Indigo flight :ఇండిగో ఫ్లైట్ అంటేనే జర్నీ భయం..విమానాల రద్దు వెనుక సాంకేతిక సమస్యలా? అంతర్గత కారణాలా?

Indigo flight :ఢిల్లీ నుంచి బయలుదేరాల్సిన 220, హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయం నుంచే దాదాపు 90 విమానాలు రద్దు కావడంతో, దేశంలోని కీలకమైన విమానాశ్రయాలన్నీ మహా గందరగోళంలో కూరుకుపోయాయి

Indigo flight

మూడు రోజులుగా ఇండిగో సంస్థ(Indigo flight ) తన విమాన సర్వీసులను రద్దు చేస్తూ ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేయడం అనేది ఒక సాధారణ అంతరాయం కాదు.. ఇది సంస్థకు అతిపెద్ద సంక్షోభ సంకేతం. అవును..మూడు రోజుల్లో 500కి పైగా విమానాలు, నెలరోజులుగా వేలల్లో విమానాలు రద్దు అవ్వడం అంటే, అది సంస్థ నిర్వహణ సామర్థ్యంపైనే ప్రశ్నలు వేస్తోంది.

తాజాగా ఢిల్లీ నుంచి బయలుదేరాల్సిన 220, హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయం నుంచే దాదాపు 90 విమానాలు రద్దు కావడంతో, దేశంలోని కీలకమైన విమానాశ్రయాలన్నీ మహా గందరగోళంలో కూరుకుపోయాయి. ఒకరోజు పైలట్ల కొరత, మరోరోజు సాంకేతిక కారణాలు అని సాకులు చెబతున్నారంటే ఇండిగో సంస్థ(Indigo flight)కు రెండు వైపులా సమస్యలు చుట్టుముట్టాయా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

కాగా ఈ రద్దుల పరంపరతో హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో తమ విమానం ఎప్పుడు బయలుదేరుతుందో తెలియక, రద్దీగా ఉండే ఎయిర్‌పోర్టులో గంటలు కాదు, ఏకంగా రోజులు వేచిచూడాల్సిన దుస్థితి ఏర్పడింది. సాంకేతిక కారణాలు అనే ఒకే ఒక్క మాట చెప్పి ఇండిగో (Indigo flight)సిబ్బంది మొహం చాటేయడం, ప్రయాణికులకు కనీసం తాగడానికి నీళ్లు, తినడానికి ఆహారం కూడా అందించకపోవడం వారి ఆగ్రహాన్ని పతాక స్థాయికి చేర్చింది.

ముఖ్యంగా, ఇప్పుడు శబరిమల సీజన్ కావడంతో, విమాన ప్రయాణంపై ఆధారపడి దర్శనానికి ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న అయ్యప్ప స్వామి భక్తులు తమ అసహనాన్ని అదుపు చేసుకోలేకపోయారు. చివరి నిమిషంలో విమానం రద్దు అయితే, స్వామి దర్శన భాగ్యం కోల్పోతామనే భయంతో, మాకు న్యాయం చేయండి, లేదంటే మా దర్శనం బాధ్యత మీదే అంటూ బోర్డింగ్ గేట్‌కు అడ్డంగా బైఠాయించి తీవ్ర నిరసన తెలియజేశారు.

ఇదంతా కేవలం యాదృచ్ఛికంగా జరిగిన గొడవ కాదు. ఇండిగో విమానాల్లోని ఎయిర్‌బస్ ఏ-320 విమానాలకు సంబంధించిన సాంకేతిక సమస్యలు, వాటి నిర్వహణ లోపాలే ఈ సంక్షోభానికి ప్రధాన కారణం. విమానాల విషయంలో భద్రత అనేది అతి ముఖ్యం కాబట్టి, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. రద్దుల పరంపర కొనసాగుతుండటంతో, ఇండిగో సంస్థ స్టాక్ మార్కెట్‌లో భారీగా దెబ్బ తింది. కేవలం ఈ ఒక్క రోజు ట్రేడింగ్‌లోనే ఆ సంస్థ షేరు ధర 2.16 శాతం పడిపోయింది, ఇది పెట్టుబడిదారులలో ఆందోళన పెంచుతోంది.

ఈరోజు 500 విమానాల రద్దుకు తక్షణ మరియు ప్రధాన కారణం సాంకేతికం మాత్రమే. కానీ అది ఇండిగో సొంత నిర్ణయం కాదు, ప్రభుత్వం వైపు నుండి వచ్చిన అడ్డంకి. ఇండిగో తన విమానాలలో ఎక్కువగా ఎయిర్‌బస్ A-320 నియో (Neo) మోడల్‌ను ఉపయోగిస్తుంది. ఈ విమానాలలో ఇంజిన్‌లకు సంబంధించిన కొన్ని పాత సాంకేతిక లోపాలు మళ్లీ బయటపడుతున్నాయి. భద్రతా ప్రమాణాలను దృష్టిలో ఉంచుకుని, DGCA (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) కొన్ని విమానాలను ‘గ్రౌండ్’ (ఎగరడానికి అనుమతి నిరాకరించడం) చేసింది లేదా వాటిపై కఠినమైన నిబంధనలు విధించింది.

విమానాలను తాత్కాలికంగా ఆపరేట్ చేసుకోవడానికి మినహాయింపు ఇవ్వాలని ఇండిగో DGCAను కోరింది. కానీ ప్రయాణికుల భద్రత విషయంలో రాజీ పడకూడదనే ఉద్దేశంతో, DGCA దానికి అంగీకరించలేదు. ఇండిగో షెడ్యూల్‌లో ఉన్న విమానాల సంఖ్యకు తగ్గట్టుగా, ఆపరేట్ చేయడానికి సిద్ధంగా ఉన్న విమానాల సంఖ్య తగ్గింది. దీంతో వందల సంఖ్యలో విమానాలను రద్దు చేయక తప్పలేదు. ఇది సంస్థ చేతిలో లేని సమస్య.

మరోవైపుపైలట్లు నిర్దిష్ట సమయం కంటే ఎక్కువ పనిచేయకూడదు అని ఫ్లైట్ టైమ్ లిమిటేషన్స్ (FTL) అనే నియమాలు ఉండటం అనేది అంతర్గత సమస్యగా మారింది. పైలట్లకు సరైన విశ్రాంతి ఇవ్వడం చాలా ముఖ్యం.కానీ గతంలో, ఇండిగో ఈ FTL నిబంధనలను కాస్త అటూ ఇటూగా నిర్వహించేది. కానీ DGCA ఇటీవల ఈ నియమాలను చాలా కఠినంగా అమలు చేయడం మొదలుపెట్టింది.

Indigo flight

ఇండిగో సంస్థ తన విమానాలకు సరిపడా పైలట్లను నియమించుకోలేదు. ఎప్పుడైతే DGCA నిబంధనలు కఠినం చేసిందో, విశ్రాంతి లేని పైలట్లతో విమానం నడపడానికి వీలు లేకుండా పోయింది. అందుకే, విమానం ఉన్నా, పైలట్ లేని కారణంగా ఫ్లైట్ రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది సంస్థ నిర్వహణ లోపం.

విమానాల రద్దుకు ఈ రెండు వేర్వేరు కారణాలు కలవడంతోనే ఇప్పుడు ఇంత పెద్ద సమస్య తలెత్తింది.ఒకవైపు DGCA సాంకేతిక కారణాల వల్ల కొన్ని విమానాలను ఆపేసింది. మరోవైపు ఉన్న విమానాలను నడపడానికి సరిపడా విశ్రాంతి తీసుకున్న పైలట్లు లేరు.

ఈ డబుల్ అటాక్ కారణంగా, ఇండిగో తన రోజువారీ షెడ్యూల్‌ను కాపాడుకోలేక, పూర్తిగా విఫలమైంది. దీన్నే డొమినో ఎఫెక్ట్ అంటారు. ఒక చిన్న సమస్యకు తోడుగా మరో పెద్ద సమస్య రావడంతో మొత్తం వ్యవస్థ కుప్పకూలిపోయింది.

ఇప్పుడు ఇండిగో (Indigo flight)అంటేనే ప్రయాణికులు భయపడుతున్నారు. పూర్తిగా నమ్మకం (Reliability) కోల్పోతున్నారు. ప్రయాణికులు టిక్కెట్లు బుక్ చేసుకున్న తర్వాత, చివరి క్షణంలో రద్దు చేయడం లేదా ఆలస్యం చేయడం అనేది వారి వ్యక్తిగత, వృత్తిపరమైన ప్రణాళికలను పూర్తిగా నాశనం చేస్తుంది.

విమానం ఎందుకు రద్దైందో, ప్రత్యామ్నాయం ఏంటో చెప్పడానికి ఇండిగో (Indigo flight)సిబ్బంది అందుబాటులో ఉండకపోవడం, కనీసం నీరు, ఆహారం కూడా ఇవ్వకపోవడంతో ప్రయాణికులకు సంస్థపై కోపం, నిస్సహాయత పెరుగుతున్నాయి.

ఒకసారి బుక్ చేసుకుంటే, మనం కచ్చితంగా గమ్యస్థానం చేరుతామనే భరోసా ఇండిగో(Indigo flight) ఇవ్వలేకపోతోంది. అందుకే ఇప్పుడు ప్రయాణం పెట్టుకోవాలంటే, ఇండిగోను పక్కనపెట్టి, ఇతర విమానయాన సంస్థల టిక్కెట్లు బుక్ చేసుకోవడానికే ప్రజలు మొగ్గు చూపుతున్నారు.ఈ మొత్తం వ్యవహారం ఇండిగోకు చాలా పెద్ద పాఠం. కేవలం చౌక ధరకే కాకుండా, ప్రయాణికుల భద్రత, సమయపాలన విషయంలో నిబద్ధత చూపకపోతే, ఆ సంస్థకు భవిష్యత్తులో గడ్డుకాలం తప్పదు.

మరిన్ని నేషనల్ న్యూస్అప్ డేట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version