన్లు పక్కాగా వస్తాయని టీమ్ లెక్కలేస్తోందట.
సంక్రాంతికి రెండు మూడు పెద్ద సినిమాలు వచ్చే అవకాశం ఉండటంతో.. ఆ టైమ్‌లో థియేటర్ల కోసం కొట్టుకోవడం కంటే పెద్ద పండుగ రేస్ నుంచి తప్పుకుని.. సమ్మర్‌లోనో లేక మంచి డిమాండ్ ఉన్న వేరే సీజన్‌లోనో వస్తే బెటర్ అని ఆలోచిస్తున్నారట.
ఒకవేళ నిజంగానే మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాని సంక్రాంతి నుంచి తప్పిస్తే మాత్రం.. అది టాలీవుడ్‌లో ఒక కొత్త ట్రెండ్‌కి శ్రీకారం చుట్టినట్లే అవుతుందని ఇండస్ట్రీ జనాలు అనుకుంటున్నారు. మరి దీనిపై ఎలాంటి నిర్ణయం బయటకు రానుందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
