Lonely
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ వందల కొద్దీ ఫోన్ కాంటాక్ట్స్, వేల కొద్దీ సోషల్ మీడియా ఫ్రెండ్స్ ఉన్నారు. కానీ నిజంగా మనసు విప్పి మాట్లాడే వాళ్ళు ఎవరంటే ఒక్కరి పేరు కూడా చెప్పలేని పరిస్థితి.
చుట్టూ కుటుంబం, స్నేహితులు ఉన్నా లోపల మాత్రం ఏదో వెలితి, ఏదో ఒంటరితనం(Lonely). ఎందుకంటే మనం చెప్పే మాటలు వినే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ, మన మనసును అర్థం చేసుకునే వాళ్లు తక్కువ.
ఎవరైనా మన బాధ చెప్తున్నప్పుడు ఎదుటివాళ్ళు వెంటనే సలహాలు ఇవ్వడానికో లేక “ఇది ఒక సమస్యేనా” అని తక్కువ చేయడానికో ప్రయత్నిస్తారు. కానీ మనకు కావాల్సింది సలహా కాదు, ఒక చిన్న ఓదార్పు లేదా మనం చెప్పేది కనీసం వినే ఓపిక. ఆ కనెక్షన్ దొరకనప్పుడు మనం జనం మధ్య ఉన్నా ఒక దీవిలో ఒంటరిగా ఉన్నట్టే అనిపిస్తుంది.
ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా కూడా ఈ ఒంటరితనాన్ని విపరీతంగా పెంచుతోంది. అందరూ తమ జీవితంలోని మంచి క్షణాలను మాత్రమే అక్కడ పోస్ట్ చేస్తారు. అవి చూసినప్పుడు “అందరూ హ్యాపీగా ఉన్నారు, నేను ఒక్కడినే ఇలా ఉన్నాను” అనే ఫీలింగ్ మనల్ని కుంగదీస్తుంది.
పైకి నవ్వుతున్నా లోపల మాత్రం ఒక రకమైన ఖాళీ (Lonely)ఉంటుంది. మనం మన బలహీనతలను బయటకి చెప్పడానికి భయపడతాం. ఒకవేళ చెప్తే పక్కవాళ్ళు మనల్ని తక్కువగా చూస్తారేమో అని మనసులోనే దాచుకుంటాం. ఇలా మన ఫీలింగ్స్ ను దాచుకోవడం వల్ల ఆ భారం పెరిగిపోయి ఒంటరితనంలా మారుతుంది.
ఒంటరితనం(Lonely) అంటే ఒంటరిగా ఉండటం కాదు, మనల్ని అర్థం చేసుకునే వారు లేకపోవడం. దీనికి పరిష్కారం ఏంటంటే ముందు మనల్ని మనం అర్థం చేసుకోవాలి. మనతో మనం సమయం గడపాలి. ఎవరితోనైనా లోతుగా మాట్లాడటం నేర్చుకోవాలి. పైపైన నవ్వుల కంటే మనసు విప్పే మాటలే మనల్ని ఈ ఒంటరితనం నుంచి కాపాడతాయి
