Indigo Crisis
దేశీయ విమానయాన రంగంలో ప్రముఖ సంస్థ ఇండిగోలో నెలకొన్న సంక్షోభం(Indigo Crisis), భారీగా విమానాలు రద్దు కావడంతో టికెట్ ధరలు అమాంతం పెరిగాయి. ఈ పరిణామం సాధారణ ప్రయాణికులకు తీవ్ర భారాన్ని కలిగించింది. దీంతో ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ (Ministry of Civil Aviation) కీలక చర్యలు చేపట్టింది.
ఎకానమీ క్లాస్‌పై ధరల పరిమితులు..పెరిగిన ధరలను అదుపులోకి తీసుకురావడానికి మంత్రిత్వ శాఖ డిసెంబర్ 6న ఎకానమీ క్లాస్ టికెట్ల బేస్ ధరలపై పరిమితులు విధిస్తూ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఆదేశాలకు అనుగుణంగా ఎయిర్ ఇండియా గ్రూప్ తమ రిజర్వేషన్ సిస్టమ్స్‌లో కొత్త ధరల విధానాన్ని అమలు చేయడం ప్రారంభించింది.
ఎయిర్ ఇండియా గ్రూప్ అమల.. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఇప్పటికే ఈ మార్పులను పూర్తి చేయగా, ఎయిర్ ఇండియా డిసెంబర్ 8, సోమవారం నుంచి ఈ పరిమితులను అమలులోకి తీసుకొచ్చింది. ఈ పరిమితి ఎకానమీ క్లాస్ టికెట్లకు మాత్రమే వర్తిస్తుంది.
దశల వారీగా అమలు.. థర్డ్-పార్టీ రిజర్వేషన్ ప్లాట్‌ఫామ్‌లతో సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉడంటంతో, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ ప్రక్రియను దశలవారీగా అమలు చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది.
ధరలు పెరిగితే పూర్తి రిఫండ్ హామీ.. ప్రభుత్వ మార్గదర్శకాల అమలులో భాగంగా, ఎయిర్ ఇండియా ప్రయాణికులకు ఒక ముఖ్యమైన హామీ ఇచ్చింది. ఈ మార్పులు జరుగుతున్న సమయంలో ఎవరైనా ఎయిర్ ఇండియా ఎకానమీ క్లాస్ టికెట్లను నిర్ధారించిన బేస్ ధరల పరిమితి కంటే ఎక్కువకు బుకింగ్ చేసుకుంటే, ఆ అదనపు వ్యత్యాసం మొత్తాన్ని పూర్తి రిఫండ్ చేస్తామని స్పష్టం చేసింది.
కేంద్రం నిఘా.. ఇండిగో సంక్షోభం(Indigo Crisis) తర్వాత విమానయాన సంస్థల ధరల విధానంపై ప్రభుత్వం నిశితంగా నిఘా పెట్టింది. పరిస్థితి సాధారణ స్థితికి వచ్చే వరకు టికెట్ ధరలను అదుపులో ఉంచాలని అన్ని సంస్థలకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా పండుగ సీజన్ (క్రిస్‌మస్, న్యూ ఇయర్) సమీపిస్తుండటంతో ప్రయాణికులకు ఆర్థిక భారం పడకుండా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నియంత్రణ ద్వారా దేశీయ విమాన ప్రయాణాల ధరలు మళ్లీ స్థిరత్వానికి చేరుకుంటాయని భావిస్తున్నారు.
