Puducherry : పుదుచ్చేరి ఎన్డీఏ కూటమిలో విభేదాలు..విజయ్ పార్టీతో రంగస్వామి పొత్తు ?

Puducherry : అన్నాడీఎంకేకి చెందిన ఒక ఎమ్మెల్యే, ఇద్దరు ఇండిపెండెంట్ల మద్దతుతో బీజేపీ అవసరం లేకుండానే ప్రభుత్వాన్ని నిలబెట్టుకునే అవకాశాలను రంగస్వామి పరిశీలిస్తున్నారు.

Puducherry

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు.. శాశ్వత శతృవులు కూడా ఉండరు.. ఎప్పుడు ఏమైనా జరగొచ్చు. అధికారం కోసం ఎలాంటి నిర్ణయాలైనా పార్టీలు తీసుకుంటాయి. ప్రస్తుతం పుదుచ్చేరి(Puducherry) రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

అధికార ఎన్నార్ కాంగ్రెస్ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి విచ్ఛిన్నమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రెండు నెలల క్రితం ముగిసిన ఎన్నికల్లో ఎన్నార్ కాంగ్రెస్ , బీజేపీ కూటమి విజయం సాధించి రంగస్వామి ఐదోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే, ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు గడుస్తున్నా.. స్పీకర్ ఎన్నిక, మంత్రులకు శాఖల కేటాయింపు ప్రక్రియ ఇంకా కొలిక్కి రాలేదు.

ఈ ప్రతిష్టంభన వల్లే కూటమి విచ్ఛిన్నం కాబోతోందనే ప్రచారం జరుగుతోంది. పుదుచ్చేరి ఎన్నికల్లో మొత్తం 30 స్థానాలకు గానూ ఎన్నార్ కాంగ్రెస్ ఎన్డీఏ కూటమి 16 స్థానాలు గెలుచుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 15 సీట్ల కంటే ఒకటి ఎక్కువగా గెలిచింది. 16 సీట్లలో నలుగురు బీజేపీ నుంచి విజయం సాధించారు.

అయితే కీలకమైన మంత్రిత్వ శాఖలతోపాటు స్పీకర్ పదవిని తమకే కేటాయించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఎన్నికల ప్రచారంలో బీజేపీ అభ్యర్థుల కోసం ఎన్నార్ కాంగ్రెస్ నేతలు పెద్దగా ప్రచారం చేయకపోవడం, తమ పార్టీ అభ్యర్థులను ఓడించడానికి బీజేపీ పరోక్షంగా స్వతంత్రులకు మద్దతుగా నిలిచిందన్న ప్రచారంతో రంగస్వామి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.

ఇదిలా ఉండగా, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తీసుకుంటున్న కొన్ని ఏకపక్ష నిర్ణయాలపై సీఎం రంగస్వామి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి తెలీకుండానే నియామకాలు జరగడంపై గతంలో నిరసన కూడా తెలిపారు. అలాగే పుదుచ్చేరికి పూర్తి రాష్ట్ర హోదా కల్పించాలని రంగస్వామి చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీతో వేదిక పంచుకున్న సమయంలోనూ ఆయన ఈ డిమాండ్‌ను వినిపించారు. కానీ బీజేపీ నాయకత్వం దీనిపై ఎలాంటి సానుకూల హామీ ఇవ్వకపోవడం అసంతృప్తికి కారణమైంది.

Puducherry

ఈ కారణాలతో మంత్రివర్గంలో కీలకశాఖలు బీజేపీకి ఇవ్వడానికి రంగస్వామి సిద్ధంగా లేరు. ఒకవేళ బీజేపీ డిమాండ్లకు రంగస్వామి లొంగకపోతే, ఆయన కూటమి నుంచి బయటకు వచ్చే అవకాశాలు లేకపోలేదని భావిస్తున్నారు.

నటుడు విజయ్‌కు చెందిన టీవీకే పార్టీకి పుదుచ్చేరిలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. అలాగే అన్నాడీఎంకేకి చెందిన ఒక ఎమ్మెల్యే, ఇద్దరు ఇండిపెండెంట్ల మద్దతుతో బీజేపీ అవసరం లేకుండానే ప్రభుత్వాన్ని నిలబెట్టుకునే అవకాశాలను రంగస్వామి పరిశీలిస్తున్నారు. మరోవైపు బీజేపీ అధిష్టానం రంగంలోకి దిగి రంగస్వామిని బుజ్జగిస్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి.

China : రూ.2800 కోట్ల లంచం ..మరణశిక్ష..అక్కడ అవినీతికి పాల్పడితే అంతే

Exit mobile version