Kashmir : మళ్లీ మెరుస్తున్న పర్యాటక స్వర్గం..

Kashmir : చీకటి రోజులు దాటి, కశ్మీర్(Kashmir) మళ్లీ కొత్త ఉత్సాహంతో మెరుస్తోంది. లోయలో పర్యాటకుల సందడి మొదలైంది.

Kashmir:ఒకప్పుడు స్వర్గంలా కనబడ్డ కశ్మీర్ లోయ, ఉగ్రదాడుల నీడలో పర్యాటక రంగాన్ని కోల్పోయి కుదేలైంది. ముఖ్యంగా ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన దాడి తర్వాత కోట్ల విలువైన హోటల్, హౌస్‌బోట్ బుకింగ్‌లు రద్దై, పరిశ్రమ కుప్పకూలింది. కానీ, ఇప్పుడు ఆ చీకటి రోజులు దాటి, కశ్మీర్(Kashmir) మళ్లీ కొత్త ఉత్సాహంతో మెరుస్తోంది. లోయలో పర్యాటకుల సందడి మొదలైంది. త్వరలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా కశ్మీర్‌ను సందర్శించనున్నారని వార్తలు వస్తున్నాయి.

Kashmir

తిరిగి వస్తున్న సందర్శకులు.. చిగురిస్తున్న ఆశలు
ఉగ్రదాడి(Terror attack) తర్వాత పర్యాటకుల సంఖ్య గణనీయంగా పడిపోయినా, జూన్ రెండో వారం నుంచి పహల్గాం, కొకర్నాగ్, అచబల్, వేరినాగ్ వంటి అందమైన ప్రాంతాలకు సందర్శకుల రాక మొదలైంది.

మొదట్లో రోజుకు 200-400 మంది మాత్రమే వస్తుండగా, ఇప్పుడు ఆ సంఖ్య అద్భుతంగా 5,000కు పైగా చేరుకుంది. జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పర్యాటక రంగాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు విస్తృతంగా పర్యటిస్తూ, కీలక సమావేశాల్లో పాల్గొంటున్నారు.

ట్రావెల్ ఏజెంట్స్ సొసైటీ ఆఫ్ కశ్మీర్ అధ్యక్షుడు మొహమ్మద్ ఇబ్రహీం సియాహ్ తెలిపిన వివరాల ప్రకారం, పర్యాటక హోటళ్లలో ప్రస్తుతం 20-30 శాతం గదులు నిండుతున్నాయి. ఇది గతంతో పోలిస్తే ఒక సానుకూల పరిణామం.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి కృషి..
కశ్మీర్ పర్యాటకాన్ని పునరుజ్జీవింపజేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా కృషి చేస్తున్నాయి. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ జూన్ 18-19న పహల్గాంను సందర్శించారు. ఆ తర్వాత జూలై 7-8 తేదీలలో శ్రీనగర్‌లో జరిగిన ‘పాన్ ఇండియా టూరిజం సెక్రటరీల’ సమావేశంలో పాల్గొన్నారు.

కశ్మీర్‌లో పర్యాటకం పూర్తిగా స్తంభించిపోయింది. కానీ ఇప్పుడు అది మళ్లీ పుంజుకుంటోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్యలు, ప్రతినిధి బృందాల రాక, జరుగుతున్న సమావేశాలు మంచి ఫలితాలను ఇస్తాయి. కశ్మీర్ పర్యాటకం తిరిగి ఊపందుకుంటుందని షెకావత్ ఈ కీలక సమావేశంలో విశ్వాసం వ్యక్తం చేశారు.

ఈ సమావేశంలో 2025-26 పర్యాటక బడ్జెట్, డెస్టినేషన్ డెవలప్‌మెంట్, అలాగే ప్రధానమంత్రి మోదీ ’50 ఐకానిక్ గ్లోబల్ డెస్టినేషన్స్’ విజన్‌లో భాగంగా జమ్మూకశ్మీర్‌ను అభివృద్ధి చేయడంపై లోతుగా చర్చ జరిగింది.

ప్రముఖుల సందర్శనలు, అమర్‌నాథ్ యాత్ర..

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ జూలై 3-4న తన భార్యతో కలిసి శ్రీనగర్‌లోని లాల్‌చౌక్‌లో టీ తాగి, స్థానికులతో కలివిడిగా మాట్లాడటం పర్యాటకుల దృష్టిని విశేషంగా ఆకర్షించింది.

అలాగే, జూలై 6న ప్రధానమంత్రి కార్యాలయ సలహాదారు తరుణ్ కపూర్ లాల్‌చౌక్‌లోని వ్యాపారులను, స్థానికులను కలిశారు. ఈ పర్యటనలు కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయనే సానుకూల సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాయి.

ఈ కార్యక్రమాలన్నీ ముఖ్యంగా అమర్‌నాథ్ యాత్ర(Amarnath Yatra) జరుగుతున్న సమయంలోనే జరగడం గమనార్హం. ఇప్పటివరకు 2 లక్షల మందికి పైగా యాత్రికులు పవిత్ర అమర్‌నాథ్ గుహను దర్శించుకున్నారు. 600 అదనపు సీఏపీఎఫ్ కంపెనీలతో భద్రతను మరింత పటిష్టం చేయడంతో, పర్యాటకులు, యాత్రికులలో భద్రతా భయం పూర్తిగా తగ్గింది.

మొత్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి కృషి కశ్మీర్ పర్యాటక రంగానికి కొత్త ఊపిరి పోస్తూ, లోయలో శాంతి, సాధారణ స్థితి నెలకొనేలా ఆశలు చిగురింపజేస్తోంది.

Exit mobile version