US Student Visa
అమెరికాలో చదువుకుంటున్న, రీసెర్చ్‌లు చేస్తున్న వేలాది మంది భారతీయ విద్యార్ధుల భవిష్యత్తును టెన్షన్‌లో పడేస్తూ యూఎస్‌ఏ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఎఫ్-1 (స్టూడెంట్), జే-1 (రీసెర్చ్) వీసాలపై మాగ్జిమమ్ నాలుగేళ్ల లిమిట్ పెడుతూ కొత్త రూల్ ఖరారు చేసింది.
అయితే అమెరికా తీసుకుంటున్న ఈ నిర్ణయం వల్ల చాలామంది స్టూడెంట్స్ లాస్ అవుతారనే ఆందోళన కనిపిస్తోంది. వారంతా తమ కోర్సులు, ప్రాజెక్టులు పూర్తి కాకుండానే చదువు మధ్యలో ఆపేసి దేశం వదిలి రావాల్సి వస్తుందని ‘ఎఫ్ఐఐడీఎస్’ (FIIDS) అనే ఇండియన్ గ్రూప్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ జూలై 16-17 తేదీల్లో ఈ కొత్త కండిషన్‌ను ఓకే చేసింది. సెప్టెంబర్ మధ్య నుంచి ఇది అమల్లోకి రాబోతోంది. ఇన్నాళ్లూ ఉన్న డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ అంటే చదువు పూర్తయ్యే వరకు కూడా అమెరికాలోనే ఉండే అవకాశంపై ఉన్న రూల్‌ను ఎత్తేసి, ఈ నాలుగేళ్ల పరిమితిని తీసుకొచ్చారు.
స్టూడెంట్స్(US Student Visa) ఇకపై అమెరికాలో గరిష్టంగా నాలుగేళ్లు మాత్రమే ఉండటానికి అవకాశం ఉంటుంది. ఇంటర్న్‌షిప్ లేదా ట్రైనింగ్ పొందే ఓపీటీ (OPT), STEM OPT సమయాన్ని కూడా ఈ నాలుగేళ్లలోనే కౌంట్ చేస్తారు. అంతేకాదు, కోర్సు పూర్తయ్యాక అక్కడ ఉండటానికి ఇచ్చే సమయాన్ని 60 రోజుల నుంచి 30 రోజులకే తగ్గించేశారు. ఒకవేళ ఈ టైమ్ పెంచుకోవాలంటే మాత్రం ముందుగానే అప్లికేషన్ పెట్టాల్సి ఉంటుంది.
అయితే ఇది అమెరికాకు అమెరికానే చేసుకుంటున్న పెద్ద నష్టమని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. నార్మల్‌గా అక్కడ బ్యాచిలర్ డిగ్రీ అవ్వడానికి నాలుగేళ్లకు పైగా పట్టగా అదే పీహెచ్‌డీకి అయితే ఐదేళ్లకు పైగా పడుతుంది.
మరోవైపు ఆఫీసుల్లో ఇప్పటికే లక్షలాది అప్లికేషన్లు పెండింగ్‌లో ఉండటంతో.. వాటి ప్రాసెసింగ్‌కే ఏడాదిపైనే పడుతోంది. ఇలాంటి టైమ్‌లో ఇలాంటి రూల్ తెస్తే స్టూడెంట్స్ చదువులు మధ్యలోనే ఆగిపోతాయని, మంచి ట్యాలెంట్ ఉన్నవాళ్లను అమెరికా కోల్పోతుందని హెచ్చరిస్తున్నారు.
అందుకే అమెరికా తీసుకున్న ఈ కొత్త నిబంధన నిర్ణయాన్ని వెంటనే ఆపాలని.. పాత పద్ధతినే కొనసాగించాలని ఎఫ్ఐఐడీఎస్ కోరింది. నాలుగేళ్ల కంటే ఎక్కువ సమయం పట్టే కోర్సులకు మినహాయింపులు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.
