Donald Trump
అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)సంచలన నిర్ణయాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఎప్పటికప్పుడు పొరుగు దేశాలకు షాక్ మీద షాక్ ఇస్తున్నారు. ముఖ్యంగా అమెరికాకు వలసలను నియంత్రించాలన్న ఏకైక లక్ష్యంతో కనిపిస్తున్నారు. దీనిలో భాగంగానే కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు వెనుకాడడం లేదు. ఇప్పటికే పలు దేశాలపై ట్రావెల్ బ్యాన్ చేయగా.. ఇప్పుడు మరో 20 దేశాలకు షాకిచ్చారు.
జాతీయ భద్రత విషయంలో ఏమాత్రం తగ్గేది లేదని స్పష్టం చేస్తూ మరో 20 దేశాలపై ట్రావెల్ బ్యాన్ తీసుకొచ్చారు. అలాగే పాలస్తీనియన్ అథారిటీపైనా ప్రయాణ ఆంక్షల విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది ప్రారంభంలో విధించిన ఆంక్షలకు ఇవి అదనం. దీంతో అమెరికా ట్రావెల్ బ్యాన్ ను ఎదుర్కొంటున్న దేశాల సంఖ్య ఇప్పుడు రెట్టింపయింది. ట్రంప్ (Donald Trump)తీసుకున్న తాజా నిర్ణయం జనవరి 1 నుంచి అమలులోకి వస్తుంది.
తాజా నిర్ణయంతో ఐదు దేశాల పౌరులపై అమెరికా పూర్తిగా నిషేధాన్ని విధించింది. దీనిలో దక్షిణ సూడాన్, సిరియా, మాలి, నైజర్ , బుర్కినా ఫాసో ఉన్నాయి. అలాగే పాలస్తీనియన్ అథారిటీ జారీ చేసిన ప్రయాణ పత్రాలు ఉన్నవారు కూడా అమెరికాకు వచ్చేందుకు వీలు లేదు. గతంలో పాక్షిక ఆంక్షలు ఉన్న లావోస్, సియెర్రా లియోన్ దేశాలకు ట్రంప్ ఇప్పుడు బిగ్ షాక్ ఇచ్చారు.
వాటిని కూడా పూర్తి నిషేధిత జాబితాలోకి మార్చేశారు. ఇదిలా ఉంటే మరో 15 దేశాలపై పాక్షిక ఆంక్షలు కూడా విధించారు. పాక్షిక ఆంక్షలు విధించిన దేశాల్లో జాంబియా, జింబాబ్వే నైజీరియా, సెనెగల్, టాంజానియా, అంగోలా, వంటి ఆఫ్రికా దేశాలతో పాటు కరేబియన్ దీవిల్లోని ఆంటిగ్వా అండ్ బార్బుడా, డొమినికా కూడా ఉన్నాయి. భద్రతా పరమైన లోపాలే అమెరికా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధానం కారణం.
ట్రావెల్ బ్యాన్ చేసిన ఆయా దేశాల్లో అవినీతి భారీగా ఉండడం, నకిలీ పౌర పత్రాలను సరిగ్గా పరిశీలించే వీలు లేకపోవడం, నేర చరిత్రను సైతం తనిఖీ చేయకుండా వీసాలు పత్రాలు జారీ చేయడం, గడువు ముగిసినా స్వదేశాలు వెళ్లకుండా అమెరికాలోనే ఉండేందుకు మొగ్గచూపడం వంటి కారణాలుగా చెబుతున్నారు. గత నెలలో వాషింగ్టన్ డీసీలో కాల్పుల ఘటన తర్వాత వలస విధానాలపై ట్రంప్ కఠినంగా వ్యవహరిస్తున్నారు.
అయితే ట్రంప్ (Donald Trump)నిర్ణయంపై మానవ హక్కుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. భద్రతా కారణాల పేరుతో సంబంధం లేని మరికొన్ని దేశాలను కూడా ఈ జాబితాలోనే చేర్చడం సరికాదంటున్నాయి. కానీ ట్రంప్ మాత్రం ఈ విషయంలో వెనకడుగు వేసే పరిస్థితే లేదని తేల్చి చెబుతున్నారు.
