America – Iran
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్దవాతావరణ పరిస్థితులకు ముగింపు పడనుందా.. అమెరికా,ఇరాన్(America – Iran) మధ్య శాంతి ఒప్పందం కొలిక్కి వచ్చిందా.. అంటే అవుననే అంటోంది సౌదీ అరేబియాకు చెందిన మీడియా. తాజాగా అమెరికా,ఇరాన్ యుద్ధం ముగింపు దశకు చేరిందని సౌదీకి చెందిన ఓ ఛానల్ సంచలన కథనం ప్రసారం చేసింది.
దీనిపై ఇరు దేశాలు మరికొన్ని గంటల్లో కీలక ప్రకటన చేయబోతున్నట్టు తెలిపింది. రెండు దేశాల మధ్య ఈ చర్చలకు సంబంధించి పాకిస్తాన్ మధ్యవర్తిత్వం చేసిందనీ పేర్కొంది. ప్రధానంగా తక్షణమే కాల్పుల విరమణ, హర్మూజ్ జలసంధిలో నౌకాయానం అంశాలు ఈ ఒప్పందంలో ఉంటాయని వెల్లడించింది. యుద్ధానికి సంబంధించి సైనిక, ఆర్థిక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోరాదని పరస్పర అంగీకారంగా ఉండనుంది. వీటితో పాటు ఒకరి అంతర్గత విషయాల్లో మరొకరు జోక్యం చేసుకోకపోవడం, హర్మూజ్ జలసంధిలో నౌకాయాన స్వేచ్ఛకు ఎలాంటి అంతరాయం లేకుండా చూడడం కూడా ఉన్నాయి.
ఇదిలా ఉంటే తాజాగా కుదిరే ఒప్పందాన్ని సరిగ్గా అమలయ్యేలా చూసేందుకు, వివాదాలను పరిష్కరించేందుకు ఒక ఉమ్మడి కమిటీని కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వచ్చే వారం రోజుల్లో మిగిలిన సమస్యలపై చర్చలు జరిపి పరిష్కరించుకోవడంపైనా దృష్టి పెట్టనున్నట్టు తెలిపారు. ఈ క్రమంలో అమెరికా పలు ఆంక్షలు ఎత్తివేసేందుకు కూడా నిర్ణయించింది.
దీంతో యుద్ధం ముగింపు దశకు చేరినట్టేనని పలువురు భావిస్తున్నారు. కాగా ఇరు దేశాల మధ్య ఈ ఒప్పందాన్ని కుదిర్చే విషయంలో పాక్ మధ్యవర్తిత్వం చేసింది. పాక్ మంత్రి నఖ్వీ, అసిమ్ మునీర్ లు అమెరికా ప్రతిపాదనలను ఇరాన్ ముందు ఉంచి చర్చించారు. దీనిపై ఇరాన్ కూడా సానుకూలంగా స్పందించడంతో చర్చల్లో మరో ముందడుగు పడింది. అటు ఖతార్ కూడా తన ప్రతినిధులను టెహ్రాన్ కు పంపడంతో యుద్ధం ముగింపుపై ప్రపంచదేశాల్లో ఆశలు చిగురించాయి.
అయితే అణ్వాయుధాలకు సంబంధించి మాత్రం చర్చలు కొలిక్కి రాలేదు. 900 పౌండ్ల శుద్ధి చేసిన యురేనియం ఇరాన్ దగ్గర ఉంచకుండా ధ్వంసం చేయాలని ట్రంప్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి. ఈ విషయంలో అమెరికా, ఇజ్రాయిల్ ఒకే మాటపై ఉండడంతో ఇరాన్ వెనక్కి తగ్గుతుందా లేక మొండి వైఖరినే కొనసాగిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.
Thailand : భారతీయులకు థాయ్ ప్రభుత్వం షాక్..కొత్త వీసా రూల్స్ ప్రకటన
