FootBall
కొన్ని ఫోటోలు కేవలం జ్ఞాపకాలుగా మాత్రమే మిగిలిపోవు. ఒక యుగానికి సాక్ష్యాలుగానూ, ఒక తరం నమ్మకాలకు ప్రతిబింబాలుగానూ, తర్వాతి కాలంలో ఆ నమ్మకాలనే తిరగరాసే నిగూఢ జీవిత పాఠాలుగా కూడా మారుతుంటాయి.
అలాంటి ఒక అరుదైన, చారిత్రాత్మక చిత్రం 1986 వరల్డ్ కప్ సమయంలో వెలుగు చూసిన ఫోటో ఇప్పుడు మరోసారి వైరల్ అవుతోంది. ఆ ఫోటోలో అప్పట్లో ఫుట్‌బాల్(FootBall) సామ్రాజ్యాన్ని ఏలిన ముగ్గురు దిగ్గజాలైన డియెగో మారడోనా, పెలే, మిషెల్ ప్లాటిని పక్కపక్కనే నిలబడి ఉన్నారు.
3 భిన్న దేశాలు, 3 డిఫరెంట్ వ్యక్తిత్వాలు, 3 అసాధారణ క్రీడా ప్రయాణాలు కలిసిన ఆ క్షణంలో.. ప్రపంచం వారికో 3 గొప్ప ప్రతీకలను అందించింది. మారడోనాను.. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా నిలిచిన ఆదర్శ యువకుడిగానూ, పెలేను ..చిన్నారుల హక్కుల కోసం పోరాడే మానవతావాదిగా,ఇక ప్లాటినిని.. అవినీతి మరకలు లేని ఒక స్వచ్ఛమైన నాయకుడిగా ఆ ఫోటో ద్వారా చెప్పింది. ఇలాంటి గొప్ప మనుషులు క్రీడలనే కాదు, ప్రపంచాన్ని కూడా మారుస్తారని నమ్మింది.
కానీ కాలమనేది ఒక పారదర్శకమైన అద్దం వంటిది. అది మనం చూసే బయట ఇమేజ్‌ను మాత్రమే కాదు, దాని వెనుక దాగి ఉన్న మనిషి సహజ బలహీనతలను కూడా అంతే క్రూరంగా బయటపెడుతుంది. అలా ఆ ముగ్గురు దిగ్గజాల జీవితాల్లో కాలం నిరూపించిన ఆ చేదు నిజాల అంతరార్థం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ముందుగా మైదానంలో అర్జెంటీనా లెజెండ్ డియెగో మారడోనా బాల్‌తో చేసే మ్యాజిక్ ఒక అద్భుతం. అతని ఆటను ప్రపంచం మొత్తం ఆరాధించేలా ఉండేది. కానీ మారడోనా పర్సనల్ లైఫ్ మాత్రం చాలా నరకంగా సాగింది. ఒకప్పుడు డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ఉన్న మారడోనా, తర్వాతి కాలంలో అదే డ్రగ్స్‌కు బానిస అయ్యాడు. దానివల్ల తన కెరీర్‌ను,హెల్త్‌ను పాడు చేసుకుని ఎంతో పోరాడాల్సి వచ్చింది.
ఒక మనిషి బయట ఎంత పెద్ద విజయాలను సాధించినా.. లోపల ఉండే బలహీనతలు, మానసిక గాయాలు ఎవరినైనా కింద పడేస్తాయి. అందుకే మారడోనా ఆటను ఎంతగా ఇష్టపడినవాళ్లయినా.. అతని వ్యక్తిగత జీవితాన్ని మాత్రం ఆదర్శంగా తీసుకోకూడదని అనుకునేవాళ్లు.
ఇక సొసైటీలో చిన్న పిల్లల హక్కుల గురించి, మానవత్వం గురించి ఎంతో గొప్పగా మాట్లాడిన వ్యక్తి బ్రెజిల్ ఫుట్‌బాల్ లార్డ్ పెలే . అందుకే లార్డ్‌ను ప్రపంచవ్యాప్తంగా ఒక దేవుడిలా చూసేవారు. కానీ ఆయన లైఫ్‌లో జరిగిన కొన్ని సంఘటనలు ఆ మంచి పేరును కాస్త మసకబార్చాయి. లార్డ్‌కు పెళ్లి కాకుండా పుట్టిన కూతురు సాండ్రా రెజీనాను తన కూతురిగా అంగీకరించడానికి పెలే ఏమాత్రం ఒప్పుకోలేదు.
ఆఖరికి రెజీనా కోర్టుకు వెళ్లి, డీఎన్‌ఏ పరీక్షలు చేయించుకుని తన హక్కులను సాధించుకోవాల్సి వచ్చింది. ఈ సంఘటన వల్ల ప్రపంచం చూసిన పర్ఫెక్ట్ హీరో పెలే ఇమేజ్ ఒక్కసారిగా కూలిపోయింది. దీన్ని బట్టి సొసైటీ ఒక మనిషిని ఒకే కోణంలో మాత్రమే చూస్తుంది. నిజానికి పెలే ఒక గొప్ప ఆటగాడు.. కానీ మంచి తండ్రిగా లేకపోవడం వల్ల ఎవరూ కూడా నూటికి నూరు శాతం పర్ఫెక్ట్‌గా ఉండలేకపోవచ్చనే నిజం బయటపడింది.
మరోవైపు మైదానంలో ఫ్రాన్స్ కెప్టెన్ మిషెల్ ప్లాటిని డిసిప్లిన్, తెలివితేటలు గుర్తొస్తాయి. అవినీతికి తావు లేకుండా బతికిన వ్యక్తిగా ప్లాటిని పేరు తెచ్చుకున్నారు. ఆట నుంచి రిటైర్ అయ్యాక ఫుట్‌బాల్(FootBall) మేనేజ్‌మెంట్‌లోకి వెళ్లగా.. దురదృష్టవశాత్తూ, అక్కడ ప్లాటినిపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు వచ్చాయి. చివరకు అంత పెద్ద పదవిలో ఉండి కూడా, అవినీతి కేసులతో ఫుట్‌బాల్(FootBall) నుంచే నిషేధానికి గురి కావాల్సి వచ్చింది.
ఇది సొసైటీలో ఉండే మరో పెద్ద సత్యాన్ని చెబుతుంది. బయట ఉన్నప్పుడు ఎంతో నీతిగా ఉండే వ్యక్తులు కూడా, కొత్త సిస్టమ్‌లోకి వెళ్లినపుడు లేదా అధికారాన్ని చేపట్టినపుడు మెల్లగా ఆ ప్రలోభాల్లో చిక్కుకుపోతారు అనడానికి ప్లాటిని జీవితమే పెద్ద ఉదాహరణగా చెప్పొచ్చు.
ఈ 1986 నాటి ఆ ఫోటోను పైపైనే చూస్తే 3 గొప్ప ఆదర్శాలు ఒకే చోట ఉన్నాయని కనిపిస్తుంది. కానీ వారి పూర్తి జీవితాలను పరిశీలించాక మాత్రం.. ఆ ఆదర్శాల వెనుక ఎన్నో తప్పులు, లోపాలు ఉన్నాయని తెలుస్తుంది. అందుకే ఈ ఫోటో కేవలం ఒక పాత మెమరీ కాదు, అందరికీ అదొక పెద్ద హెచ్చరిక.
ఈ ముగ్గురి జీవితాల ద్వారా మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటంటే.. ఈ ప్రపంచంలో ఎవరూ వంద శాతం పర్ఫెక్ట్ కాదు. అంతేకాదు ఎంత పెద్ద పేరు, గుర్తింపు ఉన్నా కూడా మనుషులలో తప్పులు, బలహీనతలు అనేవి ఉంటాయి.
Numerology : నెంబర్ 5 ఉన్నవారు లక్కీనా? ప్రేమ విషయంలో ఎలా ఉంటారు?
