Munsiyari: హిమాలయాల ఒడిలో మున్సియారీ .. ఒక్కసారి వెళ్తే తిరిగి రావాలనిపించదు!

Munsiyari: సముద్ర మట్టానికి దాదాపు 2200 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ చిన్న గ్రామం, హిమాలయాలలోని మహా శిఖరాలకు ముఖద్వారం లాంటిది.

Munsiyari

భారతదేశంలో ప్రకృతి అందాలకు కొదవే లేదు. అందులో కొన్ని ప్రదేశాలు అయితే మాత్రం మనల్ని అమాంతం మరో ప్రపంచంలోకి తీసుకెళ్లిపోతాయి. అలాంటి వాటిలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పిత్తోరాఘర్ జిల్లాలో ఉన్న మున్సియారీ (Munsiyari)ఒకటి. దీనిని పర్యాటకులు ముద్దుగా ‘లిటిల్ కాశ్మీర్’ అని పిలుచుకుంటారు.

సముద్ర మట్టానికి దాదాపు 2200 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ చిన్న గ్రామం, హిమాలయాలలోని మహా శిఖరాలకు ముఖద్వారం లాంటిది. ఇక్కడి నుంచి చూస్తే పంచాచూలి శిఖరాలు ఐదు వేళ్లు ఆకాశాన్ని తాకాయా అన్నట్లుగా చాలా దగ్గరగా కనిపిస్తాయి.

ముఖ్యంగా సూర్యోదయ సమయంలో మంచుతో కప్పబడిన ఆ శిఖరాలు బంగారు వర్ణంలో మెరిసిపోతూ ఉంటే..ఆ దృశ్యాన్ని చూడటానికి రెండు కళ్లు చాలవు. ఉరుకులపరుగుల ప్రపంచానికి దూరంగా, స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటూ, మంచు కొండల మధ్య ప్రశాంతంగా గడపాలనుకునే వారికి మున్సియారీ(Munsiyari ఒక స్వర్గధామం.

Munsiyari

శీతాకాలంలో మున్సియారీ అందం వర్ణనాతీతం. ఊరంతా తెల్లటి ఒత్తయిన మంచు దుప్పటి కప్పుకున్నట్లు ఉంటుంది. ఇక్కడ నివసించే శౌకా తెగ ప్రజల ఆచారాలు, వారి చేతితో నేసిన పట్టు గొర్రె బొంతలు (Carpets) అక్కడకు వెళ్లిన పర్యాటకులను ఆకట్టుకుంటాయి. ట్రెక్కర్లకు కూడా ఇది గొప్ప అనుభవాన్ని ఇస్తుంది.

ఇక్కడి నుంచి ఖలియా టాప్ వరకు చేసే ట్రెకింగ్ ద్వారా హిమాలయాల సంపూర్ణ రూపాన్ని చూడొచ్చు. వన్యప్రాణులపై ఆసక్తి ఉన్నవారు ఇక్కడ కస్తూరి మృగాలను, రంగురంగుల హిమాలయ పక్షులను గమనించొచ్చు. మున్సియారీ కేవలం ఒక పర్యాటక ప్రాంతమే కాదు, మనసులోని ఒత్తిడిని దూరం చేసే ఒక మెడిటేషన్ సెంటర్ వంటిది. రోడ్లు కొంచెం ఇరుగ్గా ఉన్నా కూడ, ఆ ప్రయాణంలో కనిపించే జలపాతాలు, లోతైన లోయలు ఆ కష్టాన్ని మర్చిపోయేలా చేస్తాయి. 2026లో మీరు ఒక కొత్త ప్రదేశాన్ని చూడాలనుకుంటే, మున్సియారీని మీ లిస్టులో తప్పకుండా చేర్చుకోండి.

మరిన్ని నేషనల్ న్యూస్అప్ డేట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version