Hampi
భారతదేశంలో చరిత్రను ప్రేమించే ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన ప్రదేశం హంపి(Hampi). కర్ణాటక రాష్ట్రంలోని తుంగభద్ర నది తీరాన వెలసిన ఈ నగరం ఒకప్పుడు విజయనగర సామ్రాజ్యానికి రాజధానిగా వెలుగొందింది. హంపికి వెళ్లడం అంటే మనం కాల చక్రంలో వెనక్కి వెళ్లి ఆ వైభవాన్ని కళ్లారా చూడటమే.
ఇక్కడికి చేరుకోగానే మనకు మొదట కనిపించేది ఎటు చూసినా పరుచుకున్న ఎర్రటి గ్రానైట్ శిలలు , వాటి మధ్యలో అద్భుతంగా చెక్కిన దేవాలయాలు. హంపిని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. ఇక్కడ ప్రతి రాయి ఒక కథ చెబుతుంది, ప్రతి శిల్పం ఒక చరిత్రను వివరిస్తుంది.
హంపి(Hampi)లో ప్రధానంగా చూడాల్సింది విరూపాక్ష దేవాలయం. ఇది ఇప్పటికీ పూజలు జరుగుతున్న పురాతన ఆలయం. దీని గోపురం ఆకాశాన్ని తాకుతున్నట్లుగా చాలా ఎత్తుగా ఉంటుంది. ఈ ఆలయం పక్కనే ఉండే తుంగభద్ర నది ఒడ్డున సాయంత్రం వేళ కూర్చుంటే వచ్చే ఆ ప్రశాంతతే వేరు.
హంపి అనగానే అందరికీ గుర్తొచ్చేది రాతి రథం. మన దేశంలోని యాభై రూపాయల నోటు మీద కూడా ఈ రథం బొమ్మ ఉంటుంది. విజయనగర శిల్పుల నైపుణ్యానికి ఇది ఒక నిదర్శనం. విఠల ఆలయ ప్రాంగణంలో ఉన్న ఈ రథం పక్కనే సంగీత స్తంభాలు ఉంటాయి. ఆ స్తంభాలను నెమ్మదిగా తడితే సప్తస్వరాలు వినిపిస్తాయని చెబుతారు.
అలాగే హంపి(Hampi)లో లోటస్ మహల్, ఎలిఫెంట్ స్టేబుల్స్ (ఏనుగుల శాల), హజార రామ ఆలయం వంటివి తప్పకుండా చూడాలి. హంపికి మరో వైపున అనేగుంది అనే గ్రామం ఉంది, దీనిని హిప్పీ ఐలాండ్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ వాతావరణం చాలా సరదాగా ఉంటుంది.
విదేశీ పర్యాటకులు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తారు. హంపిలో సూర్యాస్తమయాన్ని చూడాలంటే మాతంగ పర్వతం ఎక్కాలి. అక్కడి నుంచి చూస్తే మొత్తం హంపి నగరం శిథిలాల మధ్య ఎంత అందంగా కనిపిస్తుందో మాటల్లో చెప్పలేం. హంపికి వెళ్లడానికి అక్టోబర్ నుంచి మార్చి వరకు సరైన సమయం. అంటే కొత్త ప్రదేశాలు చూడాలనుకున్నవారికి ఇది కరెక్ట్ టైమ్ అన్నమాట. అందుకే చరిత్ర, ఆధ్యాత్మికత , ప్రకృతి అందాల కలయిక అయిన ఈ హంపి నగరానికి ప్లాన్ చేసుకోండి .
