Lassi
వేసవి తాపం నుంచి రిలీఫ్ పొందడానికి పెరుగుతో చేసే డ్రింక్స్ అమృతంలా పనిచేస్తాయని పెద్దలు చెబుతారు. ముఖ్యంగా ఎండలు మండుతున్న సమయంలో మజ్జిగ , లస్సీ(Lassi)లు దాహాన్ని తీర్చడమే కాకుండా బాడీకి అవసరమైన పోషకాలను అందిస్తాయి. అయితే ఈ రెండింటిలో హెల్త్‌కు ఏది ఎక్కువ మంచిదనే విషయంలో చాలా మందికి అనుమానాలు ఉంటాయి.
పెరుగును చిలికి నీళ్లు కలిపి పలచగా చేసే మజ్జిగలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల మజ్జిగ డీహైడ్రేషన్ బారి నుంచి మనల్ని కాపాడుతుంది. ఇందులో విటమిన్ బి12, పొటాషియం , కాల్షియం వంటి ఖనిజాలు చాలా ఎక్కువగా ఉంటాయి. జీర్ణక్రియను వేగవంతం చేసే ప్రోబయోటిక్స్ మజ్జిగలో మెండుగా ఉండటం వల్ల ఎసిడిటీ, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వెంటనే తగ్గుముఖం పడతాయి.
బరువు తగ్గాలని అనుకునే వారికి మజ్జిగ ఒక అద్భుతమైన ఎంపిక, ఎందుకంటే దీనిలో కేలరీల శాతం చాలా తక్కువగా ఉంటుంది. దీనికి కొంచెం వేయించిన జీలకర్ర పొడి, పుదీనా, నల్ల ఉప్పు యాడ్ చేస్తే రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి. భోజనం తర్వాత ఒక గ్లాసు మజ్జిగ తాగడం వల్ల తిన్న ఆహారం ఈజీగా జీర్ణం అవ్వడమే కాకుండా శరీరం ఎంతో తేలికగా అనిపిస్తుంది. వేసవిలో చెమట రూపంలో శరీరం కోల్పోయే ఖనిజ లవణాలను తిరిగి భర్తీ చేయడంలో మజ్జిగను మించింది లేదని చెప్పొచ్చు.
ఇక లస్సీ విషయానికి వస్తే, ఇది చిక్కగా ఉండటంతో ఆకలిని తీర్చే డ్రింక్‌గా పనిచేస్తుంది. దీనిలో పెరుగు శాతం ఎక్కువగా ఉండటం వల్ల ప్రోటీన్లు , కాల్షియం ఎక్కువగా లభిస్తాయి, ఇవి బోన్స్ గట్టిదనానికి, కండరాల బలానికి ఎంతో మంచిది. తక్షణ ఎనర్జీ కావాలనుకునే వారికి , ఎక్కువ సేపు ఆకలి వేయకుండా ఉండాలనుకునే వారికి లస్సీ ది బెస్ట్ డ్రింక్.
అయితే లస్సీలో చక్కెర కానీ క్రీమ్ కానీ వాడటం వల్ల కేలరీలు పెరుగుతాయి కాబట్టి బరువు పెరగకూడదు అనుకునే వారు దీనిని తీసుకోకపోవడం లేదా తీసుకుంటే మితంగా తీసుకోవడం మంచిది. లస్సీ జీర్ణం కావడానికి కొంత సమయం తీసుకుంటుంది కాబట్టి దీనిని మధ్యాహ్న సమయంలో తీసుకోవాలి.
మొత్తంగా పరిశీలిస్తే వేసవిలో బాడీని చల్లబరచడానికి, జీర్ణక్రియను మెరుగుపరచుకోవడానికి , బరువును కంట్రోల్‌లో ఉంచుకోవడానికి మజ్జిగ తీసుకోవచ్చు. అదే సమయంలో శారీరక శక్తి కోసం, కడుపు నిండుగా ఉండటం కోసం లస్సీని కూడా తీసుకోవచ్చు. ఎండ తీవ్రతను తట్టుకోవడానికి మీ శరీర తత్వాన్ని బట్టి ఈ రెండింటిలో ఏదైనా సెలక్ట్ చేసుకోవచ్చు. కానీ ఆరోగ్య విషయంలో చూస్తే మాత్రం ఎవరైనా సరే మజ్జిగకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తేనే మంచిది.
Afraid : ఆర్థికంగా సెటిలైనా ఖర్చుకు భయపడుతున్నారా? ట్రామా నుంచి బయటపడాలనుకుంటున్నారా?
