Horsley Hills
న్యూ ఇయర్ అంటే కేక్ కటింగ్‌లు, పార్టీలు, డీజే సాంగ్స్, పాటలు అరుపులు ఇవేనా అనుకున్నవారూ చాలామంది ఉంటారు. ఇలాంటివారికి కూడా కొన్న ప్రదేశాలు ఏపీ,తెలంగాణలోనే ఉంటాయి. హడావిడి, శబ్దాలు, ట్రాఫిక్ మధ్య న్యూ ఇయర్ జరుపుకోవడం కంటే.. ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా కొత్త ఏడాదికి స్వాగతం పలకాలనుకునే వారికి చిత్తూరు జిల్లాలోని ‘హార్సిలీ హిల్స్(Horsley Hills)’ ఒక అద్భుతమైన ప్లేస్ అని చెప్పొచ్చు.
సముద్ర మట్టానికి దాదాపు 4100 అడుగుల ఎత్తులో ఉండే ఈ ప్రాంతాన్ని ‘ఆంధ్రా ఊటీ’ అని పిలుస్తారు. చుట్టూ దట్టమైన అడవి, చల్లని గాలులు, మంచు మేఘాల మధ్య ఇక్కడ గడపడం ఒక మధురమైన అనుభూతిని ఇస్తుంది. కుటుంబంతో లేదా స్నేహితులతో కలిసి న్యూ ఇయర్ ప్లాన్ చేయడానికి ఇది ఎంతో అనువైన ప్రదేశం. న్యూ ఇయర్ అనే కాదు ఎప్పుడు వెళ్లినా అక్కడ అందాలు మిమ్మల్ని కట్టిపడేస్తాయి.
హార్సిలీ హిల్స్(Horsley Hills) లో చూడదగ్గ ప్రదేశాలు చాలా ఉన్నాయి. గాలి బండ (Windy Rock) నుంచి చూస్తే చుట్టూ ఉన్న కొండల అందాలు కనువిందు చేస్తాయి. అలాగే ఇక్కడి వ్యూ పాయింట్స్ నుంచి సూర్యాస్తమయాన్ని చూడటం ప్రకృతి ప్రేమికులకు మర్చిపోలేని అనుభవం. ఇక్కడ ఒక చిన్న జూ, ఎన్విరాన్‌మెంటల్ పార్క్ , మ్యూజియం కూడా ఉన్నాయి.
సాహస ప్రియుల కోసం ట్రెక్కింగ్, రాక్ క్లైంబింగ్ వంటి సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా డిసెంబర్, జనవరి నెలల్లో ఇక్కడి వాతావరణం అత్యంత ఆహ్లాదకరంగా ఉంటుంది. మదనపల్లె నుంచి కేవలం 27 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ హిల్ స్టేషన్ కు రోడ్డు మార్గం ద్వారా ఈజీగా చేరుకోవచ్చు. కొత్త ఏడాదిలో కొత్త ఆశలతో, ప్రకృతి మధ్య సేదతీరాలనుకునే వారు ఒక్కసారైనా హార్సిలీ హిల్స్ కు ఓ ట్రిప్ వేయాలి. ఇక్కడి ప్రశాంతత మీ మనస్సుకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందనడంలో నో డౌట్.
