Dharmasthala
కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మస్థల(Dharmasthala).. ఇప్పుడు వివాదాస్పద ఆరోపణలతో సంచలనంగా మారింది. ఆలయంలో పనిచేసిన ఓ మాజీ పారిశుద్ధ్య కార్మికుడు చేసిన ఆరోపణలు రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్నాయి.
హత్య, అత్యాచారం, హింసకు గురైన వందలాది మృతదేహాలను తాను సామూహికంగా ఖననం చేశానని, ఈ పనిని ఆలయానికి సంబంధించిన వ్యక్తులు బలవంతంగా చేయించారని ఆయన ఆరోపించారు. ఈ కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) రంగంలోకి దిగింది. అయితే, దాదాపు నెల రోజుల పాటు జరిపిన తవ్వకాలు, విచారణలో ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లభించకపోవడం ఈ కేసును మరింత జటిలం చేస్తోంది.
మాజీ పారిశుద్ధ్య కార్మికుడు చెప్పిన 13 ప్రదేశాల్లో తవ్వకాలు జరిపినా ఎస్‌ఐటీకి ఎలాంటి ఆధారాలు దొరకలేదని వార్తలు వస్తున్నాయి. ఆయన కోర్టుకు సమర్పించిన మానవ అస్థిపంజరం కూడా ఒక పురుషుడిది అని పోలీసులు అంటున్నారు. కానీ, ఆయన మాత్రం అత్యాచారానికి గురైన మహిళ మృతదేహమని ఆరోపించారు. దర్యాప్తు జరుగుతున్న చోట, ఆ ప్రాంతంలో మట్టి కదలడం వల్ల ఆనవాళ్లు దొరకడం లేదని సదరు వ్యక్తి చెబుతున్నారు.
తాను దాదాపు వందల మృతదేహాలను పూడ్చిపెట్టానని, వాటిలో ఎక్కువ శాతం మహిళల మృతదేహాలని ఆయన వాదించారు. అయితే, పోలీసులు మాత్రం ఆయన నిర్దేశించిన ఐదు కీలక కేసుల్లో మూడు ప్రదేశాలను పరిశీలించినా, ఎలాంటి ఆధారాలు దొరకలేదని చెబుతున్నారు. మిగిలిన రెండు చోట్ల తవ్వకాలు పూర్తయ్యాక దర్యాప్తు ముగిసే అవకాశం ఉంది. ఈ కేసు దర్యాప్తులో పురోగతి లేకపోవడంతో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్రమైన వాగ్వాదం జరుగుతోంది.
ధర్మస్థల(Dharmasthala) ఆలయం కర్ణాటకలో అత్యంత శక్తివంతమైన, ఆర్థికంగా, రాజకీయంగా ప్రభావం కలిగిన సంస్థ. ఈ ఆలయానికి అధిపతి (ధర్మాధికారి) రాజ్యసభ ఎంపీ వీరేంద్ర హెగ్డే. దీంతో ప్రతిపక్ష బీజేపీ ఈ ఆరోపణలను సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ‘స్మెర్ క్యాంపెయిన్’ (పరువు తీసే కుట్ర)గా అభివర్ణించింది.
మరోవైపు, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్ ధర్మస్థల(Dharmasthala) భక్తుడు. ఆయన ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఈ కుట్ర వెనుక కాంగ్రెస్ ఉందని ఆరోపించిన ప్రతిపక్షానికి అసెంబ్లీలో ఆయన గట్టిగా బదులిచ్చారు. “ధర్మస్థల, దాని నిర్వాహక మండలిపై నాకు నమ్మకం ఉంది. మా పార్టీ ఈ వివాదంలో ఎందుకు కలుగజేసుకుంటుంది? అంతర్గత విభేదాల వల్ల ఎవరో నేరాల ఆరోపణలు చేస్తున్నారు. హోం మంత్రి గానీ, ప్రభుత్వం గానీ ఈ ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయలేవు” అని అన్నారు.
బీజేపీ మాత్రం ఈ ఆరోపణలను ఒక కుట్రగా పేర్కొంది. రాబోయే రోజుల్లో వందలాది కార్ల కాన్వాయ్‌తో ధర్మస్థల వెళ్లి ఆ పుణ్యక్షేత్రానికి మద్దతుగా ప్రదర్శనలు నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది. ఈ కేసును NIAకు అప్పగించాలని ప్రతిపక్ష నేత అశోక డిమాండ్ చేశారు.
సామూహిక ఖననాల ఆరోపణలకు సంబంధించి, గతంలో ధర్మస్థలలో జరిగిన కొన్ని మిస్సింగ్ కేసుల అంశాలు కూడా మళ్లీ తెరపైకి వచ్చాయి. 2003లో ధర్మస్థలంలో అదృశ్యమైన తన కుమార్తె అనన్య కేసును దర్యాప్తు చేయాలని సుజాతా భట్ అనే 60 ఏళ్ల మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఆ సమయంలో అనన్య మణిపాల్‌లో చదువుకున్నట్లుగానీ, సుజాతా భట్ సీబీఐలో పని చేసినట్లుగానీ ఎలాంటి ఆధారాలు లేవని పోలీసులు చెబుతున్నారు.
అలాగే, 1986లో హత్యకు గురైన 17 ఏళ్ల పద్మలత కుటుంబం కూడా ఈ కేసులో విచారణ కోరుతూ ఎస్‌ఐటీని ఆశ్రయించింది. పద్మలత మృతదేహాన్ని వెలికి తీస్తే, ఆమెపై అత్యాచారం జరిగిందన్న ఆధారాలు బయటపడతాయని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మొత్తం మీద, సామాజిక ఆరోపణలు, మతపరమైన భావోద్వేగాలు, రాజకీయ క్రీడల మధ్య ధర్మస్థల కేసు మరింత సంక్లిష్టంగా మారుతోంది. ఈ కేసులో నిజం బయటపడాలంటే, మరింత పకడ్బందీగా దర్యాప్తు జరగాలని నిపుణులు సూచిస్తున్నారు.