America – Iran : అమెరికా, ఇరాన్ మధ్య ఒప్పందం..డ్రాఫ్ట్ లో 14 కీలక పాయింట్లు ఇవే

America - Iran : 4 అంశాలు ట్రంప్ ప్రతిపాదించిన డీల్ లో ఉన్నాయని ఇరాన్ మీడియా తెలిపింది. దీనిలో ప్రధానంగా లెబనాన్ తో సహా అన్ని రంగాల్లో శాశ్వత కాల్పుల విరమణకు నిర్ణయం తీసుకోవాలని ఉంది

America – Iran

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం ముగింపు దశకు చేరుకుందని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నా ఇరాన్ మాత్రం ఖండిస్తూనే ఉంది. ట్రంప్ ఏకపక్ష ప్రకటనలు చేస్తున్నారంటూ మండిపడింది. డీల్ కుదిరిందనీ ట్రంప్, అదేమీ లేదంటూ ఇరాన్ ఎవరి వైఖరి వారు స్పష్టం చేస్తున్నారు. ఈసారి మాత్రం ఒప్పందం అంశం గతంతో పోలిస్తే ముందుకెళుతున్నట్టే కనిపిస్తోంది.

ఎందుకంటే ట్రంప్ ప్రకటన చేసిన 48 గంటల తర్వాత ఇరాన్ మీడియాలో దీనికి సంబంధించి వార్తలు రావడమే కారణంగా చెబుతున్నారు. ట్రంప్ ప్రకటన చేసిన కొద్ది గంటల్లోనే ఒప్పందం డ్రాఫ్ట్ లోని కీలక అంశాలు వెల్లడయ్యాయి. మొత్తం 14 అంశాలు ట్రంప్ ప్రతిపాదించిన డీల్ లో ఉన్నాయని ఇరాన్ మీడియా తెలిపింది. దీనిలో ప్రధానంగా లెబనాన్ తో సహా అన్ని రంగాల్లో శాశ్వత కాల్పుల విరమణకు నిర్ణయం తీసుకోవాలని ఉంది.

అనంతరం సమగ్ర అణు ఒప్పందం కోసం 60 రోజుల పాటు చర్చలు జరగాలి. అలాగే ఇరాన్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోబోమని, అక్కడి సరిహద్దుల్లో ఉన్న తమ బలగాలను ఉపసంహరించుకుంటామని అమెరికా హామీ ఇవ్వడం ప్రధానంగా ఉంది. నెల రోజుల్లోపు నావికా దిగ్బంధనం కూడా ఎత్తివేయాలి. 30 రోజుల్లో హార్ముజ్ జలసంధిని పూర్తిగా తెరవాలి.

ఇరాన్ చమురు సంబంధిత ఎగుమతులపై ఆంక్షలు నిలిపివేసి తద్వారా వచ్చే ఆదాయాలకు పూర్తి అనుమతి ఇవ్వాలి. అమెరికా, దాని మిత్రదేశాలు ఇరాన్ కు కనీసం 300 బిలియన్ డాలర్ల విలువైన పునర్నిర్మాణ ప్రణాళికలు అందించాలి. అణు సమస్యలపై తుది ఒప్పందానికి సంబంధించి చర్చల కోసం 60 రోజులు కేటాయించాలి.

అణ్వాయుధాలను అభివృద్ధి చేయబోమని ఇరాన్ తన హామీని నిలబెట్టుకోవాలి. చర్చలు జరిగే సమయంలో అమెరికా ఎలాంటి అదనపు బలగాలు పంపదు. కొత్తగా ఎటువంటి ఆంక్షలు విధించబోదు. ఇక యుద్ధం మొదలైనప్పటి నుంచి స్తంభింపజేసిన ఇరాన్ 24 బిలియన్ డాలర్ల ఆస్తులను విడుదల చేయాలి.

America – Iran

దీనిలో సగం ఆస్తులు చర్చలు ప్రారంభించడానికి ముందే విడుదల చేయాలి. ఒప్పందాన్ని పక్కాగా అమలు చేసేందుకు వీలుగా ఒక పర్యవేక్షణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. చర్చలు పూర్తిగా ముగిసిన తర్వాత తుది ఒప్పందాన్ని ఐరాస భద్రతామండలి తీర్మానం ద్వారా ఆమోదించాలి.

కాగా తుది ఒప్పందంలో కేవలం యురేనియం శుద్ధి, ఆంక్షల సడలింపు, ఇరాన్ కు ఆర్థిక సాయం ఈ మూడు అంశాలపై ఏకాభిప్రాయం వస్తే తప్ప యుద్ధం ముగిసే పరిస్థితి కనిపించడం లేదు.

SpaceX IPO : స్పేస్‌ఎక్స్ ఐపీఓ దెబ్బకు రూ. 95 లక్షల కోట్లు.. ప్రపంచాన్నే కొనగల రేంజ్‌కు ఎలన్ మస్క్

Exit mobile version