Delhi Pollution
దేశ రాజధాని ఢిల్లీలో గాలి(Delhi Pollution) నాణ్యత రోజురోజుకి పడిపోతోంది.దీంతో ఈ గాలిని పీల్చలేమని హస్తిన వాసులు రోడ్డెక్కుతున్నారంటే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎటు చూసినా పొగ మంచు (Smog) ఉంటుండటంతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎదురొచ్చే వాహనాలు కూడా కనిపించక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదకరమైన కాలుష్యంపై ఇప్పుడు పార్లమెంటులోనూ చర్చ జరుగుతోంది.
ఢిల్లీలో వాయు కాలుష్యం(Delhi Pollution) ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది. ఈ అంశం పార్లమెంటును సైతం కుదిపేస్తోంది. దీనిపై చర్చ జరపాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కోరారు. ఇది కేవలం రాజకీయ కోణం కాదని, లక్షలాది మంది చిన్నారులు ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్నారని, జనాల ఆరోగ్యం చూడాలని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాలుష్యం అంశంపై చర్చిద్దామని ప్రకటించింది. దీంతో ఢిల్లీ కాలుష్యంపై మళ్లీ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
చలికాలం వచ్చిందంటే చాలు దేశ రాజధాని వాసులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుంటారు. వాయువే ఆయువును తీసేంత ప్రమాదకరంగా మారుతోంది. ఈ కాలుష్యాన్ని నియంత్రించడానికి ఎప్పటికప్పుడు ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం లేకుండా పోతోంది. సరి-బేసి విధానంలో వాహనాలను నడపడం, నిర్మాణ పనులకు బ్రేకులు వేయడం, పంట వ్యర్థాలు కాల్చివేతను ఆపేయడాలు.. ఇలా ఎన్ని చర్యలు తీసుకున్నా కాలుష్యం మాత్రం ఆగడం లేదు. దీంతో ఈ గాలి పీల్చలేము అంటూ జనాలు గగ్గోలు పెడుతున్నారు.
అసలే చలి, దానికి తోడు వాయు కాలుష్యం. దీంతో విజిబిలుటీ (దృశ్యమానత) బాగా తగ్గిపోతోంది. దీనివల్ల రోడ్డు ప్రమాదాలు భారీగా పెరుగుతున్నాయి. ఇక, ఢిల్లీ (Delhi Pollution)ఎన్సీఆర్ ప్రాంతంలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలో నమోదైంది. తీవ్ర వాయు కాలుష్యంతో ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో GRAP (గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్) స్టేజ్-3 ఆంక్షలు అమలు చేస్తున్నారు.
అనవసరమైన నిర్మాణాలు, కూల్చివేత పనులు, రాత్రి వేళ క్రషింగ్, మైనింగ్ కార్యకలాపాలపై నిషేధం విధించారు. డీజిల్ తో నడిచే పాత వాహనాలకు ఢిల్లీలో ప్రవేశం లేదు. మరోవైపు విద్యా సంస్థలకు కూడా ప్రభుత్వం కీలక విజ్ఞప్తి చేసింది. హైబ్రిడ్ పద్ధతిని ఫాలో కావాలని, 5వ తరగతి వరకు పిల్లలకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహించాలని సూచించింది. ఢిల్లీ ఎన్సీఆర్ లోని ఆఫీసులు 50శాతం సిబ్బందితో మాత్రమే పని చేయాలని కోరింది. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలోని 18 మానిటరింగ్ స్టేషన్లలో AQI (ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్) లెవెల్స్ 400కు పైగా రికార్డ్ అయ్యాయి.
వాయు కాలుష్యంతో ఊపిరితిత్తుల క్యాన్సర్ లాంటి రోగాల బారిన పడే ఛాన్స్ ఉంటుంది. దీంతో పొల్యూషన్ కు చెక్ పెట్టకపోతే భవిష్యత్ తరాలు ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. రకరకాల కారణాలతో కాలుష్య నియంత్రణ చట్టాల అమలులో జాప్యం జరుగుతోంది. AQI ఇండెక్స్ భారీగా ఉన్నప్పుడు ప్రజలు ఇంటికే పరిమితం అవడం సురక్షితం.
AQI స్థాయి 0-50 మధ్య ఉంటే ఆ గాలి మంచిది. 50-100 మధ్య ఉంటే సంతృప్తికరం అని, 101-200 మధ్య ఉంటే మధ్యస్థం, 201-300 మధ్య ఉంటే కొంత ప్రమాదం, 301-400 మధ్య ఉంటే మరీ ఎక్కువ ప్రమాదం, 401-500 మధ్య ఉంటే అంతకంటే ఎక్కువ ప్రమాదం అని లెక్కలు వేస్తారు. ఢిల్లీలో కొన్నిసార్లు గాలి నాణ్యత 500 కూడా దాటుతోంది.
