Cervical Cancer
భారతీయ మహిళలను ఎక్కువగా భయపెట్టే ప్రాణాంతక వ్యాధుల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ లేదా సర్వైకల్ క్యాన్సర్(Cervical Cancer) ఒకటి అన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ కేసుల సంఖ్య మెల్లగా తగ్గుముఖం పట్టడం నిజంగా మంచి విషయమే. ప్రజల్లో పెరుగుతున్న అవగాహన, మెరుగైన వైద్య సౌకర్యాలే దీనికి ప్రధాన కారణమని డాక్టర్లు చెబుతున్నారు.
సర్వైకల్ క్యాన్సర్ అనేది రాత్రికి రాత్రి వచ్చే వ్యాధి కాదు. సర్వైకల్ క్యాన్సర్ శరీరంలో డెవలప్ అవడానికి చాలా ఏళ్లు పడుతుంది. దీనికి ప్రధాన కారకం హెచ్‌పీవీ (HPV) అనే వైరస్ . ఈ వ్యాధిలో ఉన్న అతిపెద్ద సమస్య ఏంటంటే, ఇది ప్రారంభ దశలో ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలను కూడా బయటకు చూపించదు.
అందుకే దీన్ని నిశ్శబ్ద శత్రువు అని డాక్టర్లు పిలుస్తారు. అయితే మహిళల శరీరం ఇచ్చే కొన్ని చిన్న చిన్న సంకేతాలను జాగ్రత్తగా గమనిస్తే మాత్రం, ఈ మహమ్మారిని ముందే పసిగట్టి దీని నుంచి ఈజీగా బయటపడొచ్చని డాక్టర్లు సూచిస్తున్నారు.
సాధారణంగా రెండు పీరియడ్స్ మధ్య సమయంలో అకస్మాత్తుగా బ్లీడింగ్ అవడం లేదా మెనోపాజ్ దశ దాటిపోయిన తర్వాత కూడా బ్లీడింగ్ కనిపిస్తూ ఉండటం జరిగితే మాత్రం అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. అలాగే ఫిజికల్‌గా కలిసిన తర్వాత నొప్పి కలగడం, అలాగే రక్తం రావడం , యోని నుంచి దుర్వాసనతో కూడిన స్రావాలు వెలువడటం వంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం సర్వైకల్ క్యాన్సర్‌కు ప్రధాన హెచ్చరికలుగా గుర్తించాలి.
ఇవే కాకుండా తరచూ నడుము నొప్పి రావడంతో పాటు కడుపులో ఏదో బరువుగా అనిపించడం వంటి సమస్యలు కనిపిస్తే.. అవి కేవలం అలసటగా భావించి వదిలేయొద్దు. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే మొహమాట పడకుండా డాక్టరును సంప్రదించి అవసరమైన టెస్టులు చేయించుకోవడం వల్ల వైరస్ ఎఫెక్టును మొదటిలోనే అడ్డుకోవచ్చు.
ఇప్పుడు మెడికల్ సైన్స్ ఎంతగానో డెవలప్ చెందింది. ఈ క్యాన్సర్ రాక ముందే అడ్డుకోవడానికి ఇప్పుడు హెచ్‌పీవీ టీకాలు (Vaccines) అందుబాటులోకి వచ్చాయి. యుక్తవయసుకు ముందే చిన్నారులకు ఈ డోస్ ఇవ్వడం ఒకవేళ అప్పుడు కుదరకపోతే డాక్టర్ సలహాతో రెండు, మూడు డోసులు తీసుకోవడం ద్వారా దీనికి ముందే చెక్ పెట్టొచ్చు.
మహిళలు తమ ఆరోగ్యం పట్ల కనీస అవగాహన కలిగి ఉండటం, రెగ్యులర్‌గా టెస్టులు చేయించుకోవడం వల్ల ఈ వ్యాధిని పూర్తిగా అడ్డుకోవచ్చు. ఈ వ్యాధి ముదిరిన తర్వాత బాధపడటం కంటే, బాడీలో కలిగే చిన్న మార్పులను గుర్తించి చికిత్స తీసుకోవడమే ఎంతో మంచిదన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.
Birthday : వయసు పెరగడమంటే వెనకబడటం కాదు.. అనుభవాల మూటతో అంతరంగాన్ని గెలుచుకోవడం
