Gas Cylinder
ప్రస్తుతం నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా ప్రతి నెల గ్యాస్ సిలిండర్ ధర పెరగడం సామాన్యుడి బడ్జెట్‌ను తలకిందులు చేస్తోంది. వంటింట్లో చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల గ్యాస్ అనవసరంగా వృధా అవుతూ ఉంటుంది. చాలా మంది సిలిండర్(Gas Cylinder) త్వరగా అయిపోతోందని బాధపడుతుంటారు కానీ, మన అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకుంటే నెలకు వాడే గ్యాస్ ను అదనంగా మరో వారం నుంచి పది రోజుల పాటు సులభంగా పొడిగించొచ్చు. డబ్బు ఆదా చేయడమే కాకుండా దేశ ఇంధన వనరులను కాపాడటంలో కూడా మనం భాగస్వామ్యం అవ్వచ్చు. అందుకు మీరు పాటించాల్సిన ఆ అద్భుతమైన చిట్కాలు ఇవే.
పాత్రలపై మూత ఉంచడం మరియు సరైన వంట పాత్రల ఎంపిక..వంట చేసేటప్పుడు చాలా మంది చేసే అతిపెద్ద పొరపాటు పాత్రలపై మూత పెట్టకపోవడం. మీరు వంట చేసేటప్పుడు పాత్రపై మూత ఉంచితే, లోపలనుంచి వచ్చే ఆవిరి బయటకు పోకుండా ఆహారంపై ఒత్తిడి తెస్తుంది.
దీనివల్ల వంట చాలా త్వరగా ఉడుకుతుంది. మూత పెట్టకుండా వంట చేస్తే వేడి గాలి బయటకు పోయి, ఆహారం ఉడకడానికి ఎక్కువ సమయం పడుతుంది, దీని ద్వారా ఎక్కువ గ్యాస్(Gas Cylinder) ఖర్చవుతుంది. అలాగే వంట పాత్ర అడుగు భాగం వెడల్పుగా ఉండేలా చూసుకోవాలి. మంట పాత్ర అంచులను దాటి బయటకు వస్తే ఆ వేడి వృధా అవుతున్నట్లే. కాబట్టి పాత్ర పరిమాణానికి తగ్గట్లుగా మంటను అడ్జస్ట్ చేసుకోవడం చాలా ముఖ్యం.
ఫ్రిజ్ పదార్థాలను నేరుగా పొయ్యి మీద పెట్టవద్దు..నేటి కాలంలో కూరగాయలు, పాలు, పిండి వంటివి ఫ్రిజ్ లో ఉంచడం సహజం. అయితే చాలా మంది ఫ్రిజ్ లో నుండి తీసిన చల్లని పదార్థాలను వెంటనే పొయ్యి మీద పెట్టి వేడి చేస్తుంటారు. ఇది గ్యాస్ వృధా అవ్వడానికి ప్రధాన కారణం. పదార్థాలు గడ్డకట్టినట్లు లేదా చాలా చల్లగా ఉన్నప్పుడు, అవి సాధారణ ఉష్ణోగ్రతకు (Room Temperature) రావడానికి ఎక్కువ మంట అవసరమవుతుంది. అందుకే వంట చేయడానికి కనీసం అర గంట ముందే ఫ్రిజ్ లోని పదార్థాలను బయట ఉంచాలి. అవి సాధారణ స్థితికి వచ్చిన తర్వాతే వంట మొదలుపెడితే గ్యాస్ వినియోగం గణనీయంగా తగ్గుతుంది.
బర్నర్ల శుభ్రత చ మంట రంగుపై నిఘా..మీ గ్యాస్ స్టవ్ బర్నర్లు ఎంత శుభ్రంగా ఉంటే గ్యాస్ అంత పొదుపు అవుతుంది. బర్నర్ రంధ్రాలలో ఆహార పదార్థాలు లేదా నూనె జిడ్డు పేరుకుపోతే మంట సరిగ్గా రాదు. మీ స్టవ్ వెలిగించినప్పుడు మంట ‘నీలి రంగు’లో వస్తే అది గ్యాస్ పూర్తిగా మండుతోందని అర్థం. ఒకవేళ మంట ‘పసుపు లేదా ఎరుపు’ రంగులో వస్తుంటే బర్నర్లలో అడ్డంకులు ఉన్నాయని, గ్యాస్ వృధా అవుతోందని గుర్తించాలి. వారానికి ఒక్కసారైనా బర్నర్లను తీసి శుభ్రం చేయడం వల్ల గ్యాస్ వృధాను అరికట్టవచ్చు. అలాగే గ్యాస్ పైపులు, రెగ్యులేటర్ దగ్గర లీకేజీలు లేకుండా చూసుకోవడం భద్రతతో పాటు పొదుపుకు కూడా మంచిది.
ప్రెషర్ కుక్కర్ వాడకం , నానబెట్టడం..వంటగదిలో గ్యాస్ (Gas Cylinder)ఆదా చేయడానికి ప్రెషర్ కుక్కర్ ఒక గొప్ప వరం. సాధారణ పాత్రల్లో వండే కంటే కుక్కర్ లో వండటం వల్ల 50 శాతం వరకు గ్యాస్ ఆదా అవుతుంది. పప్పులు, మాంసం వంటివి వండేటప్పుడు కచ్చితంగా కుక్కర్ వాడాలి. అలాగే పప్పు ధాన్యాలు, బియ్యం వంటివి వండటానికి ఒక గంట ముందే నీటిలో నానబెడితే అవి చాలా మెత్తగా అవుతాయి. ఇలా చేయడం వల్ల అవి త్వరగా ఉడుకుతాయి మరియు గ్యాస్ ఆదా అవుతుంది. వంట చేసేటప్పుడు కావాల్సినవన్నీ దగ్గర పెట్టుకుని స్టవ్ వెలిగించాలి. స్టవ్ వెలిగించిన తర్వాత కూరగాయలు కోయడం వంటివి చేస్తే గ్యాస్ అనవసరంగా వృధా అవుతుంది.
ఈ చిన్న చిన్న చిట్కాలు వినడానికి సాధారణంగా అనిపించినా, వీటిని క్రమం తప్పకుండా పాటిస్తే నెలకు కనీసం 100 నుండి 150 రూపాయల వరకు ఆదా చేయవచ్చు. ఏడాదికి లెక్క వేస్తే ఇది పెద్ద మొత్తమే అవుతుంది. గృహిణులు ఈ విషయాలపై కొంచెం శ్రద్ధ పెడితే ఇంటి బడ్జెట్‌ను చక్కదిద్దవచ్చు. పొదుపు అనేది ఒక అలవాటుగా మారితే అది మీ కుటుంబ ఆర్థిక పరిస్థితికి ఎంతో మేలు చేస్తుంది. ఈ రోజు నుండే ఈ మార్పులు మొదలుపెట్టి మీ సిలిండర్ లైఫ్ ను పెంచుకోండి.
