Jagan : ఆ డిజిటల్ యాప్‌తో కూటమికి కొత్త సవాల్

Jagan : తమ ఫిర్యాదులకు సంబంధించిన ఆధారాలుగా ఉన్న వీడియోలు లేదా పత్రాలను కూడా నేరుగా యాప్‌లో అప్‌లోడ్ చేసే వీలు కల్పిస్తారు

Jagan : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలకు మరింత చేరువయ్యేందుకు, వారి సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. త్వరలో ఒక ప్రత్యేక మొబైల్ యాప్‌(Mobile App)ను అందుబాటులోకి తేనున్నట్లు జగన్ ప్రకటించారు. ఈ యాప్ ద్వారా, తమకు కూటమి ప్రభుత్వం లేదా అధికారుల నుంచి ఏ విధమైన వేధింపులు, అన్యాయం జరిగినా, ప్రజలు తక్షణమే ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

Jagan

ఈ యాప్ ప్రజలకు ఒక రక్షణ కవచంగా పనిచేస్తుంది. “పలానా వ్యక్తి, పలానా అధికారి కారణంగా ఇబ్బంది పడ్డాను” అని స్పష్టంగా యాప్‌లో నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా, తమ ఫిర్యాదులకు సంబంధించిన ఆధారాలుగా ఉన్న వీడియోలు లేదా పత్రాలను కూడా నేరుగా యాప్‌లో అప్‌లోడ్ చేసే వీలు కల్పిస్తారు. ఈ ప్రక్రియ వల్ల ఫిర్యాదులు మరింత పారదర్శకంగా, విశ్వసనీయంగా ఉంటాయని వైసీపీ భావిస్తోంది.

ఈ యాప్ ద్వారా అందిన ప్రతి ఫిర్యాదు ఆటోమేటిక్‌గా వైసీపీ డిజిటల్ సర్వర్‌లోకి చేరుకుంటుంది. ఈ వ్యవస్థ ద్వారా అన్యాయానికి గురైన ప్రజల గోడు నేరుగా పార్టీ అధిష్టానానికి చేరుతుందని జగన్ హామీ ఇస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే, ఈ యాప్ ద్వారా అందిన అన్ని ఫిర్యాదులను కచ్చితంగా పరిశీలిస్తామని, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వంలో వేధింపులకు గురైన ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఈ యాప్ ఒక బలమైన సాధనంగా పనిచేస్తుందని వైసీపీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఈ యాప్ ద్వారా అన్యాయానికి గురైన ప్రజలందరూ ఫిర్యాదులు చేసి, తమకు న్యాయం జరిగేలా చూసుకోవచ్చని జగన్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ యాప్ అమలులోకి వస్తే, ప్రజలకు తమ సమస్యలను తెలియజేయడానికి, న్యాయం పొందడానికి ఒక సులభమైన, సమర్థవంతమైన మార్గం లభిస్తుందని వైసీపీ(YSRCP)శ్రేణులు కూడా భావిస్తున్నాయి.

జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ఎంచుకున్న ఈ డిజిటల్ స్ట్రాటజీ వినూత్నంగా ఉన్నా, ఇది ఎంతవరకు వర్కవుట్ అవుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఫిర్యాదుల గోప్యత, భద్రత, అందిన ఫిర్యాదులపై తదుపరి చర్యల పారదర్శకతపై ప్రజల్లో నమ్మకం కలిగించడం వైసీపీకి గ్యారంటీగా పెద్ద సవాలే విసురుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Jagan

Exit mobile version