Mrs India
అందాల పోటీ(Mrs India)లు అంటే కేవలం వేదికపై నడవడం, అందంతో మెప్పించడం మాత్రమే అని భావించే వారికి హైదరాబాద్‌కు చెందిన మితాలి అగర్వాల్ (కావ్య) ఒక నిలువెత్తు సమాధానంగా నిలిచారు. తాజాగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల మహిళలు పాల్గొన్న ప్రతిష్టాత్మక ‘మిసెస్ ఇండియా 2025(Mrs India)’ పోటీల్లో మితాలి అగర్వాల్ గ్లోబల్ అంబాసడర్‌గా ఎంపికై సంచలనం సృష్టించారు.
కేవలం కిరీటాన్ని గెలవడమే కాకుండా, ఆమెలోని సేవానిరతికి, సహృదయతకు గుర్తింపుగా ‘కాంజెనియాలిటీ’ (Congeniality) బిరుదు కూడా మితాలిని వరించింది. మధ్యప్రదేశ్‌లో పుట్టి పెరిగినా.. ప్రస్తుతం హైదరాబాద్‌ను తన నివాసంగా , సామాజిక సేవా కార్యకలాపాలకు కేంద్రంగా మార్చుకుని, భాగ్యనగరం గర్వించదగ్గ స్థాయికి ఎదిగారు.
మితాలి అగర్వాల్ ప్రయాణం ఒక సామాన్య మహిళా ప్రయాణం కాదు. ఇంజనీరింగ్ చదివి.. కమ్యూనికేషన్ రంగంపై ఉన్న ఆసక్తితో ఆ విభాగంలో అంచెలంచెలుగా ఎదిగారు. ప్రస్తుతం ఆమె ఒక సక్సెస్ ఫుల్ కమ్యూనికేషన్ లీడర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే వృత్తిపరమైన బాధ్యతలతో పాటు సామాజిక బాధ్యతను కూడా మోయాలనే లక్ష్యంతో ఆమె ‘EcoMiTz’ అనే ఒక ప్రయోజన కేంద్రిత (Purpose-driven) ప్లాట్‌ఫామ్‌ను స్థాపించారు.
ఈ ప్లాట్‌ఫామ్ ప్రధాన ఉద్దేశ్యం ‘వ్యక్తిగత సామాజిక బాధ్యత’ (Individual Social Responsibility – ISR). అంటే సమాజం కోసం ప్రభుత్వం, సంస్థలు మాత్రమే కాదు, ప్రతి వ్యక్తి తన వంతుగా ఒక చిన్న అడుగు వేయాలని, ఆ చిన్న మార్పే రేపు సమాజంలో పెద్ద విప్లవానికి దారితీస్తుందని మితాలి బలంగా నమ్ముతారు.
మితాలి చేపట్టిన కార్యక్రమాల్లో అత్యంత కీలకమైనది ‘రెడ్ రివల్యూషన్’ (Red Revolution). ప్యాడ్‌కేర్ (Padcare) అనే సంస్థతో కలిసి గుడ్‌విల్ మిత్రగా ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. సాధారణంగా మహిళలు పీరియడ్స్ సమయంలో ఉపయోగించే సానిటరీ ప్యాడ్‌లు పర్యావరణానికి పెద్ద భారం. ఆ వ్యర్థాలను (Menstrual Waste) శాస్త్రీయంగా రీసైకిల్ చేసి, మళ్లీ ఉపయోగించగలిగే వనరులుగా మార్చడం ఈ ఉద్యమ మెయిన్ టార్గెట్.
పీరియడ్స్ గురించి మాట్లాడటానికి నేటికీ సంకోచించే సమాజంలో.. పీరియడ్స్, వ్యర్థ నిర్వహణ, మహిళా గౌరవం (Dignity) అనే మూడు అంశాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి మితాలి ఒక సామాజిక మార్పుకు శ్రీకారం చుట్టారు.మితాలి చేసిన ఈ విశేషమైన సేవలకు గాను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో శ్రీ శక్తి 2025, e4m 40 Under 40 వంటి ఎన్నో అవార్డులు ఇప్పటికే ఆమెను వరించాయి.
తన కుటుంబమే తన బలమని మితాలి చెబుతారు. వారి ప్రోత్సాహం, విలువలే తనను ఇంత దూరం నడిపించాయని అంటారు. అలాగే PRCI (Public Relations Council of India) అందించిన సహకారం, మిసెస్ ఇండియా డైరెక్టర్ దీపాలి ఫడ్నిస్ , తెలంగాణ డైరెక్టర్ మమతా త్రివేదిల గైడెన్స్ తనను ఒక ‘చేంజ్‌మేకర్’గా తీర్చిదిద్దాయని ఆమె గుర్తు చేసుకున్నారు. “అందం అనేది కేవలం ముఖంలో ఉండదు, మనం చేసే పనిలో ఉండే ప్రయోజనంలో ఉంటుంది” (Beauty = Purpose) అనేది ఆమె ఇచ్చే సందేశం.
మిసెస్ ఇండియా(Mrs India_ వేదికను మితాలి కేవలం ఒక టైటిల్ గెలవడానికి మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ప్రతి వ్యక్తిలో సామాజిక బాధ్యతను పెంచడానికి ఒక ఛాన్స్‌గా భావిస్తున్నారు. భూగోళాన్ని ఒక స్వర్గంలా మార్చడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, మనం చేసే చిన్న చిన్న సామాజిక సేవలే భవిష్యత్తు తరాలకు గొప్ప గిఫ్ట్ అని ఆమె నిరూపిస్తున్నారు. మితాలి అగర్వాల్ ప్రయాణం నేటి తరం మహిళలకు, యువతకు ఒక గొప్ప స్ఫూర్తిదాయకం. కేవలం కెరీర్‌లో సక్సెస్ అవ్వడమే కాకుండా, సమాజానికి తిరిగి ఏమి ఇస్తున్నామనేది ఇంపార్టెంట్ అని తన జీవితం ద్వారా చాటి చెబుతున్నారు మితాలి.
