Braille:లూయిస్ బ్రెయిలీ లిపికి 200 ఏళ్లు.. ఎన్నో జీవితాలను మార్చిన ఆరు చుక్కల అద్భుతం

Braille: సైనికులు రాత్రి వేళల్లో శత్రువులకు దొరక్కుండా సమాచారాన్ని చదువుకోవడానికి వాడే 'నైట్ రైటింగ్' అనే పద్ధతిని స్ఫూర్తిగా తీసుకుని, బ్రెయిలీ లిపిని తయారు చేశారు.

Braille

ప్రతీ ఏటా జనవరి 4వ తేదీని ప్రపంచవ్యాప్తంగా బ్రెయిలీ దినోత్సవంగా జరుపుకుంటాం. కంటి చూపు లేని వారు కూడా అక్షరాలను చదవాలి.. ప్రపంచ జ్ఞానాన్ని పొందాలనే ఉద్దేశంతో బ్రెయిలీ లిపిని కనిపెట్టిన లూయిస్ బ్రెయిలీ బర్త్‌డే సందర్భంగా ఐక్యరాజ్యసమితి ఈ రోజును అధికారికంగా ప్రకటించింది.

లూయిస్ బ్రెయిలీ (Braille)1809లో ఫ్రాన్స్‌లో జన్మించారు. ఆయన తన మూడేళ్ల వయసులో ఒక ప్రమాదంలో రెండు కళ్ల చూపును కోల్పోయారు. అయినా సరే ఆయనలో ఉన్న పట్టుదల ఆయనను చదువులో ముందుండేలా చేసింది. అప్పట్లో అంధులు చదువుకోవడానికి సరైన పద్ధతులు లేవు. కేవలం శబ్దాల ద్వారానే నేర్చుకునేవారు. కానీ లూయిస్ మాత్రం తానే స్వయంగా ఒక కొత్త మార్గాన్ని అన్వేషించాలని నిశ్చయించుకున్నారు.

కేవలం 15 ఏళ్ల వయసులోనే లూయిస్ బ్రెయిలీ ..ఈ అద్భుతమైన లిపిని రూపొందించడం విశేషం. సైనికులు రాత్రి వేళల్లో శత్రువులకు దొరక్కుండా సమాచారాన్ని చదువుకోవడానికి వాడే ‘నైట్ రైటింగ్’ అనే పద్ధతినే ఆయన స్ఫూర్తిగా తీసుకుని, బ్రెయిలీ లిపిని తయారు చేశారు. ఈ లిపిలో కేవలం ఆరు చుక్కల కలయికతో అక్షరాలు, అంకెలు, సంగీత సంకేతాలను కూడా గుర్తించొచ్చు.

కాగితంపై ఉబ్బెత్తుగా ఉండే ఈ చుక్కలను వేళ్లతో తాకడం ద్వారా అంధులు వేగంగా చదువుతారు. లూయిస్ కనిపెట్టిన ఈ ఆరు చుక్కల విధానం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది అంధుల జీవితాల్లో విజ్ఞానపు వెలుగులను నింపింది. అందుకే ఆయనను అంధుల పాలిట దైవంగా భావిస్తుంటారు.

నేటి ఆధునిక కాలంలో బ్రెయిలీ (Braille)లిపి కేవలం బుక్స్‌కే పరిమితం కాలేదు. కంప్యూటర్ కీబోర్డులు, ఏటీఎం మిషన్లు, లిఫ్టులు, మందుల డబ్బాలపై కూడా బ్రెయిలీ సంకేతాలను వాడుతున్నారు. దీనివల్ల దృష్టి లోపం ఉన్న వారు ఇతరుల హెల్ప్ లేకుండా తమ పనులను తామే స్వయంగా చేసుకోగలుగుతున్నారు. స్మార్ట్ ఫోన్లలో కూడా ఇప్పుడు బ్రెయిలీ కీబోర్డులు అందుబాటులోకి వచ్చేసాయి. ఇప్పటికే చూపు లేకపోయినా మేధస్సులో తాము ఎవరికీ తక్కువ కాదని నిరూపిస్తున్న ఎందరో అంధులకు..ఇప్పుడు ఈ లిపి మరో ఆయుధంలా పనిచేస్తోంది. ప్రతి ఏటా ఈ దినోత్సవం సందర్భంగా అంధుల హక్కుల గురించి, వారి సంక్షేమం గురించి అవగాహన కల్పిస్తారు.

Braille

చీకటిని తిట్టుకుంటూ అక్కడే కూర్చోకుండా, ఆ చీకటిలోనే వెలుగును వెతుక్కున్న లూయిస్ బ్రెయిలీ(Braille) జీవితం..ఎందరికో స్ఫూర్తి. ఆయన చేసిన ఈ అద్భుత ఆవిష్కరణ వల్ల ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది అంధులు విద్యావంతులై గౌరవప్రదమైన హోదాల్లో స్థిరపడుతున్నారు. అంధుల కోసం ఆయన చేసిన త్యాగం, కృషి ఎప్పటికీ మరువలేనివి.

మరిన్ని ఇంటర్నేషనల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version