Haleem Seeds
ఈ మధ్య కాలంలో హలీం గింజలు (Garden Cress Seeds) సూపర్ ఫుడ్‌గా మారిపోయాయి. హెల్త్ మీద కాన్షియస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వీటి గురించి మాట్లాడుకుంటున్నారు. మరోవైపు హార్మోన్ల సమతుల్యత నుంచి జుట్టు ఆరోగ్యం వరకు హలీం గింజలు చేసే మేలు అంతా ఇంతా కాదని ఆరోగ్య నిపుణులు కూడా చెబుతున్నారు.
చిన్నగా ఎర్ర రంగులో ఉండే ఈ గింజల్లో ఐరన్, ఫోలేట్, విటమిన్ ఎ, సి, ఇ , ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. వీటిని ప్రతీరోజూ రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్స్ అందుతాయి. రక్తహీనత (Anemia) సమస్యతో బాధపడేవారికి ఇవి ఒక వరం లాంటివనే చెబుతారు. ఎందుకంటే వీటిలో ఉండే ఎక్కువ ఐరన్ శాతం హిమోగ్లోబిన్ స్థాయిలను చాలా వేగంగా పెంచుతుంది.
మహిళల్లో వచ్చే హార్మోన్ల ఇమ్‌బ్యాలెన్స్‌ను సరిచేయడంలో హలీం గింజలు కీలక పాత్ర పోషిస్తాయి. పీరియడ్స్ రెగ్యులర్‌గా రాకపోవడం లేదా పీసీఓడీ (PCOD) వంటి సమస్యలు ఉన్నప్పుడు వీటిని తీసుకోవడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది. ఇందులోని ‘ఫైటో ఈస్ట్రోజెన్’ అనే పదార్థం హార్మోన్లను బ్యాలెన్స్ చేయడానికి సహాయపడుతుంది. అయితే గర్భిణీలు, పాలిచ్చే తల్లులు వైద్యుల సలహాతో వీటిని తీసుకుంటే శరీరానికి మంచి బలం వస్తుంది.
హలీం గింజల్లో ఎక్కువ శాతంలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం సమస్యను కంట్రోల్ చేయడమే కాకుండా, కడుపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తాయి. దీంతో అతిగా తినడం తగ్గిపోయి, బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్‌గా అవుతుంది. శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపి, మెటబాలిజమ్‌ను (Metabolism) వేగవంతం చేయడంలో ఇవి తోడ్పడతాయి.
జుట్టు రాలడం సమస్యతో సతమతమయ్యే వారికి హలీం గింజలు బెస్ట్ సొల్యూషన్ అని చెప్పొచ్చు. వీటిలోని ప్రోటీన్లు , ఇతర ఖనిజాలు జుట్టు కుదుళ్లను స్ట్రాంగ్‌గా చేసి, జుట్టు ఒత్తుగా పెరిగేలా చేస్తాయి. అలాగే చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి, నేచురల్ మెరుపును ఇవ్వడంలో ఇవి సహాయపడతాయి.
అయితే హలీం గింజల(Haleem Seeds)ను డైరెక్టుగా తీసుకోకూడదు. ఒక చెంచా గింజలను రాత్రంతా నీటిలో గానీ లేదా కొబ్బరి నీళ్లలో గానీ నానబెట్టి, మర్నాడు ఉదయం తీసుకోవాలి. కొందరు వీటిని పాలల్లో కలిపి కానీ లడ్డూల రూపంలో కానీ తీసుకుంటారు. నిమ్మరసంతో కలిపి తీసుకోవడం వల్ల దీనిలోని ఐరన్‌ను శరీరం ఈజీగా గ్రహిస్తుంది.
ఏది ఏమైనా హలీం గింజల(Haleem Seeds)ను అతిగా తీసుకోకూడదు. రోజుకు ఒక చెంచా కంటే తక్కువ పరిమాణంలో తీసుకోవడం మంచిది. అలాగే థైరాయిడ్ సమస్య ఉన్నవారు మాత్రం డాక్టర్‌ను సంప్రదించిన తర్వాతే వీటిని వాడాలి.
Afraid : ఆర్థికంగా సెటిలైనా ఖర్చుకు భయపడుతున్నారా? ట్రామా నుంచి బయటపడాలనుకుంటున్నారా?
