Ration cards
ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డు(Ration cards)ల జారీకి సంబంధించి ప్రభుత్వం ఒక ముఖ్యమైన అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఈ నెల 25వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈసారి పాత పద్ధతికి భిన్నంగా, ప్రభుత్వం స్మార్ట్ కార్డుల తరహాలో రేషన్ కార్డులను అందించేందుకు సిద్ధమైంది.
కొత్తగా ఇవ్వనున్న రేషన్ కార్డులు (Ration cards) ATM కార్డు పరిమాణంలో ఉంటాయి. కార్డు ముందు వైపున ప్రభుత్వ అధికారిక చిహ్నం, లబ్ధిదారుడి ఫోటో, కార్డు నంబరు, రేషన్ షాపు నంబరు వంటి వివరాలు స్పష్టంగా ముద్రించబడతాయి. ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ ఇప్పటికే వీటి ముద్రణను ప్రారంభించింది. గతంలో అధికారంలో ఉన్న పార్టీ రంగులు, నేతల ఫోటోలు కార్డులపై ముద్రించడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ సమస్యను నివారించడానికి, ప్రస్తుత ప్రభుత్వం ఎటువంటి రాజకీయ ఫోటోలు లేకుండా, ప్రజలకు ఉపయోగపడేలా ఈ స్మార్ట్ కార్డులను రూపొందించింది.
రాష్ట్రంలో చాలా సంక్షేమ పథకాలకు రేషన్ కార్డులే(Ration cards) ప్రామాణికంగా ఉన్నాయి. అయితే, మూడేళ్లుగా కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ జరగకపోవడంతో చాలామంది అర్హులు ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా, కుటుంబాల నుంచి విడిపోయిన వారు, కొత్తగా పెళ్ళైనవారు, అలాగే చిరునామా మార్చుకోవాలనుకునే వారికి ఇది ఒక పెద్ద సమస్యగా మారింది. ఈ సమస్యను గుర్తించిన కూటమి ప్రభుత్వం, కొత్త కార్డుల జారీకి వెంటనే ఆమోదం తెలిపింది. మే 7 నుంచి సచివాలయాల్లో దరఖాస్తులను స్వీకరించడం ప్రారంభించి, ఇప్పుడు కార్డుల పంపిణీకి రంగం సిద్ధం చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 25వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ జరగనుంది. కార్డుల ముద్రణ కోసం ఇప్పటికే టెండర్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం చెన్నైలో జరుగుతున్న ముద్రణ తర్వాత, కార్డులను నేరుగా మండల కేంద్రాలకు పంపిణీ చేయనున్నారు. సెప్టెంబర్ నెల నుంచి ఈ కొత్త కార్డుల ఆధారంగానే లబ్ధిదారులకు రేషన్ సరుకులు అందించనున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1.46 కోట్లకు పైగా రేషన్ కార్డులు ఉన్నాయి. ఇటీవలి e-KYC ప్రక్రియ ద్వారా, చనిపోయిన 3.56 లక్షల మంది లబ్ధిదారుల పేర్లను కార్డుల నుంచి తొలగించారు. ఈ కీలకమైన మార్పుల తో, మూడేళ్ల తర్వాత స్మార్ట్ రేషన్ కార్డుల రూపంలో కొత్త కార్డులు రావడం ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉండనుంది.