Fake News
ప్రస్తుతం ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధంతో పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు.. కేవలం సరిహద్దులకే పరిమితం కాలేదు. తుపాకులు, బాంబులతో జరిగే యుద్ధం ఒకవైపు అయితే ఇంటర్నెట్ వేదికగా జరుగుతున్న ఫేక్ న్యూస్(Fake News) యుద్ధం మరోవైపు కలకలం రేపుతోంది.
ఇరాన్ టార్గెట్‌గా జరుగుతున్నకొన్ని సైనిక చర్యల తర్వాత సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్(Fake News)లు జోరందుకున్నాయి. ఈ పరిణామాలను గమనించిన యూఏఈ ప్రభుత్వం.. దేశ భద్రత దృష్ట్యా చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటోంది. ఫేక్ న్యూస్‌లు, కల్పిత కథనాలను వ్యాప్తి చేసే వారిపై అక్కడి పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.
కేవలం రెండు రోజుల వ్యవధిలోనే సుమారు 35 మందిని.. యూఏఈ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు కనిపిస్తోంది. దీనిలో విచారకరమైన విషయం ఏంటంటే, పట్టుబడిన వారిలో 19 మంది భారతీయులే ఉన్నారని తెలుస్తోంది. వీరందరినీ మూడు రకాలుగా విభజించి అధికారులు విచారణ జరుపుతున్నట్లు సమాచారం.
మొదటి రకం వారు కేవలం వ్యూస్ కోసమో ,సెన్సేషన్ కోసమో తెలిసీ తెలియని సమాచారంతో పోస్టులు షేర్ చేసేవారు. రెండవ రకం వారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీని ఉపయోగించి అబద్ధాలను క్రియేట్ చేసేవారు. మూడో రకం వారు ఇతర దేశాల ప్రయోజనాల కోసం కావాలనే తప్పుడు ప్రచారాలు చేసేవారు.
అయితే వీళ్లు అనుసరిస్తున్న పద్ధతులు చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. రక్షణ వ్యవస్థలకు సంబంధించిన ఓల్డ్ వీడియోలను తీసుకుని, వాటికి భయంకరమైన శబ్దాలను యాడ్ చేసి కొత్తగా పేలుళ్లు జరిగినట్లు క్రియేట్ చేస్తున్నారు.
మరికొందరు ఏఐ సాయంతో ఫేక్ సీన్లను క్రియేట్ చేసి, వాటికి యూఏఈ జెండాలను తగిలించి ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నారు. ఇటువంటి చర్యలను యూఏఈ ప్రభుత్వం దేశద్రోహంతో సమానంగా పరిగణిస్తోంది.
శత్రు దేశాల చర్యలను సమర్థించడంతో పాటు తప్పుడు వార్తలను పదేపదే ఇతరులకు పంపడం అక్కడ నేరం. ఈ నేరం రుజువైతే కనీసం ఒక ఏడాది జైలు శిక్ష పడటమే కాకుండా, ఒక లక్ష దిర్హామ్ల ఫైన్ విధిస్తారు. మన భారతీయ కరెన్సీలో ఇది దాదాపు 23 లక్షల రూపాయలకు పైనే ఉంటుంది.
యుద్ధ సమయంలో జరిగే పోరాటం ఎంత కీలకమో, డిజిటల్ ప్రపంచంలో అబద్ధాలను అరికట్టడం కూడా అంతే ముఖ్యమన్న విషయం తెలిసిందే. అందుకే అక్కడ నివసించే ప్రవాస భారతీయులు ఆ దేశ చట్టాలను సైతం గౌరవించాలి.
ముఖ్యంగా వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా వేదికల్లో ఏదైనా సమాచారాన్ని ఇతరులకు పంపే ముందు అది నిజమో కాదో గవర్నమెంట్ అఫీషియల్ వెబ్‌సైట్లలో సరిచూసుకోవడం చాలా మంచిది. అనవసరమైన రాజకీయ చర్చలకు, సైనిక పరమైన పోస్టులకు దూరంగా ఉండటం ద్వారా మనల్ని మనం రక్షించుకోవచ్చు. జాగ్రత్తగా ఉండండి, చట్టాలను గౌరవించండి.
