Karivepaku vellulli karam
వంటలలో సువాసన కోసమే కాకుండా.. ఆరోగ్యం మెరుగుపరచడానికి కూడా కరివేపాకు ఒక అద్భుతమైన ఔషధంలా వాడుతుంటాం. కరివేపాకులో ఉండే విటమిన్ -ఎ కంటి సమస్యలను దూరం చేస్తుందని చాలా వంటకాల్లో దీనిని వాడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తాం. అలా ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ అత్యంత ఆదరణ పొందిన వంటకాల్లో కరివేపాకు వెల్లుల్లి కారం(Karivepaku vellulli karam) ఒకటిగా చెప్పుకోవచ్చు.
ముఖ్యంగా వర్షాలు పడే కాలంలో వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని ఈ కారం తింటే నోటికి ఎంతో రుచిగా ఉంటుంది. కొందరు దోశెలు, ఇడ్లీ, రోటీలు కూడా దీనితో తింటారు. కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ కారం తయారీకి కావలసిన పదార్థాలు, చేసుకునే విధానం ఇప్పుడు చూద్దాం.
ఈ వెల్లుల్లి కారం తయారు చేయడానికి శుభ్రం చేసుకున్న కరివేపాకు ఆకులు రెండు కప్పులు తీసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు పదిహేను, ఎండుమిర్చి తగినన్ని కావాలి. మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర ఒక స్పూన్, ధనియాలు ఒక స్పూన్, రుచికి సరిపడా ఉప్పు, తాలింపు కోసం కొద్దిగా నూనె తీసుకోవాలి. అలాగే విడిగా ఉంచుకోవడానికి మరో అరకప్పు వేయించిన కరివేపాకు ఆకులను కూడా సిద్ధం చేసుకోవాలి.
ముందుగా స్టౌ వెలిగించి ఒక చిన్న కడాయి పెట్టుకుని దానిలో కొద్దిగా నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత రెండు కప్పుల కరివేపాకు ఆకులను వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే పాన్‌లో మినప్పప్పు వేసి దోరగా, కాస్త గోధుమ రంగు వచ్చేంత వరకు వేయించాలి. ఇలా బాగా వేయించడం వల్ల పొడి చేసుకునేటప్పుడు కారం మృదువుగా వస్తుంది.
ఇప్పుడు అదే మిశ్రమంలో ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి కూడా వేసి మంటను తక్కువగా ఉంచి బాగా వేయించుకోవాలి. ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత స్టవ్ కట్టేసి, ముందుగా వేయించి పెట్టుకున్న కరివేపాకు ఆకులను కూడా అందులో వేసి కాసేపు చల్లారనివ్వాలి.
వేయించుకున్న పదార్ధాలు అన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత.. దానిని మిక్సీ జార్‌లో వేసి పొడి చేసుకోవాలి. చివరగా మిగిలిన కరివేపాకు ఆకులు, వెల్లుల్లి రెబ్బలు , తగినంత సాల్ట్ వేసి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకోవాలి. రోట్లో దంచుకుంటే ఈ పొడి ఇంకా రుచిగా ఉంటుంది. ఇలా ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన కరివేపాకు వెల్లుల్లి కారం(Karivepaku vellulli karam)ను ఇంట్లోనే ఇలా రెడీ చేసుకోవచ్చు.
Rohit Sharma : లండన్‌కు రోహిత్ పేరెంట్స్..సెలక్టర్లతో హిట్ మ్యాన్ వాగ్వాదం..అసలేం జరుగుతోంది ?
