Lawrence Bishnoi:మొన్న సల్మాన్- ఇప్పుడు రణవీర్ సింగ్,సల్మాన్ బావ.. అసలు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ టార్గెట్ ఏంటి?

Lawrence Bishnoi: 1998లో సల్మాన్ ఖాన్ కృష్ణ జింకను వేటాడారనే ఆరోపణలు వచ్చినప్పటి నుంచి, బిష్ణోయ్ కమ్యూనిటీ ఆయనపై ఆగ్రహంతో ఉంది.

Lawrence Bishnoi

ముంబై సినీ ఇండస్ట్రీ ఇప్పుడు ఒక తెలియని భయం నీడలో బతుకుతోంది. అండర్ వరల్డ్ డాన్ల బెదిరింపులు అందరికీ తెలిసినవే. కానీ ఏకంగా జైలు నుండే సామ్రాజ్యాన్ని నడుపుతున్న లారెన్స్ బిష్ణోయ్ ( Lawrence Bishnoi)పేరు వినిపిస్తేనే బాలీవుడ్ వణికిపోతోంది. స్టార్ హీరోలు అయితే గన్ మెన్ల రక్షణ లేకుండా బయటకు రావడం లేదు.

తాజాగా.. సల్మాన్ ఖాన్ సోదరి భర్త ఆయుష్ శర్మకు విపిఎన్ (VPN) టెక్నాలజీని వాడుతూ బెదిరింపు మెయిల్స్ పంపడం, అలాగే ఈ మధ్య రణవీర్ సింగ్‌కు వాట్సాప్ ద్వారా వార్నింగ్ ఇవ్వడం బాలీవుడ్‌లో కలకలం రేపుతోంది. పోలీసులు ఎంత గట్టిగా నిఘాను పెంచుతున్నా, ఈ గ్యాంగ్ మాత్రం తన నెట్‌వర్క్‌ను దేశ సరిహద్దులు దాటించి మరీ ఆపరేట్ చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు.

రాజస్థాన్‌కు చెందిన బిష్ణోయ్ తెగవాళ్లు వన్యప్రాణులను, ముఖ్యంగా కృష్ణ జింకలను దైవంగా భావిస్తుంటారు. 1998లో సల్మాన్ ఖాన్ కృష్ణ జింకను వేటాడారనే ఆరోపణలు వచ్చినప్పటి నుంచి, బిష్ణోయ్ కమ్యూనిటీ ఆయనపై ఆగ్రహంతో ఉంది. అప్పట్లో చిన్న పిల్లాడైన లారెన్స్, పెరిగి పెద్దయ్యాక కూడా సల్మాన్ ఖాన్‌పైన పగను అలాగే పెంచుకుంటూ వచ్చాడు. సల్మాన్ ఖాన్ తమ సమాజానికి క్షమాపణ చెప్పాలని..లేదంటే చంపేస్తామని ఓపెన్‌గానే వార్నింగ్ ఇచ్చాడు. ఇది కేవలం మాటలకే పరిమితం కాలేదని, పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో కూడా ఈ గ్యాంగ్ పేరు ప్రముఖంగా వినిపించడంతో తేలింది.

అయితే ఇప్పుడు రణవీర్ సింగ్ , ఆయుష్ శర్మలను లారెన్స్ బిష్ణోయ్ ఎందుకు టార్గెట్ చేస్తున్నారనేది ఇప్పుడు ఒక మిస్టరీగా మారింది. దీని వెనుక ప్రధానంగా పవర్ అండ్ పబ్లిసిటీ అనే సూత్రం కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. సల్మాన్ ఖాన్‌ను డైరక్టుగా టార్గెట్ చేస్తే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుందని, సల్లూ భాయ్ కుటుంబ సభ్యులను బెదిరించడం వల్ల ఆయనను మానసిక ఒత్తిడికి గురిచేయడానికే ఇలా బిష్ణోయ్ గ్యాంగ్ ప్లాన్ చేసినట్లు న్యూస్ వినిపిస్తోంది.

Lawrence Bishnoi

ఇక రణవీర్ సింగ్ వంటి బడా స్టార్లను బెదిరించడం వల్ల బాలీవుడ్ మొత్తం తమ చెప్పుచేతల్లో ఉండాలనే సందేశాన్ని వారు పంపిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇది కేవలం ఆకతాయిగానో, ఒట్టి బెదిరింపో అని కొట్టిపారేయలేం, ఎందుకంటే వీరి నెట్‌వర్క్ కెనడా, దుబాయ్ వంటి దేశాల వరకు కూడా విస్తరించి ఉంది.

లారెన్స్ బిష్ణోయ్ ( Lawrence Bishnoi) గ్యాంగ్ బెదిరింపులతో టోటల్ బాలీవుడ్ భయంతో వణుకుతుంది. ఒకప్పుడు ఇలాంటి గ్యాంగుల నుంచి బెదిరింపులు వస్తే కేవలం డబ్బు కోసమే ఉండేవి. కానీ ఇప్పుడు ఇవి పగ, ఆధిపత్యం కోసం జరుగుతున్నాయి. ఇప్పుడు వీళ్లు, తర్వాత టార్గెట్ ఎవరు అన్న భయంలో బాలీవుడ్ బతుకుతుంది. ఇవి బెదిరింపులతో ఎండ్ అవుతాయా ? లేక నిజంగానే ఏదైనా ఘోరం జరుగుతుందా అని బాలీవుడ్ సినీ ఇండస్ట్రీ వణికిపోతుంది.

మరిన్ని నేషనల్ న్యూస్అప్ డేట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version