New Year
మనం న్యూ ఇయర్ (New Year)వస్తుందంటే చాలామంది కేకులు కట్ చేస్తారు.. బాణాసంచా కాలుస్తారు. కానీ ప్రపంచంలోని వివిధ దేశాల్లో న్యూ ఇయర్ జరుపుకునే పద్ధతులు చూస్తే చాలా ఆశ్చర్యంగా కనిపిస్తాయి. ఆరోజు ఒక్కో దేశానికి ఒక ప్రత్యేకమైన సంస్కృతి , నమ్మకం ఉంటుంది.
డెన్మార్క్ (Denmark) లో ప్రజలు తమ స్నేహితులు, బంధువుల ఇళ్ల ముందు పాత ప్లేట్లు, అద్దాలను పగలగొడతారు. ఎవరి ఇంటి ముందర ఎక్కువ పగిలిన సామాన్లు ఉంటే, వారికి ఆ ఏడాది అంతా ఎక్కువ మంది స్నేహితులు, అంత ఎక్కువ అదృష్టం వస్తుందని నమ్మకం. ఇది వినడానికి వింతగా ఉన్నా, వారు దీనిని ఎంతో ఇష్టంగా చేస్తారు.
ఇక స్పెయిన్ (Spain) విషయానికి వస్తే, అక్కడ అర్ధరాత్రి 12 గంటలకు గడియారం కొడుతుండగా మోగే ఒక్కో గంట సౌండ్ కు కానీ, ఒక్కో సెకనుకు కానీ ఒక ద్రాక్ష పండు చొప్పున మొత్తం 12 ద్రాక్ష పండ్లు తింటారు. ఇలా చేస్తే ఆ ఏడాదిలోని 12 నెలలు చాలా సంతోషంగా, ఆనందంగా గడుస్తాయని అక్కడ నమ్ముతారు.
దక్షిణ అమెరికా దేశమైన కొలంబియాలో మరో వింత ఆచారం ఉంది. కొత్త ఏడాదిలో తాము విదేశీ ప్రయాణాలు చేయాలని అనుకునే వారు, ఖాళీ సూట్‌కేస్‌ను పట్టుకుని తమ వీధిలో ఒక రౌండ్ పరుగెత్తుతారు. ఇలా చేస్తే వచ్చే ఏడాదంతా ప్రయాణాలతో బిజీగా ఉంటారని వారి నమ్మకం.
అలాగే బ్రెజిల్ దేశస్తులు న్యూ ఇయర్ రాత్రి తెల్లని దుస్తులు ధరించి సముద్రం వద్దకు వెళ్లి, ఏడు అలలను దూకుతారు. ప్రతి అలకు ఒక కోరిక కోరుకుంటారు.అలా చేస్తే వారు ఎలాంటి తీరని కోరికలు కోరుకున్నా అవి తప్పకుండా జరుగుతాయని అక్కడి వారు చెబుతారు.
జపాన్ లో న్యూ ఇయర్ రోజు బౌద్ధ దేవాలయాల్లో గంటను 108 సార్లు మోగిస్తారు. మానవునిలో ఉండే 108 రకాల కోరికలు, పాపాలను ఇది శుద్ధి చేస్తుందని వారి నమ్మకం.
ఫిలిప్పీన్స్ లో అయితే ఆరోజు ప్రతిదీ గుండ్రంగా ఉండే వస్తువులను వాడటం వంటివి చేస్తారు. గుండ్రని ఆకారం సంపదకు గుర్తు అని భావిస్తూ, గుండ్రని పండ్లు తినడం, చుక్కల చొక్కాలు (Polka dots) ధరించడం చేస్తారు.
ఇలా ప్రపంచవ్యాప్తంగా ఒక్కో చోట ఒక్కో రకమైన సంప్రదాయం ఉన్నా, అందరి కోరిక మాత్రం ఒక్కటే.. కొత్త ఏడాది సుఖ సంతోషాలతో గడవాలని కోరుకోవడం. మొత్తంగా ఈ వింతలు, విశేషాలే న్యూ ఇయర్ వేడుకలకు మరింత రంగును అద్దుతాయి.
