EC: ఎన్నాళ్లీ వైఫల్యాలు ? ఈ.. ఈసీకి ఏమైంది ?

EC: ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన నమ్మకాన్ని దెబ్బతీసే అంశమని అర్థమవుతోంది.

EC

బిహార్‌లో చోటుచేసుకున్న తాజా పరిణామాలు భారత ఎన్నికల వ్యవస్థపైనే తీవ్ర సందేహాలను రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా, ఓటర్ల జాబితాలో చనిపోయిన వారి పేర్లు ఉండటం, బతికి ఉన్న వారి పేర్లు గల్లంతవడం వంటి లోపాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఈ అంశాన్ని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రత్యేకంగా ప్రస్తావించి, ఎన్నికల సంఘం (EC) పనితీరుపై తీవ్ర విమర్శలు చేయడంతో ఈ చర్చ మరింత వేడెక్కింది.

జీవితంలో ఎన్నో ఆసక్తికరమైన అనుభవాలు ఎదురయ్యాయి, కానీ చనిపోయిన వారితో టీ తాగే అవకాశం మరెవరికీ రాలేదు, నాకు వచ్చింది. ఈ ప్రత్యేక అనుభవం కల్పించిన ఎన్నికల సంఘానికి ధన్యవాదాలు” అని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఈ సమస్య తీవ్రతను కళ్లకు కట్టినట్లు చెబుతున్నాయి.

బిహార్‌లోని పులిహెందులకు చెందిన ఏడుగురు ఓటర్లు తమ పేర్లు మృతుల జాబితాలో చేర్చడంతో తమ ఓటు హక్కును కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తూ రాహుల్ గాంధీని కలిశారు. వారు తమ ఫిర్యాదులను ఆధారాలతో సహా సమర్పించగా, ఈసీ నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) వంటి పెద్ద సర్వేల్లో కూడా ఈ తప్పులు జరగడం ఎన్నికల ప్రక్రియలో ఉన్న లోపాలను ఎత్తి చూపుతోంది.

రాహుల్ గాంధీ (Rahul Gandhi)సహా ఇతర ప్రతిపక్ష నేతలు ఈ తప్పులను సాధారణంగా చూడటం లేదు. ఇవి రాజకీయ హిడెన్ ఎజెండాలవల్ల జరుగుతున్న ఓట్ల చోరీగా, ప్రజల ఓటరు హక్కులపై జరుగుతున్న పెద్ద మోసంగా ఆరోపిస్తున్నారు. ఈ అంశాలపై ఈసీ నుంచి సరైన వివరణ రాకపోవడం ప్రజల్లోనూ, రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతున్నా కూడా.. ఈసీ మాత్రం ఈ విషయంలో మౌనం వహించడం మరింత అనుమానాలకు తావిస్తోంది.

ఈ లోపాలు బిహార్‌కే పరిమితం కాలేదు. బిహార్‌లోని సివాన్ జిల్లాలో మింతా దేవి వయస్సు 35 ఏళ్లు ఉన్నా, ఆమె పేరు 124 ఏళ్ల వయస్సుతో జాబితాలో నమోదు కావడం ,ఒకే వ్యక్తి పేరు నాలుగు వేర్వేరు ఓటర్ల జాబితాల్లో ఉండటం, వంటి ఉదాహరణలు బయటపడ్డాయి. ఈ లోపాలు డేటా ఎంట్రీలో తప్పులు అని అధికారులు చెబుతున్నా.. ఈ స్థాయిలో తప్పులు జరగడం చూస్తుంటే ఈసీ పనితీరుపై ప్రజలకున్న నమ్మకం తగ్గిపోతోంది.

EC

రాజస్థాన్, మహారాష్ట్ర, కర్ణాటక వంటి ఇతర రాష్ట్రాల్లోనూ వేలాది ఓటర్ల పేర్లు డబుల్ ఎంట్రీలు కావడం, పేర్లు తొలగించబడటం వంటి ఆరోపణలు ఉన్నాయి. ఆర్జేడీ నాయకుడు తేజశ్వి యాదవ్ అయితే, ఈసీ బీజేపీతో కుమ్మక్కైందని, ఓట్లు కొల్లగొట్టే ప్రయత్నంలో భాగమని నేరుగా ఆరోపించారు.

ఈ ఘటనలన్నింటినీ కలిపి చూస్తే, ఇది కేవలం ఒక చిన్న సమస్య కాదని, ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన నమ్మకాన్ని దెబ్బతీసే అంశమని అర్థమవుతోంది. ప్రజల ఓటు హక్కును పరిరక్షించాల్సిన ఈసీ పనితీరుపై రోజుకో కొత్త లోపం బయటపడుతోంది. ఇది ఎన్నికల పవిత్రతనే దెబ్బతీస్తోంది.

EC

ఈసీ ఈ సమస్యలను తేలికగా తీసుకోకుండా, వాటిపై తక్షణమే దృష్టి సారించి, సమగ్రమైన విచారణ జరిపి, పారదర్శకమైన పరిష్కారాలను చూపించాల్సిన అవసరం ఉంది. లేకపోతే ప్రజలకు ఎన్నికల వ్యవస్థపై ఉన్న నమ్మకం పూర్తిగా పోయే ప్రమాదం ఉంది.

 

Exit mobile version