Bihar Assembly Election
దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిహార్ అసెంబ్లీ ఎన్నిక(Bihar Assembly Election)లకు నగారా మోగింది. దీనికి సంబంధించిన షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ విడుదల చేసింది. సమస్యాత్మక ప్రాంతాలు ఎక్కువగా ఉండే బిహార్ లో ఈ సారి రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిహార్ లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలుండగా…నవంబర్ 6న తొలి విడత ఎన్నికలు నిర్వహించనున్నారు.
అలాగే నవంబర్ 11న రెండో విడత నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. ఈ సారి బిహార్ లో అత్యంత పకడ్బందీగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తామని సీఈసీ జ్ఞానేష్ కుమార్ చెబుతున్నారు. కాగా రెండు విడతల్లోనూ చాలా వరకూ సమస్యాత్మక ప్రాంతాలున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 10న తొలి విడత ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేయనుండగా , అక్టోబర్ 17 వరకూ నామినేషన్లు దాఖలు చేయొచ్చు.
అక్టోబర్ 20వ తేదీ లోపు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. నవంబర్ 6న తొలి దశ పోలింగ్ జరుగుతుంది. అలాగే రెండో దశకు సంబంధించి అక్టోబర్ 13న నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. అక్టోబర్ 20 నుంచి నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు అక్టోబర్ 23 చివరి తేదీగా నిర్ణయించారు. నవంబర్ 11న రెండో దశ పోలింగ్ జరుగుతుంది. రెండు దశల్లో జరిగిన ఎన్నికల ఫలితాలు నవంబర్ 14న వెల్లడించనున్నారు.
బిహార్ లో 243 అసెంబ్లీ స్థానాలకు గానూ ఎస్సీలకు 38, ఎస్టీలకు 2 రిజర్వ్ చేశారు. పోలింగ్ నిర్వహణ కోసం బిహార్ లో 90,712 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్టు సీఈసీ జ్ఞానేష్ కుమార్ వెల్లడించారు. ప్రతీ నియోజకవర్గం నుంచీ పోలింగ్ జరుగుతున్న తీరును వెబ్ కాస్టింగ్ ద్వారా మానిటరింగ్ చేయనున్నట్టు వివరించారు.
బిహార్ లో మొత్తం 7.43 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. వీరిలో పురుషా ఓటర్లు 3.92 కోట్లుగా ఉంటే.. మహిళా ఓటర్లు 3.5 కోట్లు ఉన్నట్లు ఈసీ తెలిపింది.
ఇప్పుడు జరగబోయే ఎన్నికల కోసం కొత్తగా 14 లక్షల మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నట్లు ఈసీ తెలిపింది. ఇదిలా ఉంటే బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పలు కొత్త సంస్కరణలను ఈసీ అమలు చేయబోతోంది. ఈవీఎంలలో అభ్యర్థుల కలర్ ఫోటోలను ఏర్పాటు చేయబోతోంది. కౌంటింగ్ విషయంలో అప్రమత్తంగా ఉంటామని వెల్లడించింది. వీవీ ప్యాట్ ఓట్లలో ఏదైనా మిస్ మ్యాచ్ అయితే.. రీకౌంటింగ్ తప్పనిసరిగా ఉంటుందని సీఈసీ జ్ఞానేష్ కుమార్ స్పష్టం చేశారు. అని వెల్లడించారు.
బిహార్ ఓటర్ జాబితాను దాదాపు రెండు దశాబ్దాల తర్వాత పూర్తిస్థాయిలో సంస్కరించినట్టు తెలిపారు. ఇదిలా ఉంటే బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా 8 స్థానాలకు ఉపఎన్నికలు జరగనున్నాయి. వీటిలో తెలంగాణలోని జూబ్లీహిల్స్ కూడా ఉంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు సంబంధించిన పోలింగ్ నవంబర్ 11న జరగనుంది. ఫలితాలు నవంబర్ 14న వెల్లడి కానున్నాయి.