Deputy CM Pawan Kalyan
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan).. ఇటీవల కాలంలో ఏపీ రాజకీయాలకే కాకుండా, తెలంగాణ రాజకీయాల్లోనూ నిత్యం చర్చనీయాంశంగా మారుతున్నారు. కూటమిలోనే ఉంటామని స్పష్టం చేయడం, వైసీసీ మళ్లీ అధికారంలోకి రాదంటూ పదే పదే ప్రకటనలు చేయడం వరకు ఆయన మాట్లాడే ప్రతి మాట, చేసే ప్రతి ట్వీట్ హాట్ టాపిక్‌గా మారుతోంది.
ఇటీవల పవన్ ఇటీవల చేసిన ‘కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ వాళ్ల దిష్టి తగిలింది’ అనే వ్యాఖ్యలు ఏపీ, తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారం సృష్టించాయి. ఇది అధికారంలోకి రాకముందు అన్నా కూడా ఈసారి మాత్రం గట్టిగానే దుమారాన్ని రేపాయి. దీంతో అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ నాయకులు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. తెలంగాణ మంత్రులు దీనిపై హెచ్చరికలు జారీ చేశారు.
పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేశారా లేదా అన్నది పక్కన పెడితే.. ఆ మాటల వెనుక ఒక వ్యూహం దాగి ఉందనే విశ్లేషణ తాజాగా చర్చనీయాంశం అవుతోంది. ఏపీలో కూటమి బలంగా ఉండటంతో, తెలంగాణ పాలిటిక్స్‌లోకి కూడా పరోక్షంగా ప్రవేశించడం, జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించడం ఈ వ్యూహంలో భాగం కావొచ్చన్న టాక్ నడుస్తోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు పవన్‌ను విమర్శించడం ద్వారా, ‘పవన్ సెంట్రిక్’ డిబేట్‌ను కొనసాగించడానికి అవకాశం దొరికింది. వివాదం కాస్త సద్దుమణిగాక, జనసేన పార్టీ వివరణ ఇవ్వడం ద్వారా వివాదాన్ని అదుపులోకి తెచ్చారు.
అంతేకాదు పవన్ కొన్నాళ్లుగా హిందుత్వ ఎజెండాకు చాలా స్పష్టమైన ప్రాధాన్యత ఇస్తున్నారు. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఉండాలంటూ పదేపదే డిమాండ్ చేయడంతో పాటు, తాజాగా హిందువులు మేల్కొనాలంటూ పిలుపునిచ్చారు. తిరుప్పరన్ కుండ్రంలో కార్తీక దీపం వెలిగించడంలో అడ్డంకులు, హిందువులను చులకనగా చూస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేయడం, దేశంలో అత్యధిక సంఖ్యలో ఉన్న హిందువులు తమ మత విశ్వాసాల కోసం న్యాయపోరాటం చేయాల్సి రావడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ట్వీట్‌లు చేయడం ఈ ఎజెండాకు బలం చేకూర్చింది.
కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ యొక్క ప్రధాన సిద్ధాంతానికి పవన్ మద్దతు ఇవ్వడం, ఉత్తరాంధ్ర మరియు తెలంగాణలోని హిందుత్వ ఓటు బ్యాంకును ఆకర్షించడానికి ఒక వ్యూహాత్మక అడుగుగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ స్టాండ్‌తో, ఆయన ఒక ప్రాంతీయ నాయకుడిగానే కాకుండా, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నాయకుడిగా మారడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది
పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) ఇప్పుడు కేవలం వైసీసీని విమర్శించడం మాత్రమే కాకుండా, వారి భవిష్యత్ ఆశలపై కూడా దెబ్బ కొడుతున్నారు. “వైసీసీ మళ్లీ అధికారంలోకి రానే రాదు” అని పదేపదే చెప్తూ, 2029లో మళ్లీ పవర్‌లోకి వస్తామని కలలు కంటున్న వైసీపీకి గట్టి కౌంటర్ ఇస్తున్నారు. రాష్ట్రంలో మరో 15 ఏళ్లు కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని ఆయన స్పష్టం చేయడం, తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదంటూ ప్రకటనలు చేయడం రాజకీయ వేడిని పెంచుతోంది.
ప్రస్తుతం అధికారం పంచుకుంటున్న పవన్, తన పార్టీ మరియు కూటమికి ప్రజల్లో ఉన్న బలమైన విశ్వాసాన్ని చాటి చెప్పడానికి ఈ కామెంట్స్‌ను వినియోగిస్తున్నారు. 2029 ఎన్నికల కోసం ఇప్పటి నుంచే ప్రజల మనసుల్లో బలమైన నమ్మకాన్ని నాటడం, ప్రతిపక్షాన్ని నిరుత్సాహపరచడం ఈ రాజకీయ ఎత్తుగడ వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
పవన్ కల్యాణ్ చుట్టూ నిత్యం చర్చ జరగడానికి ఆయనకున్న పవర్ స్టార్ ఇమేజ్, అపారమైన ఫ్యాన్ బేస్ ప్రధాన కారణాలు. అయితే, ఇటీవల కాలంలో ఆయన చేసిన ప్రతీ మాట కేవలం ఉద్వేగంతో కూడినది కాకుండా, ఒక పకడ్బందీ వ్యూహంలో భాగంగానే జరుగుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అధికారంలో ఉన్నా, అపోజిషన్‌లో ఉన్నా ఆయన చుట్టే చర్చ నడవడం అనేది భారత రాజకీయాల్లో పవన్ యొక్క పెరుగుతున్న ప్రభావానికి నిదర్శనం.
