Mind
మనిషి మనసు(mind) ఒక అద్భుతమైన ప్రపంచం. కానీ ఒక్కోసారి అందులోకి కొన్ని పదేపదే వచ్చే ఆలోచనలు ప్రవేశించి, మన శాంతిని హరిస్తాయి. ఎంత వద్దనుకున్నా, ఏదో ఒక విషయం మన మెదడులో పదేపదే తిరుగుతూ మనల్ని నిద్ర లేకుండా చేస్తుంది. ఇలాంటి సమస్యతోనే చాలామంది పోరాడుతున్నారు.
దీనిని ఉదాహరణలతో చూసుకుంటే..అనుజాకు జీవితంలో అన్నీ సవ్యంగానే ఉన్నాయి. మంచి చదువు, ఉద్యోగం, స్నేహితులు. కానీ మనసులో ఒక ఆలోచన ఆమెను వదలడం లేదు. ఎంత ప్రయత్నించినా, ఈ ఆలోచనను ఆపాలని అనుకుంటే, అది మరింత బలంగా ఆమెను చుట్టుముట్టేది. మొదట చిన్న అసౌకర్యంగా మొదలైన ఈ విషయం, తర్వాత మానసిక భారంగా మారింది.
మరో ఉదాహరణలో రఘు పరిస్థితి కూడా ఇంచుమించు అదే. ఆఫీసులో బాస్‌తో జరిగిన ఒక చిన్న వాదన అతని మనసు(mind)లో పదేపదే తిరుగుతోంది. ఎంత ప్రయత్నించినా ఆ మాటలు అతని మెదడును వదలడం లేదు. ఈ సమస్యకు పరిష్కారం కోసం అనుజా, రఘు ఇద్దరూ తమ తమ ప్రయత్నాలు మొదలుపెట్టారు.
సైకాలజీలో దీన్ని రీబౌండ్ ఎఫెక్ట్ (Rebound Effect) అంటారు. మనం ఒక ఆలోచనను బలవంతంగా ఆపాలనుకున్నప్పుడు, మన మెదడు దాన్ని మరింత శక్తివంతంగా గుర్తు చేస్తుంది. ఒక తెల్లని ఎలుగుబంటి గురించి ఆలోచించకూడదు అని మీరు అనుకుంటే, మీ మనసులోకి మొదటగా అదే ఎలుగుబంటి వస్తుంది. ఇది మన మనసు ఆడే ఒక విచిత్రమైన ఆట.
ఈ విషయాన్ని తెలుసుకున్న అనుజా , రఘు తమ పద్ధతిని మార్చుకున్నారు. ఆ ఆలోచనలు వచ్చినప్పుడు వాటితో పోరాడటం మానేశారు. బదులుగా, సరే, ఈ ఆలోచన వచ్చింది అని వాటిని అంగీకరించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత వెంటనే తమ దృష్టిని వేరే పనులపైకి మళ్లించారు. అనుజా పుస్తకాలు చదవడం, పాటలు వినడం వంటివి చేస్తే, రఘు వాకింగ్‌కు వెళ్లి మిత్రులతో మాట్లాడటం మొదలుపెట్టాడు.కొన్ని వారాల్లోనే వారి మనసులు ప్రశాంతంగా మారాయి. ఆలోచనలు ఇంకా వస్తున్నా, వాటి ఉచ్చులో చిక్కుకోకుండా ముందుకు సాగగలిగారు.
మనసు(mind)లో అవాంఛిత ఆలోచనలు రావడం సహజం. వాటిని బలవంతంగా అడ్డుకోవాలని ప్రయత్నిస్తే అవి మరింత పెరుగుతాయి. వాటిని కేవలం గమనించి, అంగీకరించి, మన దృష్టిని జీవితంలో నిర్మాణాత్మకమైన పనులవైపు మళ్లిస్తేనే మనం నిజంగా మన ఆలోచనల బానిసత్వం నుంచి బయటపడగలం. ఈ మార్గం ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది.