Ram Charan
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) బాక్సాఫీస్ వద్ద మళ్లీ తన అరాచకాన్ని చూపిస్తూ ప్రభంజనం సృష్టిస్తున్నాడు. భారీ అంచనాల మధ్య రిలీజైన పెద్ది మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని కురిపిస్తోంది. థియేటర్లలో ఫస్ట్ షో నుంచే సూపర్ పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ, ఓపెనింగ్స్ పరంగా నయా రికార్డులను తిరగరాస్తూ దూసుకుపోతోంది. ఫస్ట్ డేనే వంద కోట్ల క్లబ్‌లో చేరి టాలీవుడ్ సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పింది.
ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా డైరెక్షన్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ మూవీలో రామ్ చరణ్(Ram Charan) సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటించింది. ప్రపంచవ్యాప్తంగా జూన్ 4 గురువారం రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ, మొదటి రోజే ఏకంగా రూ. 135.36 కోట్లు భారీ గ్రాస్ వసూళ్లను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఈ విషయాన్ని మూవీ యూనిట్ అఫీషియల్‌గా ఒక పోస్టర్ ద్వారా సోషల్ మీడియాలో పంచుకుంటూ మెగా ఫ్యాన్స్‌లో జోష్ నింపింది. సినిమాలో రామ్ చరణ్ యాక్షన్, చెర్రీ పండించిన హావభావాలు అద్భుతంగా ఉన్నాయంటూ ప్రేక్షకులతో పాటు విమర్శకులతోనూ ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. వీకెండ్ కూడా కాబోతుండటం, మూవీకి పాజిటివ్ మైలేజ్ తోడవ్వడంతో రానున్న రోజుల్లో ఈ కలెక్షన్ల స్పీడ్ మరింతగా పెరిగి సరికొత్త మైలురాళ్లను అందుకోవడం గ్యారంటీ అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఈ భారీ యాక్షన్ డ్రామా మూవీలో జగపతి బాబు, దివ్యేందు, బొమన్ ఇరానీ, రవి కిషన్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలలో కనిపించి మెప్పించారు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్స్ వెంకట సతీష్ కిలారు, ఇషాన్ సక్సేనా అత్యంత భారీ బడ్జెట్‌తో, ఎక్కడా రాజీ పడకుండా పెద్ది మూవీని నిర్మించారు. ఫస్ట్ డే నే ఊహించని రేంజ్‌లో వసూళ్లు సాధించిన పెద్ది సినిమా రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ వద్ద ఇంకెన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.
Ebola : హైదరాబాద్‌లో ఎబోలా టెన్షన్..డాక్టర్లు ఏం చెబుతున్నారు?
