Bigg Boss: బిగ్ బాస్‌లో బోరింగ్ టాస్క్‌‌లు..ఇలాగే అయితే కష్టమే

Bigg Boss: టాస్క్ అంతగా ఆకట్టుకోలేకపోయినా, ఈ ఆటలో పాల్గొన్న కంటెస్టెంట్ల అసలు వ్యక్తిత్వం, వ్యూహాలు మాత్రం బయటపడ్డాయి.

Bigg Boss

బిగ్ బాస్ (Bigg Boss) హౌస్ అంటేనే ఆసక్తి, ఉత్కంఠ. కానీ శుక్రవారం జరిగిన 8వ ఎపిసోడ్ మాత్రం ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టిందనే చెప్పొచ్చు. ఎవరికి ఎంత అదృష్టం ఉందో పరీక్షిద్దాం అంటూ పెట్టిన టాస్క్ అంతగా ఆకట్టుకోలేకపోయినా, ఈ ఆటలో పాల్గొన్న కంటెస్టెంట్ల అసలు వ్యక్తిత్వం, వ్యూహాలు మాత్రం బయటపడ్డాయి.

ఆట మొదలయ్యే ముందు, కంటెస్టెంట్లకు ఒక పెట్టెలోంచి పండ్లు తీసుకోవాలని శ్రీముఖి చెప్పింది. అలా గ్రీన్ ఆపిల్‌ను ఎంచుకున్న నాగ, మనీష్, షాకిబ్… ఈ రోజు టాస్క్‌లకు నాయకులుగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత, వారు ముగ్గురు జడ్జ్‌ల వద్ద ఉన్న కార్డులను ఎంచుకోవాలి. నాగ అభిజిత్ వద్ద, మనీష్ బిందు మాధవి వద్ద, షాకిబ్ నవదీప్ వద్ద ఉన్న కార్డులను తీసుకున్నారు.

ఈ కార్డులపై ఉన్న సంఖ్యలు వాళ్ల టీంలలో ఎంతమంది ఉంటారో నిర్ణయించాయి. నాగకు 4, షాకిబ్‌కు 2, మనీష్‌కు 6 నంబర్లు వచ్చాయి. షాకిబ్ తన టీంలోకి దివ్య, కళ్యాణ్ పడాలను ఎంపిక చేసుకున్నాడు. నాగ తన టీంలోకి ప్రియా, హరీష్, శ్రీజ, అనూషను తీసుకున్నాడు. మిగిలిన కంటెస్టెంట్లంతా మనీష్ టీంలో చేరారు. అలా రెడ్ టీంకు నాగ, గ్రీన్ టీంకు మనీష్, ఎల్లో టీంకు షాకిబ్ లీడర్లుగా బాధ్యతలు తీసుకున్నారు.

bigg boss

ఈ అగ్నిపరీక్షలో, ఒక టీం నుంచి ఒక కంటెస్టెంట్ వచ్చి, గంట కొట్టి ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. ఇందులో రకరకాల ఫోటోలు చూపిస్తూ, వాటిలో ఉన్న తప్పులు, లాజిక్స్, రీజనింగ్ గురించి సిల్లీ, సింపుల్ ప్రశ్నలు వేశారు. ఈ ప్రశ్నలకు మనీష్ సరైన సమాధానం చెప్పలేకపోయాడు. బహుశా, తన తెలివితేటలపై అతిగా నమ్మకం పెట్టుకున్నాడేమో కానీ, అతని టీం దారుణంగా ఓడిపోయింది. తన టీం మెంబర్స్‌ని నమ్ముకుని, వారికి అవకాశం ఇచ్చిన నాగ టీం మాత్రం ఈ ఆటలో విజయం సాధించింది.

మనీష్ ప్రవర్తనపై అతని టీం సభ్యులు తీవ్రంగా విరుచుకుపడ్డారు. ముఖ్యంగా పవన్, ప్రసన్న వంటివారు మనీష్‌ను వ్యతిరేకిస్తూ, తానొక్కడే తెలివైనవాడినని అనుకుంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి ఫలితంగా, మనీష్ ఈ రోజు ఎపిసోడ్‌కు’వరస్ట్ ప్లేయర్’గా ఎన్నికై, ఎల్లో కార్డు అందుకున్నాడు. ఇది మరోసారి వస్తే బయటకు పంపిస్తామని హెచ్చరిక కూడా జారీ చేశారు.

విజయం సాధించినందుకు నాగకు ఓట్ అప్పీల్ చేసుకునే అవకాశం లభించగా, అతను ప్రియాకు ఆ అవకాశాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత, నాగను మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్‌గా ఎంపిక చేయడంతో, అతనికి కూడా ఓట్ అప్పీల్ ఛాన్స్ వచ్చింది. మొత్తానికి, బిగ బాస్ (Bigg Boss) ఎపిసోడ్ పెద్దగా ఆసక్తిని రేకెత్తించకపోయినా, పోటీదారుల మధ్య ఉన్న వ్యూహాలు, స్వభావాలను బయటపెట్టింది. మొత్తంగా ఇలాగే సాగితే మాత్రం టీఆర్పీ ఢమాల్ మనడం గ్యారంటీ. మరి ఇక ముందు ఎలాంటి టాస్కులు వస్తాయో చూడాలి.

మరిన్ని ఎంటర్‌టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version