Gaza
చూసిన ప్రతీచోట హృదయాలను బరువెక్కిస్తున్న దృశ్యాలు…కళ్లు తిప్పితే పొట్టకు తిండి లేక నకనకలాడుతున్న చిన్నారులు, నిస్సహాయంగా కన్నుమూస్తున్న వృద్ధులు, దుఃఖంతో కుమిలిపోతున్న తల్లులు. ఇది ఏ సినిమాలోనే సన్నివేశం కాదు, గాజాలో ప్రజలు అనుభవిస్తున్న కఠిన వాస్తవం.
ఇజ్రాయెల్ విధించిన కఠినమైన దిగ్బంధనం వల్ల, ఆహారం, వైద్యం అందక అక్కడ మానవత్వం కన్నీరు పెడుతోంది. తాజాగా ఇప్పటి వరకూ అక్కడ 290 మందికి పైగా ఆకలితో మరణించారని పాలస్తీనా ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ మరణాలలో పసి పిల్లలు, నిస్సహాయ వృద్ధులు ఎక్కువగా ఉన్నారు.
ఒకప్పుడు సాధారణ జీవితం గడిపిన ప్రజలు ఇప్పుడు ఆహారం కోసం నిత్యం పోరాడుతున్నారు. తిండి దొరకక రోజుల తరబడి ఆకలితో మగ్గిపోతున్నారు. ఈ (Gaza )పరిస్థితిలో చిన్న పిల్లలు కూడా తీవ్రమైన ఆహార లోపంతో బాధపడుతున్నారు.
ఒకప్పుడు ఆరోగ్యంగా ఉన్నవారంతా ఇప్పుడు నిర్జీవంగా కనిపిస్తున్నారు. తమ కళ్ల ముందే తమ పిల్లలు ఆకలితో అల్లాడిపోవడం చూసి తల్లులు పడే వేదన వర్ణనాతీతం. వారి కన్నీరే ఆ బాధను ప్రపంచానికి తెలియజేస్తోంది. నాకు తినడానికి ఓపిక లేదని అన్న పసిపిల్లల మాటలు ప్రతి హృదయాన్ని కలవరపెడుతున్నాయి.
యుద్ధ వాతావరణం, ఉద్యోగాలు లేకపోవడం వంటి కారణాల వల్ల ప్రజల ఆర్థిక పరిస్థితి దారుణంగా పడిపోయింది. దీంతో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటాయి. ఉదాహరణకు, సాధారణంగా రూ.5 ఉండే పార్లే -జీ బిస్కెట్ ప్యాకెట్ గాజాలో రూ.2,400 వరకు అమ్ముడుపోతోందని నివేదికలు చెబుతున్నాయి. ఈ ధరలు సామాన్య ప్రజలకు అందుబాటులో లేకపోవడం వల్ల ఆకలి మరింత పెరిగింది.
ఐక్యరాజ్యసమితి నివేదికల ప్రకారం.. గాజా (Gaza )జనాభాలో సుమారు 20 శాతం కుటుంబాలు తీవ్రమైన ఆహార లోపంతో బాధపడుతున్నాయి. ముఖ్యంగా, 30 శాతం మంది చిన్నారులు పోషకాహార లోపంతో అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ దుర్భర పరిస్థితుల్లో ఆకలి, అనారోగ్యం వల్ల మరణాలు కూడా పెరుగుతున్నాయి. మానవతా సహాయం అందించడానికి ప్రపంచ దేశాలు ప్రయత్నిస్తున్నా, సహాయక మార్గాలను ఇజ్రాయెల్ సైన్యం అడ్డుకోవడంతో ఆహారం, మందులు చాలా తక్కువగా చేరుతున్నాయి.
ఐక్యరాజ్యసమితి (UN), ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), యూనిసెఫ్ (UNICEF), ప్రపంచ ఆహార కార్యక్రమం (WFP) వంటి అనేక అంతర్జాతీయ సంస్థలు గాజాలోని మానవీయ సంక్షోభంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తక్షణమే ఆహారం, వైద్య సహాయం అందించాలని అవి పదే పదే ప్రపంచాన్ని కోరుతున్నాయి. అయినా.. ఇజ్రాయెల్ సైనిక చర్యలు, సరిహద్దుల కఠిన నియంత్రణల వల్ల సహాయం గాజాకు చేరడం కష్టంగా మారింది.
గాజా(Gaza )లో జరుగుతున్న ఈ మానవ విపత్తు ప్రపంచానికి ఒక హెచ్చరిక. మానవత్వం, శాంతి కోసం వెంటనే తగిన సహాయం అందించడం అత్యవసరం. ప్రతి ఒక్కరి జీవితం విలువైనదే. ఆకలి, అనారోగ్యంతో అల్లాడుతున్న ఆ అమాయక ప్రజల బాధను మనసారా అర్థం చేసుకోని, ఈ దురదృష్టకర పరిస్థితిని మార్చడానికి ప్రపంచ దేశాలు ఏకమై చర్యలు తీసుకోవాలి. లేకపోతే, ఈ గాధ మానవత్వానికి ఒక మాయని మచ్చగా మిగిలిపోతుంది.