Ghatkesar murder: ఘట్‌కేసర్(Ghatkesar) మండలం ఎదులాబాద్ చెరువు(Edulabad lake)లో జులై 7న ఓ వ్యక్తి మృతదేహం తేలియాడుతూ కనిపించడంతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు, గజ ఈతగాళ్ల సాయంతో ఆ మృతదేహాన్ని బయటకు తీశారు. శరీరంపై గాయాలుండటంతో దీన్ని అనుమానాస్పద మృతిగా భావించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు హైదరాబాద్(Hyderabad) కవాడిగూడలోని ముగ్గుల బస్తీకి చెందిన 45 ఏళ్ల వడ్లూరి లింగంగా గుర్తించారు. అక్కడి నుంచి అసలు కథ మొదలైంది.
కన్నీళ్ల మాటున దాగున్న కుట్ర
పోలీసులు లింగం ఇంటికి వెళ్ళగా, అతని భార్య శారద (40) , కుమార్తె మనీషా (25) కన్నీళ్లు పెట్టుకుంటూ కనిపించారు. లింగం గత నాలుగు రోజులుగా కనిపించడం లేదని, అతనికి కల్లు తాగే అలవాటు ఉందని, తరచూ ఇంట్లో గొడవలు పడేవాడని వివరించారు. జులై 6న ఇంట్లోంచి వెళ్ళిపోయి మళ్లీ రాలేదని తెలిపారు. అయితే, వారి మాటల్లో ఏదో తేడా ఉందని గ్రహించిన పోలీసులు, చెరువు సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించగా, తెర వెనుక దాగున్న దారుణ సత్యం ఒక్కొక్కటిగా బయటపడింది. ఆ అమాయక కన్నీళ్ల వెనుక ఓ భయంకరమైన హత్య పథకం దాగి ఉందని పోలీసులు ఊహించలేదు.
వివాహేతర బంధంతో విచ్ఛిన్నమయిన కుటుంబం
లింగం పాతబస్తీలోని ఒక అపార్ట్‌మెంట్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేసేవాడు, అతని భార్య శారద జీహెచ్‌ఎంసీలో స్వీపర్. వీరికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె మనీషాకు వివాహమైంది. కానీ, ఇక్కడే విషాదకరమైన మలుపు తిరిగింది. మనీషా తన భర్త స్నేహితుడైన జవహర్‌నగర్, బీజేఆర్‌నగర్‌కు చెందిన 24 ఏళ్ల మహ్మద్ జావీద్ తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలుసుకున్న భర్త ఆమెను విడిచిపెట్టాడు. దాంతో మనీషా, తన ప్రియుడు జావీద్‌తో కలిసి మౌలాలీలో ఒక అద్దె ఇంట్లో కాపురం పెట్టింది.
ఈ విషయం తెలిసి లింగం తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. కుమార్తె కాపురం కూల్చుకుని మరో వ్యక్తితో ఉండటం అతనికి రుచించలేదు. దీంతో అతను మనీషాను తీవ్రంగా మందలించాడు. అంతేకాకుండా, లింగం తన భార్య శారదను కూడా అనుమానించడం మొదలుపెట్టాడు. ఈ పరిణామాలు మనీషాకు కోపం తెప్పించాయి. తన తండ్రి అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్న ఆమె, తన తల్లి శారదతో కలిసి లింగంను హత్య చేసేందుకు ఓ దారుణమైన పథకం పన్నింది.
అర్థరాత్రి అమానవీయ హత్యాకాండ
పథకం ప్రకారం, జులై 5న శారద కొన్ని నిద్రమాత్రలు తీసుకొచ్చింది. వాటిని కల్లులో కలిపి అమాయకుడైన లింగంకు తాగించింది. కల్లు మత్తులో, నిద్రమాత్రల ప్రభావంతో అతను గాఢ నిద్రలోకి జారుకున్నాడు. అదే అదనుగా భావించిన మనీషా, జావీద్, మరియు శారద – ఈ ముగ్గురూ కలిసి లింగం ముఖంపై దిండుతో అదిమి హత్య చేశారు. తమ చేతులతో కన్నతండ్రిని, కట్టుకున్న భర్తను చంపిన తర్వాత, నిందితులు ముగ్గురూ ఏమీ తెలియనట్లు సెకండ్ షో సినిమాకు వెళ్ళారు. అర్ధరాత్రి తిరిగి వచ్చిన మనీషా ఒక క్యాబ్‌ను బుక్ చేసింది. మృతదేహాన్ని కారులోకి ఎక్కిస్తుండగా, డ్రైవర్‌కు అనుమానం వచ్చి ప్రశ్నించగా... తెలివిగా వ్యవహరించిన నిందితులు, “మా తండ్రి బాగా కల్లు తాగి నిద్రపోతున్నాడు, అందుకే ఇలా మోసుకెళ్తున్నాం” అని నమ్మించారు.
తర్వాత ఎదులాబాద్ వద్దకు చేరుకున్న నిందితులు ముగ్గురూ, లింగం మృతదేహాన్ని కారులోంచి తీసి ఎదులాబాద్ చెరువు(Edulabad lake)లో పడవేశారు. దీంతో ఇక తమ నేరం బయటపడదనుకున్నారు. కానీ సీసీ కెమెరాలు, పోలీసుల పదునైన దర్యాప్తు వారి కుట్రను బట్టబయలు చేశాయి. మూడు రోజుల తర్వాత చెరువులో లభ్యమైన లింగం మృతదేహం, ఒక కుటుంబం లోపల జరిగిన చీకటి కథను వెలుగులోకి తెచ్చింది. పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, కోర్టు ముందు హాజరుపరిచి, రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు సమాజంలో నైతిక విలువల పతనాన్ని, ఆధునిక సంబంధాల విలువలను మరోసారి కళ్ళకు కట్టింది.