Blue Moon
ఖగోళ ప్రియులకు , ఆకాశంలో జరిగే వింతలను ఇష్టపడే వారికి అద్భుతమైన న్యూస్ వినిపిస్తోంది. అంతరిక్షంలో జరగబోయే ఒక అరుదైన, అత్యంత అందమైన దృగ్విషయానికి నింగి వేదిక కాబోతోంది. సుమారు మూడేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆకాశంలో బ్లూ మూన్ (Blue Moon)దర్శనమివ్వబోతోంది.
ఈ అద్భుతమైన చందమామను చూడటానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఖగోళ శాస్త్రవేత్తలతో పాటు సాధారణ ప్రజలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది మే 31వ తేదీ ఆదివారం రోజు ఈ అరుదైన ఖగోళ వింత ఆవిష్కృతం కాబోతోంది.
అంతేకాదు ప్రత్యేకించి భారతదేశంలోని ప్రజలకు కూడా ఈ సుందర దృశ్యాన్ని కనులారా వీక్షించే భాగ్యం కలగబోతుండటంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
చాలామంది బ్లూ మూన్ (Blue Moon) అనగానే చందమామ నిజంగానే నీలం రంగులోకి మారిపోతాడేమో అని అనుకుంటారు. కానీ, నిజానికి చంద్రుడి రంగులో ఎలాంటి మార్పూ ఉండదు.
ఖగోళ శాస్త్రం చెబుతున్నదాని ప్రకారం, ఒకే క్యాలెండర్ నెలలో కనుక రెండు పౌర్ణమిలు వస్తే, ఆ నెలలో వచ్చే రెండో పౌర్ణమిని ‘బ్లూ మూన్’ అని పిలుస్తారు. ఇంగ్లీషులో ఒన్స్ ఇన్ ఎ బ్లూ మూన్ అనే సామెత ఉన్నట్లుగానే, ఇది చాలా అరుదుగా జరిగే ప్రక్రియ కాబట్టి దీనికి ఆ పేరు పెట్టారు.
అయితే ఈ ఏడాది కనిపించబోయే బ్లూ మూన్‌కు ఒక స్పెషల్ ట్విస్ట్ ఉంది. ఇది కేవలం బ్లూ మూన్ మాత్రమే కాదు, దీంతో పాటు మైక్రోమూన్ కూడా ఇదే కానుంది. అంటే, ఈ పౌర్ణమి సమయంలో చంద్రుడు భూమికి ఉండాల్సిన సాధారణ దూరం కంటే కొంచెం ఎక్కువ దూరంలో ఉంటాడు.
దీనివల్ల మిగతా రోజుల్లో కనిపించే పౌర్ణమి చందమామతో పోలిస్తే, ఈ ఆదివారం అంటే మే 31 రాత్రి కనిపించే చంద్రుడు.. పరిమాణంలో మాత్రం కాస్త చిన్నగా, ఎంతో ముద్దుగా దర్శనమివ్వబోతున్నాడు.
సాధారణంగా ప్రజలు బ్లూ మూన్, సూపర్‌మూన్ పేర్లతో కన్ఫ్యూజ్ అవుతుంటారు. నిజానికి ఈ రెండూ పూర్తిగా వేర్వేరు విషయాలు. బ్లూ మూన్ అనేది కేవలం క్యాలెండర్ డేట్స్ ఆధారంగా, ఒకే నెలలో వచ్చే రెండో పౌర్ణమిని సూచిస్తుంది.
కానీ సూపర్‌మూన్ అనేది చంద్రుడు భూమికి అత్యంత దగ్గరగా వచ్చినప్పుడు జరుగుతుంది. ఆ సమయంలో మూన్ మామూలుగా కంటే చాలా పెద్దగా, విపరీతమైన వెలుగుతో కనిపిస్తాడు.
అయితే ఈసారి మనకు రాబోతున్నది మైక్రోమూన్ కాబట్టి చందమామ కాస్త చిన్నగా కనిపించినా, ఆకాశంలో దీని ప్రకాశం ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది.
భారత్‌లో ఉన్నవారు ఈ అరుదైన అద్భుతాన్ని ఎప్పుడు చూడొచ్చంటే.. మే 31వ తేదీ ఆదివారం సాయంత్రం 6:30 గంటల నుంచి రాత్రి 7:30 గంటల మధ్య సమయం దీనిని వీక్షించడానికి అత్యంత అనుకూలమైనదిగా ఖగోళ శాస్తవేత్తలు చెబుతున్నారు.
ఆ సమయంలో ఆకాశంలో చంద్రుడి అందాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ఈ వింతను చూడటానికి ఎలాంటి టెలిస్కోప్‌లు కానీ, స్పెషల్ బైనాక్యులర్స్ కానీ అవసరం లేదు.
వాతావరణం గనుక మబ్బులు లేకుండా నిర్మలంగా, క్లీన్‌గా ఉంటే డైరెక్టుగా మీ ఇంటి డాబా పైనుంచో, ఇంటి ఆవరణ నుంచో ఈ అరుదైన బ్లూ మూన్ అందాలను చూసి ఆస్వాదించొచ్చు.
మళ్లీ ఇలాంటి అవకాశం రావాలంటే మరి కొన్నేళ్లు వెయిట్ చేయాల్సి వస్తుంది కాబట్టి, ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోకండి. ఈ ఆదివారం సాయంత్రం ఆకాశం వైపు ఒక లుక్ వేయడం అస్సలు మర్చిపోకండి.
IPL Final : ఐపీఎల్ ఫైనల్‌కు కౌంట్ డౌన్..టైటిల్ చిక్కేదెవరికి ?
